వేటు తప్పదా…?

మంత్రి అవంతి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నారట. ఆయన పనితీరుపైనా జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. [more]

Update: 2019-09-20 02:00 GMT

మంత్రి అవంతి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నారట. ఆయన పనితీరుపైనా జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గోదావరి నదిలో పడవ ప్రమాదంలో అవంతి శ్రీనివాస్ పై ఆరోపణలు వస్తుండటంతో వైఎస్ జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన గోదావరి నదిలో పాపికొండల ప్రయాణంలో పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు నలభై మంది వరకూ మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన స్థలాన్ని వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించారు.

అవంతితో పరిచయాలను….

అయితే ఈ పడవ యజమాని విశాఖకు చెందిన వ్యక్తి. అయితే గత కొంత కాలం క్రితం విశాఖ నుంచి వచ్చి రాజమండ్రిలో రాయల వశిష్ట బోటు యజమాని వెంకటరమణ ప్రస్తుతం జనసేన నేతగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యంలో కూడా ఉన్నారని చెబుతున్నారు. వెంకటరమణ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొత్త వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గోదావరిలో బోటు వ్యాపారం నిర్వహిస్తూనే ఉన్నారు. పైగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తనకు పరిచయం ఉన్న అవంతి శ్రీనివాస్ టూరిజం మంత్రి కావడంతో వెంకటరమణకు మరింత కలసి వచ్చింది.

ఈ బోటుకు అనుమతి…..

గోదావరిలో వరద ఉధృతిగా ఉండటంతో పాపికొండల ప్రయాణాన్ని టూరిజం శాఖ రద్దు చేసింది. గోదావరిలోకి ఏ బోటునూ అనుమతించలేదు. అయినా వెంకటరమణకు చెందిన బోటు మాత్రం ఆరోజు గోదావరిలో పరుగులు పెట్టడానికి కారణం అవంతి శ్రీనివాస్ అన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జగన్ సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు కూడా కొందరు ఇదే ఫిర్యాదును చేసినట్లు తెలిసింది. పోలీసులు, ఇరిగేషన్, టూరిజం శాఖలు కూడా వెంకటరమణ బోటును అడ్డుకోకపోవడం వెనక మంత్రి అవంతి శ్రీనివాస్ కారణమన్నవాదనలు విన్పిస్తున్నాయి.

శాఖను తప్పిస్తారా?

ఇదేసమయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. దేవీపట్నం ఎస్ఐ తొలుత బోటుకు అనుమతివ్వలేదని, అయితే అవంతి శ్రీనివాస్ నుంచి ఫోన్ రావడంతోనే బోటుకు అనుమతిచ్చారని హర్షకుమార్ ఆరోపణలు చేశారు. ఒక్క హర్షకుమార్ మాత్రమే కాదు అక్కడి ప్రత్యక్ష సాక్షులు, కొందరు స్థానికులు కూడా ఇదేరకమైన ఆరోపణలు చేయడం విశేషం. దీంతో అవంతి శ్రీనివాస్ ను ఆ శాఖ నుంచి జగన్ తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే సీనియర్ మంత్రులతో జగన్ చర్చించినట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా అవంతి శ్రీనివాస్ పై వేటు పడే అవకాశముందంటున్నారు. అవంతి శ్రీనివాస్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. అయితే వైఎస్ జగన్ బోటు ప్రమాదం పై విచారణ కమిటీ వేశారు. బోటు ప్రమాదానికి కారణాలు, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని జగన్ ఆదేశించారు. కమిటీ నివేదికను 21 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది.

Tags:    

Similar News