రాజు గారు… మారిపోయారు

విజయనగరం రాజులంటే పెద్ద పేరు. శతాబ్దాల చరిత్ర ఉన్న వంశానికి చెందిన వారు. రాచరికాలు పోయి ప్రజాస్వామ్య యుగం వచ్చినా జనం వారిని అలాగే గౌరవిస్తారు. వారు [more]

Update: 2020-01-12 12:30 GMT

విజయనగరం రాజులంటే పెద్ద పేరు. శతాబ్దాల చరిత్ర ఉన్న వంశానికి చెందిన వారు. రాచరికాలు పోయి ప్రజాస్వామ్య యుగం వచ్చినా జనం వారిని అలాగే గౌరవిస్తారు. వారు చెప్పిందే వేదం అనుకుంటారు. దానికి తగినట్లుగానే నిన్నటి వరకూ రాజులంటే అలాగే ఉండేవారు. ఇపుడు మాత్రం వయసు మీరడమో, రాజకీయ చాపల్యం పెరగడమో తెలియదు కానీ పెద్దాయన పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా అబద్దాలు చెప్పేస్తున్నారు. సులువుగా రాజకీయ ఆరోపణలు అశోక్ గజపతి రాజు గారు లాంటి వారు చేస్తూంటే జనం నోళ్ళు వెళ్ళబెట్టాల్సివస్తోంది మరి.

శ్రీనగర్ లాగట…

అమరావతి రాజధాని శ్రీనగర్ లా ఉందని అశోక్ గజపతిరాజు అంటూంటే ఇదేం పోలిక అంటూ తమ్ముళ్ళే తలలు పట్టుకోవాల్సివస్తోంది. శ్రీనగర్ లో ఉగ్రవాదం ఉందన్న కారణంగానో మరో రకంగానో నిర్బంధం ఉంది. అమరావతిలో అలాంటి నిర్బంధాలను అశోక్ గజపతిరాజు ఎక్కడ ఎలా చూశారో మరి, రాజధానిని రావణ కాష్టం చేస్తున్నారని తెగ నొచ్చుకుంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా అంటూ గట్టిగానే దబాయిస్తున్నారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉందా అని కూడా ఆశ్చర్యంగా రాజావారు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడేమైందో…?

తాను పౌర విమానయాన మంత్రిగా ఉన్నపుడు పక్కనే ఉన్న విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ని నిర్బంధించి అటు నుంచి అటే హైదరాబాద్ తరలించినపుడు రాజు గారికి ఇవేమీ గుర్తుకురాలేదా అని వైసీపీ నేతలు గట్టిగానే తగులుకుంటున్నారు. జగన్ని ఎన్నో సార్లు బాబు సర్కార్ అరెస్ట్ చేసినపుడు దేశంలో ఎక్కడా ఇలా జరగలేద‌ని నాడు అనిపించలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అశోక్ గజపతిరాజుకి అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేల మీద దాడులు కనిపించడంలేదని, చంద్రబాబు అరెస్ట్ మాత్రమే కనిపిస్తోందని, దాంతో కాశ్మీర్, శ్రీనగర్ అంటూ వింత పోలికలు తెస్తూ జనాలను తానే భయపెడుతున్నారని అంటున్నారు.

విడ్డూరమే మరి…..

పోలవరం ప్రాజెక్ట్ ని వైసీపీ సర్కార్ ఆపేసిందని కూడా అశోక్ గజపతిరాజు అంటున్నారు. నిజానికి ఆ ప్రాజెక్ట్ ఎక్కడా ఆపలేదన్నది అందరికీ తెలిసిందేనని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకాన్ని కూడా జగన్ నిలుపుచేశారని అశోక్ గజపతిరాజు అంటున్నారు. ఇది కూడా జగన్ స్వయంగా పరిశీలిస్తూ ముందుకు తెస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రైతులకు భూములు తిరిగి ఇవ్వడమేంటని రాజు గారు ఆశ్చర్యపొతున్నారు. అయితే అక్కడ భూములను ప్లాట్లుగా అభివృధ్ధి చేసి ఇస్తామని చెప్పినది టీడీపీయేనని, అదే తాము చేస్తున్నామని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి రాజు గారు తన సొంత జిల్లా విజయనగరాన్ని ఎలాగూ అభివృధ్ధి చేయలేకపోయారని, ఇపుడు పక్కన విశాఖ రాజధానిగా వస్తూంటే విషం కక్కడమే కాదు, అబద్దాలు కూడా చెప్పే స్థాయికి దిగిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారు గట్టిగానే బదులిస్తున్నారు. చంద్రబాబుతో సావాస దోషం వల్లనే అశోక్ గజపతిరాజు ఇలా అయ్యారని కూడా సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News