అశోక్ ని కెలుకుతున్నారే

విజయనగరం జిల్లా రాజకీయాల్లో తలపండిన నేత, యోధ అనదగ్గ వారు పూసపాటి అశోక్ గజపతిరాజు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు. [more]

Update: 2019-09-05 08:00 GMT

విజయనగరం జిల్లా రాజకీయాల్లో తలపండిన నేత, యోధ అనదగ్గ వారు పూసపాటి అశోక్ గజపతిరాజు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా అంతా అలా సాగిపోయింది. చంద్రబాబు ఎక్కడ ఎలా అనుకున్నా విజయనగరం దగ్గరకు వచ్చేసరికి అశోక్ గజపతిరాజుకే అన్నీ అప్పగించేవారు. ఆయన మాట మీదనే టికెట్ల పంపిణీ జరిగేది. ఇలా అన్ని రకాలుగా వైభోగం అనుభవించిన అశోక్ గజపతిరాజు 2014 ఎన్నికల్లో ఎంపీగా వెళ్ళడంతో పట్టు ఒక్కసారిగా సడలిపోయింది. దాంతో ఆయన్ని సైడ్ చేసే కార్యక్రమాలను హై కమాండ్ మద్దతు ఉందని భావించిన అశోక్ గజపతిరాజు చాలా కాలం పాటు అలిగిన సంఘటనలు ఉన్నాయి. తాజా ఎన్నికలకు ముందు కూడా కూతురు అతిథి గజపతిరాజుకు విజయన‌గరం ఎమ్మెల్యే టికెట్ కోసం అశోక్ పెద్ద ఫైటే చేశారని చెబుతారు.

ఓటమికి బాధ్యునిగానా…

నిజానికి విజయన‌గరం జిల్లాలో చాలా మటుకు టికెట్లు చంద్రబాబే ఈసారి స్వయంగా సెలెక్టు చేశారట. ఎంపీగా పోటీకి దిగిన అశోక్ గజపతిరాజు మాత్రం చివరి నిముషంలో కొందరిని తప్పించి తన వారిని పెట్టుకున్నారు. ఆ విధంగా బాబు మీద వత్తిడి తెచ్చారన్న ప్రచారం ఉంది. ఇక‌ అప్పట్లో జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు మాట చెల్లకుండా చేశారన్న బాధ గంటాలో ఉంది. విజయనగరం టికెట్ ని తన మనిషిగా ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు ఇప్పించుకోవాలనుకుని గంటా అనుకుంటే అశోక్ గజపతిరాజు తన కూతురుకు ఇప్పించుకున్నారు. ఇపుడు ఆమె దారుణంగా ఓడిపోవడమే కాదు, మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకుంది. దీంతో ఓడిన మూడు నెలల తరువాత విజయనగరం వచ్చిన గంటా తన బాణాలను అశోక్ గజపతిరాజు మీద వేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడం వల్లనే పార్టీ ఓడిందంటూ పాపాల భైరవునిగా అశోక్ గజపతిరాజు ని చేసేశారు.

ఇక రాజకీయ సన్యాసమే…..

అశోక్ గజపతి రాజు మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంలేదు. ఓ విధంగా ఆయన వైరాగ్యంలో ఉన్నారు. ఇపుడు గంటా వచ్చి కెలికినా కూడా ఆయన నుంచి మౌనమే సమాధానంగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబే తనన్ని తప్పించాలని చూశారన్న బాధ అశోక్ గజపతిరాజు లో చాలా కాలంగా ఉంది. దానికి తోడు గంటా లాంటి వారిని ముందు పెట్టి ఒక్క తాటి మీద ఉన్న జిల్లాను వర్గాలతో నింపేశారని, తన ఓటమికి కూడా ఈ వర్గాలే కారణమని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారు. ఇపుడు ఎటూ టీడీపీ అధికారంలో లేదు, మళ్ళీ వచ్చినా అశోక్ గజపతిరాజు కి ఎటువంటి పాత్ర కూడా ఉండదు, దాంతో అన్నీ ఆలోచించుకునే అశోక్ గజపతిరాజు మౌన ముద్రలోకి వెళ్ళారని అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో గంటా ఇపుడు వేలు పెట్టడం వెనక భవిష్యత్తు వ్యూహాలేంటి అన్న చర్చ కూడ సాగుతోంది.

Tags:    

Similar News