మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయటగా?

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదరుగా ఉండనిచ్చేట్లు లేదు. కొన్నాళ్ల క్రితం సంక్షోభంలో కూరుకుపోయిన రాజస్థాన్ సర్కార్ ఎట్టకేలకు కుదురుకుంది. సచిన్ పైలట్ సంక్షోభం నుంచి బయటపడి [more]

Update: 2020-12-12 17:30 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదరుగా ఉండనిచ్చేట్లు లేదు. కొన్నాళ్ల క్రితం సంక్షోభంలో కూరుకుపోయిన రాజస్థాన్ సర్కార్ ఎట్టకేలకు కుదురుకుంది. సచిన్ పైలట్ సంక్షోభం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈవిషయాన్ని స్వయంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించడం విశేషం. అయితే ఈసారి పెద్ద నేతలను వదిలేసి ఎమ్మెల్యేలపై బీజేపీ గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక్కడ పారకపోవడంతో….

బీజేపీ ఇప్పటికే గోవా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్ లో మాత్రం బీజేపీ మంత్రతంత్రాలు పారలేదు. కొన్ని రోజుల క్రితం సచిన్ పైలట్ రూపంలో అవకాశం వచ్చింది. దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నించారు. సచిన్ పైలట్ ను జ్యోతిరాదిత్య సింధియాలా బీజేపీలోకి లాగాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే పైలట్ మాత్రం అందుకు మొగ్గు చూపలేదు.

కుదురుకుంటున్న సమయంలో….

మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ ను బుజ్జగించడంతో రాజస్థాన్ లో రాజకీయం సర్దుబాటు అయింది. తిరిగి అశోక్ గెహ్లాత్ తన పాలన తాను చేసుకుంటున్నారు. మరోవైపు రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో రాజస్థాన్ నుంచి కూడా పెద్దయెత్తున రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటంలో పంజాబ్ తో పాటు రాజస్థాన్ రైతులు కూడా ఉన్నారు. వీరి వెనక అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఉందని బీజేపీ మళ్లీ ఆపరేషన్ మొదలుపెట్టిందంటున్నారు.

ఈసారి షాయేనట….

మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిపై అనర్హత వేటు పడటంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలను చూపి రాజస్థాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు. ఈసారి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారంటున్నారు. రాజస్థాన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టకుండా బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలోనే ఉంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News