అవంతికి అప్పన్నే దిక్కు ?

అసలే ఆయనలో భక్తి పాలు చాలా ఎక్కువ. ఊసుకు వస్తే చాలు దేవాలయాల్లోనే ఉంటారు. ఇపుడు ఆ భక్తి కాస్తా మరింత పీక్స్ కి చేరింది అంటున్నారు. [more]

Update: 2021-04-29 13:30 GMT

అసలే ఆయనలో భక్తి పాలు చాలా ఎక్కువ. ఊసుకు వస్తే చాలు దేవాలయాల్లోనే ఉంటారు. ఇపుడు ఆ భక్తి కాస్తా మరింత పీక్స్ కి చేరింది అంటున్నారు. ఆయన ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. లోకల్ బాడీ ఎన్నికలు కాదు కానీ ప్రశాంతంగా ఉన్న అవంతిలో అశాంతిని నిండా పెంచాయని అంటున్నారు. జగన్ మాటే వేదంగా భావిస్తూ అవినీతికి దూరంగా ఉంటూ వస్తున్న అవంతి శ్రీనివాసరావుకి ఇప్పటిదాకా మంచి మార్కులే పడ్డాయి. వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేంటో తానేంటో అన్నట్లుగా వ్యవహరించే అవంతికి తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు భారీ స్ట్రోక్ ఇచ్చేశాయి.

ఉన్న చోట పరువు పాయే…?

తెలుగుదేశం పార్టీ కంచుకోటలో విజయపతాకను ఎగరేసిన అవంతి శ్రీనివాసరావుకి రెండేళ్ళు తిరగకుండానే భిమిలీ చుక్కలు చూపించింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా సైకిల్ జోరు బాగానే ఉంటే మునిసిపల్ ఎన్నికల నాటికి అది స్పీడ్ అందుకుంది. ఏకంగా భీమిలీలో ఏడు వార్డుల్లో రెండే రెండు వైసీపీకి దక్కాయి అంటే అవంతి కి అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది అంటున్నారు. ఇక జరిగింది పొరొపాటో మరోటో చెప్పుకోవడానికి కూడా లేకుండా కూతురు పోటీ చేసింది అంటున్నారు. సొంత కుమార్తె కోసం పార్టీకి గాలికి వదిలేసారు అన్నది ఇపుడు అవంతి శ్రీనివాసరావు మీద హైకమాండ్ కి చేరిన ఫిర్యాదు.

కోత ఖాయం…?

లోకల్ బాడీ ఫలితాలలో అవంతి శ్రీనివాసరావు సత్తా చూపిస్తే కచ్చితంగా ఆయన అయిదేళ్ళ మంత్రే అన్న మాట కూడా ఉంది. ఎందుకంటే విశాఖ అర్బన్ జిల్లాలో ఆయనను మించిన నేత మరొకరు లేరు. సిటీలో నాలుగు సీట్లు టీడీపీ ఎమ్మెల్యేలే గెలవడం కూడా అవంతికి పొలిటికల్ గా కలసివచ్చింది. కానీ ఇపుడు భీమిలీతో ఓటమితో పాటు విశాఖ కార్పొరేషన్ లో బొటా బొటీ మెజారిటీ వైసీపీకి దక్కడం వెనక ఫెయిల్యూర్ లో మంత్రి వాటా కూడా ఉందని హై కమాండ్ అంటోంది. దాంతో ఇక మినిస్టర్ పోస్ట్ పోయినట్లే అన్న చర్చ అయితే వైసీపీలో ఉంది.

దేవుళ్ళే కరుణించాలి…..

అవంతి శ్రీనివాసరావుకి విపరీతమైన భక్తి. ఆయన నియోజకవర్గంలోనే సింహాచలం కూడా ఉంది. అవంతి తరచూ అప్పన్నను దర్శించుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికల తరువాత ఆయన మరింత ఎక్కువగా అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఇది దేవాలయ అధికారులతో పాటు అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే అవంతి తన రాజకీయ జీవితంలో ఎపుడు ఇబ్బందులు వచ్చినా కూడా అప్పన్నకు మొక్కులు చెల్లించి మరీ వాటి నుంచి బయటకు వస్తూంటారు. మరి ఈసారి వచ్చిన ఆపదకు అప్పన్న అడ్డుకట్ట వేస్తారా. అవంతి పోస్టింగ్ ఊస్టింగ్ కాకుండా కాపాడుతాడా అన్న చర్చ వైసీపీలో గట్టిగా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News