చూస్కో… ఇక కాస్కో …నా రాజా….?

ఆయన చంద్రబాబు సమకాలీనుడు. ఇద్దరూ కలసి 1978లో ఒకేసారి చట్ట సభలలో అడుగు పెట్టారు. నాటి నుంచి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పూసపాటి సంస్థానాధీశుడిగా, తిరుగులేని [more]

Update: 2021-09-14 15:30 GMT

ఆయన చంద్రబాబు సమకాలీనుడు. ఇద్దరూ కలసి 1978లో ఒకేసారి చట్ట సభలలో అడుగు పెట్టారు. నాటి నుంచి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పూసపాటి సంస్థానాధీశుడిగా, తిరుగులేని రాజకీయ నేతగా అశోక్ గజపతిరాజుకు తెలుగు రాష్ట్రాలలో బాగా పేరుంది. టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీయార్ వెంట ఉన్న అశోక్ గజపతిరాజు పెద్దాయనకు వెన్నుపోటు పొడిచే ఘట్టాన చంద్రబాబుకు బాసటగా నిలిచి ఆ తరువాత టీడీపీలో కీలకం అయ్యారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అశోక్ గజపతిరాజు ఈ మధ్య కాలంలో మాత్రం చంద్రబాబుతోనే కాస్త ఎడం పాటిస్తున్నారు. అయితే రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు, పైగా వైసీపీ సర్కార్ ఆయన్నే కార్నర్ చేస్తోంది. దీంతో దిగిరాక తప్పింది కాదు అంటున్నారు.

బాబుకు డుమ్మా….

చంద్రబాబునాయుడు గత రెండున్నరేళ్ళలో అనేక సార్లు పొలిట్ బ్యూరో సమావేశాలు, పార్టీ మీటింగ్స్ నిర్వహించారు. అయితే వాటికి వరసగా డుమ్మా కొట్టిన అశోక్ గజపతిరాజు తాజాగా విశాఖలో జరిగిన ఉత్తరాంధ్రా రక్షణ చర్చా వేదికలో మెరిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి బాబు మాటనే అంతగా పట్టించుకోని అశోక్ గజపతిరాజు ఇతర నాయకులతో భుజం భుజం కలిపి మీటింగులో కూర్చోవడం అంటే ఆసక్తికరమే. పైగా రాజా వారు అంటే ఆ లెవెల్ వేరు అంటారు. మరి అన్ని మెట్లూ దిగి తమ్ముళ్లతో చెట్టాపట్టాలు వేయడం వెనక వ్యూహం ఏంటి, కారణాలు ఏంటి అని ఆలోచిస్తే బోలెడు ఉన్నాయిట.

కలవకపోతే తప్పే ….?

విజయనగరంలో ఇప్పటిదాకా అశోక్ గజపతిరాజు కేవలం అశోక్ బంగ్లానే టీడీపీ ఆఫీస్ చేసి తానే పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా కధ నడిపించారు. చివరికి అశోక్ బంగ్లాను దాటి టీడీపీ ఆఫీస్ వేరు పడిపోయింది. అలా చూస్తూండగానే క్యాడర్ కూడా చెల్లాచెదురు అయింది. మరో వైపు వైసీపీ కాస్తా గట్టిగానే రాజా వారిని టార్గెట్ చేసింది. అటు రికార్డులు మాయమైన వందలాది సింహాచలం భూముల కేసు మీద నిశితంగా దర్యాప్తు జరుగుతోంది. మరో వైపు చూసుకుంటే మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన వందలాది ఎకరాలు కూడా మటు మాయం అయ్యాయి. ఇక ఏకంగా అశోక్ గజపతిరాజు చైర్మన్ గిరీనే ఒక తడవ లాగేసిన వైసీపీ సర్కార్ ఇపుడు చాన్స్ కోసం ఎదురుచూస్తోంది. దాంతో అటు సంస్థానం, ఇటు రాజకీయం రెండూ కూడా కుదేల్ అయ్యే సీన్ కళ్ల ముందే కనిపిస్తోంది. దాంతోనే రాజకీయ తెలివిడితో అశోక్ గజపతిరాజు తమ్ముళ్ల జట్టుకు వచ్చేశారు అంటున్నారు.

స్టైల్ మార్చేశారు….

అశోక్ గజపతిరాజు అంటే ఊకదంపుడు మాట్లాడరు అంటారు, గాలి కబుర్లు చిల్లర ఆరోపణలు అసలు చేయరని కూడా పేరు. కానీ కాలం ఆయనలో మార్పు తెచ్చింది. అందుకే ఆయన వైసీపీ మీద ఎన్నడూ లేనంతగా గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. వీఎమ్మార్డీయే మాస్టర్ ప్లాన్ మీద అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్లాన్ 2042 అంటున్నారు వైసీపీ పెద్దలు. అప్పటికి వీరే కనుక పాలిస్తే కచ్చితంగా ఈ ప్రాంతంలో మనుషులు మాత్రం జీవించి ఉండరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు దొంగే దొంగని అంటున్నట్లుగా సింహాచలం భూములు వైసీపీ వారే దిగమింగి మాపైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం చెందారు. జైల్ నుంచి వచ్చిన వారు బెయిల్ మీద ఉన్న వారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అంటూ మంచి టైమింగ్ తో అశోక్ గజపతిరాజు చేసిన కామెంట్స్ కూడా వైసీపీని మండించేవే. ఈ సర్కార్ కి మంచి బుద్ధి ప్రసాదించాలి అని పైడితల్లమ్మతో పాటు సింహాద్రి నాధుడిని కూడా కోరుకుంటున్నాను అంటూ అశోక్ గజపతిరాజు సెటైరికల్ గా అనడం అంటే ఆయన కూడా చూస్కో నా రాజా అని వైసీపీకి ఇక మీదట చాలెంజెస్ చేస్తారన్న మాటేగా.

Tags:    

Similar News