తన కోపమే ఆయనకు శాపమవుతుందటగా ?

పదేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారిన చరిత్ర విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ది. ఆయన ఎట్టకేలకు రాజకీయాల్లోకి వచ్చినందుకు గానూ అర్ధం [more]

Update: 2020-04-21 12:30 GMT

పదేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారిన చరిత్ర విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ది. ఆయన ఎట్టకేలకు రాజకీయాల్లోకి వచ్చినందుకు గానూ అర్ధం పరమార్ధం తెలుసుకున్నారు. గట్టిగానే గురి చూసి మరీ అతి తక్కువ కాలంలోనే అమాత్యుడైపోయారు. అయితే అవంతి శ్రీనివాస్ కి సహజంగానే కోపం ఎక్కువ అన్న ప్రచారం ఉంది. అది ఇపుడు ఆయన పదవి పాలిట శాపంగా మారుతోంది అంటున్నారు. కోపం వస్తే ఎంతటివారినైనా అవంతి శ్రీనివాస్ చూడరని కూడా అంటారు. అదే ఇపుడు కొంపముంచేలా ఉందిట.

విజయసాయితోనే …

అవంతి శ్రీనివాస్ పెట్టుకోక పెట్టుకోక మరీ జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డితోనే పెట్టుకున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డి విశాఖ జిల్లాను నోడల్ జిల్లాగా తీసుకున్నారు. ఆయన విశాఖలోనే ఫ్లాట్ కొనుక్కుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉంటే పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీలో లేకపోతే విశాఖలో చిరునామా అన్నట్లుగా విజయసాయిరెడ్డి ఉంటున్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనకు పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం జై కొడతారు. ఆయన ఇమేజ్ అలాంటిది. అదే ఇపుడు అవంతి శ్రీనివాస్ కి నచ్చడంలేదుట. తనని తక్కువ చేసి ఎమ్మెల్యేలంతా విజయసాయిరెడ్డి వెంట ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారుట.

అలకపానుపు…..

కరోనా విపత్తు వేళ విజయసాయిరెడ్డితో విభేదాలు మరింత ముదిరిన కారణంగా మంత్రి ఏకంగా అలకపానుపు ఎక్కారని టాక్. ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా అవంతి శ్రీనివాస్ ఎంపీ విజయసాయిరెడ్డితో వేదిక పంచుకోవడంలేదు. దీంతో ఇదిపుడు పార్టీలో కొత్త చిచ్చుకు దారి తీస్తోంది. మంత్రి, ఎంపీ ఎడముఖం పెడముఖంగా ఉండడంతో అధికారులు సైతం నలిగిపోతున్నారు. ఎంపీగా విజయసాయిరెడ్డి ఉన్నా ఆయన కూడా క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఉంటున్నారు. ఇక ఆయన తానే స్వయంగా జిల్లాలో అధికార స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. దీంతో తనను పక్కన పెడుతున్నారన్న బాధ అవంతిలో ఎక్కువైపోతోంది. ఈ పరిణామాలతో అవంతి శ్రీనివాస్ ఎంపీ విజయసాయిరెడ్డికి దూరం పాటిస్తున్నారు.

పదవీగండమే….

నిజంగా చూస్తే ఎవరైనా జగన్ తో గొడవ పడి వైసీపీలో ఉండగలుగుతారా. అటువంటి జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన విజయ‌సాయిరెడ్డితో పెట్టుకుంటే మంత్రి పదవికే ఎసరు ఉంటుందన్న సంగతిని అవంతి శ్రీనివాస్ గుర్తిస్తున్నారా అని వైసీపీలోనే చర్చ సాగుతోంది. మంత్రి కోపంతో చేస్తున్న పనుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ అయిపోతున్నారని అంటున్నారు. మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఈ రోజు ఉన్నారంటే విజయసాయిరెడ్డి సిఫార్స్ కారణంగానే అని అంటున్నారు. అటువంటి విజయసాయిరెడ్డితో గొడవ పడితే విస్తరణలో మొదట పదవి పోయేది అవంతికేనని కూడా అంటున్నారు. మొత్తం మీద అవంతి రాజకీయంగా దూకుడుగా వేస్తున్న అడుగులు ఆయన భవిష్యత్తుని ఏం చేస్తాయోనని కూడా పార్టీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

Tags:    

Similar News