పెద్దాయన టీడీపీకి శోకమే మిగులుస్తారా.. ?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. దాని కంటే ముందు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను వంటబట్టించుకున్నారు. జనతా పార్టీ తరఫున తొలిసారిగా 1978లో ఆయన గెలిచి [more]

Update: 2021-08-11 12:30 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. దాని కంటే ముందు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను వంటబట్టించుకున్నారు. జనతా పార్టీ తరఫున తొలిసారిగా 1978లో ఆయన గెలిచి యువ ఎమ్మెల్యేగా ఏపీ విధాన సభకు వచ్చారు. ఆయనే పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగరం సంస్థానాధీశుడుగా, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రాజకీయ దురంధరుడుగా అశోక్ ని చెప్పుకుంటారు. చంద్రబాబు గురించి అంటారు కానీ అశోక్ గజపతిరాజు ది కూడా నాలుగున్నర దశాబ్దాలకు దాటిన సుదీర్ఘ అనుభవమే.

విసిగి వేసారి….

అశోక్ గజపతిరాజు తెలుగుదేశం రాజకీయాలతో విసిగిపోయారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన మచ్చలేని మహరాజుగా ఉన్నారు. అయితే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు మాత్రం ఆయనకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఈ రోజుకీ ఆయన అక్కడ ఏమైనా తప్పులు తెలిసి చేశారు అని ఎవరూ అనరు. కానీ తెలియకుండా ఏమైనా మాన్సాస్ ట్రస్ట్ లో జరిగినా ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అండదండలు కూడా కష్టకాలంలో ఆయనకు లేవు అనే అంటున్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అశోక్ గజపతిరాజు ఒంటిచేత్తో పోరాడుతున్నారు. దాంతో రాజా వారు పసుపు పార్టీ వైఖరి మీద విసిగి ఉన్నారని కినిసి ఉన్నారని కూడా అంటున్నారు.

గుడ్ బై కొట్టేస్తారా…?

తాజాగా అశోక్ గజపతిరాజు మీద ఒక రకమైన ప్రచారం అయితే సాగుతోంది. ఆయన బీజేపీలోకి వచ్చి చేరుతారు అంటున్నారు. ఆయన కూడా బీజేపీ మాటలనే తన నోటి వెంట పలుకుతున్నారు. హిందూ దేవాలయాలకు వైసీపీ ఏలుబడిలో రక్షణ లేదు అని కూడా అంటున్నారు. వైసీపీ హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని కూడా దుయ్యబెడుతున్నారు. ఇవన్నీ కూడా బీజేపీ పడికట్టు మాటలే. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అన్న ప్రచారం అయితే గట్టిగానే సాగుతోంది. తెలుగుదేశం విపక్షంలో ఉండడం, విజయనగరం జిల్లాలో ఈ రోజుకూ పెద్దగా పుంజుకోకపోవడం, మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం లేకపోవడంతో అశోక్ గజపతిరాజు కమలం పార్టీ వైపుగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అంటున్నారు.

అందలమేనా …?

అప్పట్లోనే ఒక మాట ప్రచారంలో ఉండేది. అశోక్ గజపతిరాజు కనుక వచ్చి చేరితే ఆయన్ని ఏదో రాష్ట్రానికి గవర్నర్ గా పంపించి ఆయన వారసురాలిని రాజకీయంగా ముందుంచి జిల్లాలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి బీజేపీ చూస్తోందని, అయితే మాన్సాస్ ట్రస్ట్ వివాదాలు అంతకంతకీ పెరిగిపోతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అశోక్ గజపతిరాజు కి సరైన దన్ను దొరకడంలేదు. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే వైసీపీ మీద గట్టిగా పోరాటం చేయవచ్చు అని భావిస్తున్నారు అంటున్నారు. అదే కనుక జరిగితే అశోక్ గజపతిరాజు రూపంలో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు. ఒక ఉత్తరాంధ్రాలో టీడీపీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుంది అంటున్నారు.

Tags:    

Similar News