పాపం అశోక్ బాబు

ప‌రుచూరి అశోక్‌బాబు. ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంద‌రికీ ప‌రిచ‌యం ఒక‌ప్పుడు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే. అయితే, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న ఒక్కసారిగా [more]

Update: 2020-02-01 00:30 GMT

ప‌రుచూరి అశోక్‌బాబు. ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంద‌రికీ ప‌రిచ‌యం ఒక‌ప్పుడు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే. అయితే, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న ఒక్కసారిగా తెర‌మీదికి వ‌చ్చా రు. రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు గ‌ళం వినిపిస్తున్నారంటూ ఆయ‌న ప‌లు వేదిక‌ల‌ను పంచుకున్నారు. తెలంగాణ‌, ఏపీల్లో ఉమ్మడిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. దీంతో స‌మైక్య ఆంధ్ర ఉద్యమం స‌మ‌యంలో జోరుగా పేరు సాధించారు. అప్పటి వ‌ర‌కు కేవ‌లం ఉద్యోగుల‌కు, ఉద్యోగ సంఘాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైన అశోక్ బాబు త‌ర్వాత అంద‌రికీ ప‌రిచ‌య‌మ‌య్యారు.

ఎన్జీవో సంఘ నేతగా ఉన్నా…..

ఒక‌ప‌క్క ఎన్జీవో ప్రెసిడెంట్‌గా ఉంటూనే ఏపీలో కీల‌క రాజ‌కీయ నేత‌గా ఎదిగే ప్రయ‌త్నం చేశారు. ఇక వైసీపీ నాయ‌కుడు బ‌షీర్‌పై ఎన్జీవో ప్రెసిడెంట్‌గా గెలిచాక‌ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పాల‌న‌ను అమ‌రావ‌తికి తీసుకువ‌చ్చాక‌ ప్రభుత్వ నిర్ణయాల విష‌యంలో ఉద్యోగులు స‌హ‌క‌రించే విధంగా అశోక్ బాబు చ‌క్రం తిప్పారు. ఉద్యోగుల డిమాండ్లను ప‌రిష్కరిస్తూనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగుల‌ను కూడా మ‌లిచారు. ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నాయ‌కుడిగా ఆమెకు స‌పోర్ట్ చేయ‌డం కంటే చంద్రబాబు ప్రభుత్వానికే మొగ్గు చూపార‌న్న విమ‌ర్శలు కూడా ఆయ‌న ఎదుర్కొన్నారు.

టీడీపీ పక్షాన నిలబడి….

ఇక అశోక్‌బాబు బ‌లంగా టీడీపీ ప్రభుత్వ వాద‌న భుజాన‌కెత్తుకోవ‌డంతో బాబు ఆయ‌న‌ను రాజ‌కీయాల్లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఎన్జీవో ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, ఉద్యోగాన్ని, ఎన్జీవో ప్రెసిడెంట్ ప‌ద‌విని కూడా వ‌దులుకుని వ‌చ్చిన అశోక్‌బాబుకు చంద్రబాబు ఉత్తమ స్థానం క‌ల్పించారు. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ప్రభుత్వం పోయిన త‌ర్వాత కూడా టీడీపీ వాయిస్‌ను వినిపించ‌డంలో అశోక్ బాబు దూకుడుగానే ఉన్నారు.

మండలి రద్దయితే..?

ఎమ్మెల్సీగా ఇటీవ‌ల జ‌గ‌న్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలోనూ మండ‌లిలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్రస్తుతం మండ‌లి నెత్తిమీద క‌త్తి వేలాడుతున్న నేప‌థ్యంలో మండ‌లి ర‌ద్దయితే అశోక్ ప‌రిస్థితి ఏంట‌నేది .. ప్రధాన ప్రశ్న? మండ‌లి ర‌ద్దయితే.. అటు ఉద్యోగం పోయి.. ఎన్జీవో ప్రెసిడెంట్ పోయి.. రెంటికీ చెడ్డ రేవ‌డిగా మార‌డం మిన‌హా ఆయ‌న చేసేదేం ఉండ‌దు. మ‌రి అశోక్‌బాబు ఫ్యూచ‌ర్ ఉంటుందో ? డైల‌మాలో ప‌డుతుందో ? చూడాలి మరి.

Tags:    

Similar News