అవంతికి మంత్రి గిరీ గోవిందా…?

మొత్తానికి జగన్ తీసేసే మంత్రుల జాబితాలో విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు పేరు కూడా తాజాగా వచ్చి చేరింది అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అవంతిది పూర్ [more]

Update: 2021-03-28 09:30 GMT

మొత్తానికి జగన్ తీసేసే మంత్రుల జాబితాలో విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు పేరు కూడా తాజాగా వచ్చి చేరింది అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అవంతిది పూర్ పెర్ఫార్మెన్స్ అని అధినాయకత్వం మార్కులు వేసేసింది. ఇక ప్రతిష్టాత్మకమైన జీవీఎంసీ ఎన్నికలను మంత్రి అంత సీరియస్ గా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఆయన కార్పొరేటర్ గా తన కుమార్తె గెలుపునకే ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా తాను ప్రాతినిధ్యం వహించిన భీమిలీలో కూడా ఎక్కువగా సీట్లు తేలేకపోయారని కూడా చెబుతున్నారు.

డేంజర్ లో పడ్డారా….?

మంత్రిగా రెండేళ్ళు దగ్గర పడుతున్నా విశాఖ జిల్లాల్లో పాలనాపరంగా అవంతి శ్రీనివాసరావు పట్టు సాధించలేకపోయారు అన్నది ప్రచారంలో ఉంది. మంత్రిగా దూకుడు ప్రదర్శించలేకపోయారు అన్నది కూడా విమర్శగా ఉంది. ఇక రాజకీయంగా చూస్తే తాన్ సేఫ్ జోన్ లో ఉండాలన్న ఆరాటమే తప్ప పార్టీని బలోపేతం చేయలేకపోయారు అన్నది కూడా ఇంకో విమర్శ. నిజానికి విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక దశలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది అవంతి శ్రీనివాసరావు అన్న ఆగ్రహం కూడా అధినాయకత్వంలో ఉంది. ఇపుడు చూస్తే కీలకమైన జీవీఎంసీ ఎన్నికల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు తన ప్రభావాన్ని ఎక్కడా చూపించలేకపోయారు అన్నది ఇంకో ఆగ్రహంగా ఉంది.

గెలిచిన చోటనే ….

విశాఖ జిల్లా భీమిలీ టీడీపీకి కంచుకోట. అలాంటి చోట అవంతి శ్రీనివాసరావు రెండు సార్లు గెలిచారు. ఆయన ఉండేది మాత్రం విశాఖలో. మరి మంత్రి పదవిలో ఉన్నా కూడా సొంత నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోతే ఎలా అన్నది వైసీపీ పెద్దల నుంచి వస్తున్న ప్రశ్న. భీమిలీలో ఉన్న వార్డుల్లో సగానికి సగం టీడీపీకి అప్పగించి జీవీఎంసీ ఎన్నికల వేళ హై కమాండ్ కి మండించేశారని కూడా అవంతి శ్రీనివాసరావు మీద ఇపుడు ఆరోపణలు ఉన్నాయి. అందరినీ నమ్ముకుని విశాఖను రాజధానిగా జగన్ ప్రకటిస్తే ఆ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ భీమిలీలో పనిచేయలేదు అంటే కారణం ఎవరు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఆరు నెలలేనా ….?

నిజానికి భీమిలీలో టీడీపీకి ధీటు అయిన నేత ఎవరూ లేరు, ఇంచార్జిగా సబ్బం హరిని నియమించినా కూడా ఆయన అక్కడకు వెళ్తే ఒట్టు అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో భీమిలీని వైసీపీకి కంచుకోటగా మార్చడానికి మంత్రి అవంతి శ్రీనివాసరావుకి రెండేళ్ల విలువైన సమయం కూడా సరిపోలేదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక అవంతి తన పదవి విషయంలో ఎలాంటి ఆశలు పెట్టుకోనవసరం లేదని కూడా అంటున్నారు. ఆయన హ్యాపీగా ఆరు నెలల పాటు పదవిని అనుభవించి దిగిపోవచ్చునని కూడా వైసీపీలోనే గుసగుసలాడుతున్నారు. మొత్తానికి మంత్రిని అయ్యాను అని తన హోదాను పెంచుకున్నారు తప్ప వైసీపీకి రాజకీయంగా కానీ మరో విధంగా కానీ అవంతి శ్రీనివాసరావు ఉపయోగపడలేదన్నది వైసీపీ పెద్దలు తేల్చిన లెక్క. సో అవంతి మాజీ మంత్రి అవడానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News