అవంతి ఇదేం పని…?

ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచుతామని, గత టీడీపీ హయాంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని జగన్ తన పాదయాత్రలో చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా చేసిన [more]

Update: 2019-07-13 13:30 GMT

ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచుతామని, గత టీడీపీ హయాంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని జగన్ తన పాదయాత్రలో చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారంలోనూ ఇదే సంగతి గట్టిగా చెప్పారు. అనుకున్నట్లుగా జగన్ సర్కార్ కొలువు తీరింది. ఇపుడు తెరిపించే కార్యక్రమానికి బదులు మూయించేందుకు మంత్రి అవంతి శ్రీనివాసరావు సిధ్ధం కావడమే అసలైన చిత్రం. విశాఖ జిల్లాలో చిట్టివలస జ్యూట్ మిల్లు చాలా ప్రసిద్ది చెందింది. వందేళ్ళ చరిత్ర కలిగిన నార కర్మాగారం ఇది. ఏపీలోనే అతి పెద్ద పరిశ్రమ ఇది. ఆరు వేల మంది కార్మికులు ఈ జ్యూట్ మిల్లులో పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో పది వేల మంది ఉపాధి పొందుతున్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన జ్యూట్ మిల్లుని తాను అధికారంలోకి వస్తే తెరిపించి తీరుతానని జగన్ గత ఏడాది చిట్టివలసలో పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు.

మంత్రి అవంతి ఆలా చేశారుగా….

ఇక ఈ జ్యూట్ మిల్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు సొంత నియోజకవర్గం భీమిలీలోఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధిగా అవంతి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జ్యూట్ మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. గట్టిగా రెండు నెలలు కాలేదు ఇపుడు మిల్లుని శాశ్వతంగా మూయించేందుకు మంత్రి దగ్గరుండి మరీ ఒప్పందం చేయించడం పట్ల కార్మిక లోకం రగిలిపోతోంది. దీని మీద జ్యూటు మిల్లు యాజమాన్యంతో, అటు కార్మిక వర్గాలతో, మరో వైపు కార్మిక మంత్రి జయరాం తో కలసి చర్చలు చేసిన మంత్రి అవంతి చివరికి సాధించింది ఏంటి అంటే జ్యూటు మిల్లు మూయించేయడం. ఇక చరిత్రలో ఈ మిల్లు చూసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తెరచుకునే అవకాశమైతే లేకుండా చేయడం.

యాజమాన్యానికే లాభంగా….

మంత్రి అవంతి శ్రీనివాసరావు హడావుడిగా చర్చలు పెట్టి చేసిన ఒప్పందం జ్యూటు మిల్లు యాజమాన్యానికే అనుకూలంగా ఉందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. జ్యూటు మిల్లుకు సంబంధించి ఉన్న 70 ఏకరాల స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి యాజమాన్యానికి సహకరించేలా మంత్రి ఒప్పందం కుదిర్చారని, ఆ భూమి విలువ అక్షరాలా 700 కోట్ల పై మాటగా ఉంటుందని కూడా కార్మిన సంఘాల నాయకులు చెబుతున్నారు. నిజానికి ఈ మిల్లు మూత పడింది 2009 ఏప్రిల్ 20న. ఆ తరువాత ఎమ్మెల్యే అయ్యారు అవంతి తాను మిల్లుని తెరిపిస్తాను అంటూనే అయిదేళ్ళు గడిపేశారు. ఇపుడు మళ్ళీ రెండవమారు భీమిలీ ఎమ్మెల్యే కాగానే మిల్లు తెరిపించి అందరికీ ఉద్యోగాలు ఉండేలా చూస్తానని చెప్పి మరీ ఇలా చేశారని అంటున్నారు.

తొలి హామీ తప్పారా…?

జగన్ తన తొలి హామీ తప్పారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. చిట్టివలస జ్యూట్ మిల్లు నుంచే ఇది ప్రారంభం అయిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులకు జ్యూట్ మిల్లు యాజమాన్యంతో మంచి సంబంధాలు ఉన్నాయని, లోపాయికారిగా వారికి సహకరించి కార్మికుల నోట్లో మట్టికొట్టారని సీపీఎం నాయకుడు సీహెచ్ నరసింగరావు విమర్శించారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని కూడా ఆయన అన్నారు. వేలాది మంది కార్మికులు, వారిని నమ్ముకున్న కుటుంబాలు ఇపుడు రోడ్డు ఎక్కాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద మిల్లు మూయించడం ద్వారా జగన్ సర్కార్ అప్రతిష్ట మూటకట్టుకందని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News