బంగ్లాను వదలడం లేదే

విజయనగరం జిల్లా రాజకీయాలు అంటేనే పూసపాటి అశోక్ గజపతిరాజు వారి ప్రమేయం తప్పకుండా ఉండాల్సిందే. కొన్ని దశాబ్దాల పాటు జిల్లాను శాసించిన కుటుంబం వారిది. అటువంటి అశోక్ [more]

Update: 2019-08-22 05:00 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలు అంటేనే పూసపాటి అశోక్ గజపతిరాజు వారి ప్రమేయం తప్పకుండా ఉండాల్సిందే. కొన్ని దశాబ్దాల పాటు జిల్లాను శాసించిన కుటుంబం వారిది. అటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇపుడు బంగ్లా నుంచి బయటకు రావడంలేదు. ఎన్నికల్లో ఓటమిపాలు అయిన తరువాత రాజుగారి అయిపూ అజా లేకుండా పోయింది. చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి మీటింగు పెట్టినా కూడా అశోక్ గజపతిరాజు డుమ్మ కొట్టారు. పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న ఆయన ఆ కీలక భేటీని కూడా ఎగ్గొట్టారు. దాంతో రాజుగారి వైఖరి ఏంటి అన్నది పార్టీ నాయకులకే కాదు, అధినాయకత్వానికి కూడా అంతుబట్టడంలేదు. ఓ విధంగా అశోక్ గజపతిరాజు పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో అధినేత చంద్రబాబు వైఖరి మీద గుర్రుగా ఉన్నారని ప్రచారంలో ఉంది. గత కొన్నేళ్ళుగా తాను అన్నుకున్నట్లుగా జిల్లా పార్టీని నడపనీయకుండా చేశారని, దాని ఫలితమే ఎన్నికల్లో టీడీపీకి జిల్లాలో గుండు సున్నా వచ్చిందని అశోక్ గజపతిరాజు వాపోతున్నారట.

పార్టీ తీరు అస్తవ్యస్థం….

జిల్లాలో పార్టీ తీరు చూస్తే పూర్తిగా సంక్షోభంలో ఉంది. సరైన నాయకత్వం లేదు. అన్నింటికీ పెద్ద దిక్కుగా ఉండాల్సిన అశోక్ గజపతిరాజు మౌనరాగం ఆలపించడం వల్ల సైకిల్ కి ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోయాయి. అదే సమయంలో టీడీపీలో ఉన్న మిగిలిన నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా ప్రతిపక్ష టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు అన్న క్యాంటీన్లపై జిల్లాలో చేసిన ఆందోళనలు సైతం పేలవంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలో తెలుగు తమ్ముళ్ళు పెద్దగా కనిపించలేదు. ఇక అశోక్ గజపతిరాజు ఇలాంటి వాటికి రారని ముందే తెలుసు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టినా నిన్నటి వరకు పదవులు అనుభవించిన నాయకులు కూడా ఆ వైపుగా తొంగి చూడలేదు. దాంతో తెలుగుదేశం గత వైభవమేనా అన్న చర్చ మొదలైపోయింది.

బొబ్బిలి రాజుకి పగ్గాలా..?

విజయనగరం జిల్లా పార్టీ బాధ్యతలను మాజీ మంత్రి బొబ్బిలి రాజు అయిన సుజయ కృష్ణ రంగారావుకు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆయన అయితేనే పార్టీకి కొంతవరకూ అండగా ఉంటారన్న భావన వ్యక్తం అవుతోంది. బొబ్బిలిలో రంగారావు పార్టీ ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఆయనకు రాజకీయంగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ సంస్థాగత మార్పుల్లో పొలిట్ బ్యూరోలోకి తీసుకుని జిల్లా పగ్గాలు ఇస్తారని అంటున్నారు. అంటే ఓ విధంగా ఇక్కడ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ని పక్కన పెట్టినట్లేనా అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఆయనే పెద్దదిక్కు….

అయితే అశోక్ గజపతిరాజు లా జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం కల్పించే విషయంలో సుజయ కృష్ణ రంగారావు అందరినీ కలుపుకుని వెళ్లగలరా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వైసీపీ కల్చర్ లో రాజకీయం చేసిన బొబ్బిలి రాజు గారు టీడీపీని పూర్తిగా సొంతం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయనకు వైసీపీలో పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. ఒక్క బొత్స సత్యనారాయణ తప్ప మరెవరూ అక్కడ ఆయనకు అడ్డు కాదు ఎటూ బొత్సకు, జగన్ కి చెడితే బొబ్బిలి రాజు మళ్ళీ వైసీపీ వైపు చూస్తారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతానికైతే విజయనగరం జిల్లా వరకూ చూసుకుంటే బొబ్బిలి రాజు తప్ప పెద్ద దిక్కు టీడీపీకి కనిపించడంలేదంటున్నారు.

Tags:    

Similar News