రాజు గారికి కాపు కాయరా ?

రాజకీయాల్లో అవసరం తీరాకే ఏదైనా, ఎవరైనా. దానికి ఎన్నో ఉదంతాలు కళ్ల ముందే ఉంటాయి. ఇక చంద్రబాబు వెన్నంటి తొలి నుంచి ఉన్న అతి బలమైన మద్దతుదారుడు, [more]

Update: 2020-12-23 03:30 GMT

రాజకీయాల్లో అవసరం తీరాకే ఏదైనా, ఎవరైనా. దానికి ఎన్నో ఉదంతాలు కళ్ల ముందే ఉంటాయి. ఇక చంద్రబాబు వెన్నంటి తొలి నుంచి ఉన్న అతి బలమైన మద్దతుదారుడు, విజయనగరం పూసపాటి వంశాధీశుడు అయిన అశోక్ గజపతి రాజు రాజకీయ చరమాంకమే ఇపుడు ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తొంది. అశోక్ గజపతి రాజు పలుకుబడి విజయనగరంలో తగ్గుతోందా లేక తగ్గించారా అన్నది ఒక చర్చ అయితే నడుస్తోంది. అశోక్ గజపతి రాజు ఆయన ముందు జూనియర్ గా ఉన్న ఒక నాయకురాలు తిరుగుబాటు చేస్తే దాని మీద అధినాయకత్వం చేష్టలుడిగి చూస్తూండడమే ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఎన్నో సందేహాలకు తావు ఇస్తోంది అంటున్నారు.

గీత దాటినా….

విజయనగరం జిల్లా రాజకీయాల్లో చూసుకుంటే పీవీజీ రాజు మొదలు అశోక్ గజపతి రాజు కుటుంబానిది దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయం. మరి ఆయన ఎన్నో సార్లు మంత్రిగా పనిచేశారు. ఒక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. ఆయన జిల్లాలో ఎవరిని నిలబెడితే వారే ఎమ్మెల్యేలు అన్నది కూడా ఒకనాడు జరిగింది. విజయనగరం జిల్లా వరకూ అశోక్ గజపతి రాజు మాటే శిలాశాసనం. చంద్రబాబు కూడా ఆయన చెప్పినట్లే విని అలాగే చేసేవారు. అలాంటిది ఆరేళ్ళ క్రితం టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన మీసాల గీత ఇపుడు ఏకంగా అశోక్ నే ఎదిరిస్తోంది. ఆమె పార్టీ లైన్ దాటి మరీ వ్యవహరిస్తోంది. కానీ హై కమాండ్ కిమ్మనడంలేదు అంటే దీని వెనక రాజకీయం ఏంటో అశోక్ బంగ్లాకే అర్ధం కావడంలేదుట.

ధిక్కారాలు చేసినా…?

ఇక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నాయకురాలు గీత పార్టీని ఎన్నో సార్లు ధిక్కరించారని అశోక్ గజపతి రాజు వర్గీయులు చెబుతున్నారు. ఆమె 2019 ఎన్నికల్లో స్వయంగా అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తే ఓడించడానికి తనవంతుగా గట్టిగానే కృషి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద నాడే అశోక్ వర్గం హై కమాండ్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న వేదన ఒక వైపు ఉంది. దానికి తోడు ఇపుడు ఏకంగా పార్టీ ఆఫీస్ ఉండగానే రెండవ దుకాణం సొంతంగా తెరవడం దానికి టీడీపీకి చెందిన కీలక నేతలు హాజరు కావడం బట్టి చూస్తూంటే తెర వెనక మద్దతు ఎవరిదీ అన్న డౌట్లు వస్తున్నాయట.

టికెట్ డౌటే…..?

విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ పదవిని అదితి గజపతిరాజుకు ఇమ్మని స్వయంగా బాబును అశోక్ కోరినట్లుగా ప్రచారంలో ఉంది. కానీ బాబు మాటమాత్రంగానైనా చెప్పకుండా కిమిడి కళా వెంకటరావు కుటుంబానికి చెందిన కిమిడి నాగార్జునకు ఆ పదవిని కట్టబెట్టారు. కిమిడి కళా వెంకటరావు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉండగానే జిల్లాలో అశోక్ వర్గాన్ని ముప్పతిప్పలు పెట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇపుడు ఆయన హవా అలా కొనసాగిస్తూనే మరో వైపు అదితికి విజయనగరం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కకుండా చేసేందుకే గీతను ఉసిగొల్పు తున్నారని అంటున్నారు. దానికి టీడీపీ హై కమాండ్ కూడా మౌనంగా మద్దతు ఇస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి అదితికి అశోక్ గజపతి రాజు కి కూడా పార్టీ టికెట్లు దక్కడం కష్టమన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి జిల్లాలో సామాజికవర్గం పరంగా తూర్పు కాపులు బలంగా ఉన్నారు. అందుకే అశోక్ గజపతి రాజు లోని అగ్ర కులం ఇలా హఠాత్తుగా టీడీపీ హై కమాండ్ కి గుర్తుకువచ్చిందని కూడా అంటున్నారుట.

Tags:    

Similar News