ఆరునెలలు రిలీఫ్.. తాత్కాలికమేనా?

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కారు. మరో ఆరు నెలల పాటు ఆయనకు టెన్షన్ లేనట్లే. కానీ అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం భవిష్యత్ [more]

Update: 2020-08-19 16:30 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కారు. మరో ఆరు నెలల పాటు ఆయనకు టెన్షన్ లేనట్లే. కానీ అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం భవిష్యత్ లోనూ నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనన్నది విశ్లేషకుల అంచనా. చేతి దాకా అంది వచ్చి చేజారిన అధికారం కోసం బీజేపీ ప్రయత్నించక మానదు. ప్రస్తుతం బీజేపీ మౌనం పాటిస్తున్నా అది తాత్కాలికమేనన్నది కాంగ్రెస్ నేతలకూ తెలియంది కాదు. అందుకే అశోక్ గెహ్లాత్ విజయం ఆరు నెలలకే పరిమితమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

వెంటిలేటర్ పై ఉన్నట్లే…

రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ కు 107 మంది సభ్యుల మద్దతు ఉంది. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. అయితే వేరు కుంపటి పెట్టుకుని తిరిగి కాంగ్రెస్ లో చేరిన సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపైనే బీజేపీ దృష్టి సారించిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వారిని తిరిగి పార్టీలో చేర్చుకున్నప్పటికీ గతంలో లభించిన గౌరవం, ఆమోదం ప్రభుత్వంలో లభించదన్నది బీజేపీ అంచనా. ప్రస్తుతమున్న బలంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉన్నట్లే.

పైలట్ వర్గం ఎమ్మెల్యేలతో….

సచిన్ పైలట్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అయితే సచిన్ పైలట్ కాంగ్రెస్ హైకమాండ్ తో రాజీ కుదుర్చుకోవడతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. కానీ బీజేపీ చూస్తూ ఊరుకునే పరిస్థిితి లేదంటున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ కాంగ్రెస్ పార్టీని నిలువరించి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.

తాత్కాలిక ఉపశమనమేనా?

తాజాగా అశోక్ గెహ్లాత్ కు సచిన్ పైలట్ వర్గం మద్దతిచ్చినప్పటికీ భవిష్యత్తులో తిరిగి అసంతృప్తులు మొదలవుతాయన్న అంచనాలో ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. కేవలం పద్దెనిమిది నెలల్లోనే అశోక్ గెహ్లాత్ ప్రభుత్వంలో లుకలుకలు బయలుదేరాయి. అందుకే బీజేపీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. రాజస్థాన్ లో ఎప్పుడూ ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం మరోసారి గెలిచిన చరిత్ర లేదు. మూడేళ్ల పాటు అశోక్ గెహ్లాత్ కు ఎటువంటి ఆటంకాలు కల్గించకుంటే వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయినా బీజేపీ అధినాయకత్వం ఆలోచనలు మాత్రం అశోక్ గెహ్లాత్ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం కొనసాగించకూడదన్నదే. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాత్ కు ఆరు నెలల పాటు సాఫీగా పాలన సాగించుకునే వీలు చిక్కింది. ఆయన అసెంబ్లీ సమావేశాలను కూడా కోరుకున్నది అందుకే.

Tags:    

Similar News