అశోక్ నోట బీజేపీ మాటలు… ?

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి వైసీపీ సర్కార్ కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి విదితమే. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ [more]

Update: 2021-07-19 11:00 GMT

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి వైసీపీ సర్కార్ కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి విదితమే. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ని తప్పించడంతో మొదలైన ఈ సమరం తిరిగి అశోక్ కోర్టు ద్వారా ఆ ట్రస్ట్ పదవిని దక్కించుకోవడంతో తారస్థాయికి చేరుకుంది. అశోక్ ని ఎలాగైనా తప్పించేస్తామని ఒక వైపు వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. మరో వైపు ట్రస్ట్ లో అక్రమాలు జరిగాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భూ దందాల మీద వేసిన దర్యాప్తు కమిటీ కూడా విచారణ చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అశోక్ గజపతిరాజు కూడా తన దూకుడు బాగా పెంచేశారు.

ఎదురుదాడికి దిగుతూ…?

వైసీపీ సర్కార్ ని పట్టుకుని ఈస్టిండియా కంపెనీ కంటే కూడా దారుణమని అశోక్ గజపతిరాజు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వారు కూడా ఇలాంటి దోపిడీ చేయలేదని అంటున్నారు. మాన్సాస్ ట్రస్ట్ పేరు ప్రఖ్యాతులను సర్వనాశనం చేయడానికి ప్రభుత్వ పెద్దలు పూనుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం వేలూ కాలూ పెట్టడం వల్లనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని అశోక్ గజపతిరాజు అంటున్నారు. ఇక అశోక్‌ను అటు రాష్ట్ర స్థాయి నుంచి.. ఇటు జిల్లా స్థాయి వైసీపీ నేత‌ల వ‌ర‌కు ప్రతి రోజు విమ‌ర్శిస్తూనే ఉంటున్నారు.

బాధ్యత ప్రభుత్వానిదే?

ఇవన్నీ పక్కన పెడితే గత పదిహేడేళ్ళుగా ట్రస్ట్ లో ఆడిటింగ్ జరగలేదు అన్నది తెలిసిందే. అయితే దీని మీద ప్రభుత్వ వర్గాల వాదన ఒకలా ఉంటే అశోక్ గజపతిరాజు మరోలా మాట్లాడుతున్నారు. ట్రస్ట్ లో ఆడిటింగ్ సరిగ్గా జరగలేదు అంటే దాని బాధ్యత ప్రభుత్వానిదే అంటోన్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే తప్పు చేసింది అన్నట్లుగా అశోక్ గజపతిరాజు మాటలు ఉన్నాయి. ఇక ఆడిటింగ్ అధికారులు అయితే ట్రస్ట్ ఆడిటింగ్ చేయించుకోవాల్సింది ట్రస్ట్ నిర్వాహకులే అని చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను నియమిస్తున్నారు అంటూ అశోక్ గజపతిరాజు ఇటీవల ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీ భాషను…

నిజానికి ఇలాంటి ఆరోపణలు కమలనాధులు చేస్తారు. కానీ అశోక్ గజపతిరాజు ఇలా మాట్లాడడం అంటే ఆయన కమలం పెద్దల భాషను వంటబట్టించుకున్నారా ? అన్న స‌రికొత్త చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ఒకపుడు అశోక్ ఇలా మాట్లాడేవారు కాదని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అశోక్ గజపతిరాజు తాను ఎక్కడా తగ్గను అంటూంటే ప్రభుత్వం కూడా సై అంటున్నారు. దీంతో మాన్సాస్ చిచ్చు అంతకంతకు పెరిగి పెద్దది అవుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎపుడో అన్నది చూడాల్సిందే.

.

Tags:    

Similar News