ఈయనలో కలవరం.. ఇక కష్టాలేనటగా.. ?

ఆయన టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టారు. ఒకసారి కాదు రెండు సార్లు. దాంతో ధీమా పెరిగింది. ముచ్చటగా మూడవసారి గెలుపు సాధిస్తే తనకే ఆ సీటు శాశ్వతంగా [more]

Update: 2021-09-01 13:30 GMT

ఆయన టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టారు. ఒకసారి కాదు రెండు సార్లు. దాంతో ధీమా పెరిగింది. ముచ్చటగా మూడవసారి గెలుపు సాధిస్తే తనకే ఆ సీటు శాశ్వతంగా దఖలు పడిపోతుందని భావిస్తున్నారు. ఆ సీటు భీమిలీ అయితే ఆయన గారే మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఆయన 2019 ఎన్నికల్లో కేవలం తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. ఆయన మీద పోటీ చేసిన దివంగత నేత సబ్బం హరి ఏకంగా 91 వేల ఓట్లను తెచ్చుకున్నారు. అంటే కాస్తా కష్టపడితే సబ్బం హరి గెలిచేసేవారే. నిజానికి అవంతి శ్రీనివాసరావు నాన్ లోకల్ అయితే సబ్బం హరి కూడా భీమిలీలో ఎపుడూ ఉన్నది లేదు. కానీ ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి అంటే అది భీమిలీలో టీడీపీకి ఉన్న పట్టుని తెలియచేస్తోంది.

సైకిలు తగ్గడంలేదుగా…

పెద్దగా మెజారిటీ రాకపోయినా అవంతి శ్రీనివాసరావుకి ఇచ్చిన మాట ప్రకారం జగన్ మంత్రిని చేశారు. కొద్ది నెలలలో ఆయన రెండున్నరేళ్ల మంత్రి కాబోతున్నారు. ఇంతదాకా ఆయన భీమిలీకి ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఆయన ఇక మీదట తనదైన రాజకీయం చూసుకుంటారని అంటున్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలవాలి అంటే కనుక వైసీపీని పటిష్టం చేసుకోవాలి. ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పూర్తి విజయాలు పార్టీకి దక్కలేదు. సగానికి సగం టీడీపీ గెలిచి సత్త్తా చాటింది. దాంతో అవంతి శ్రీనివాసరావులో కలవరం బయల్దేరింది. టీడీపీని తగ్గిస్తేనే కానీ తాను గెలిచేది లేదన్నది కూడా బోధపడింది.

లుకలుకలే …

మరో వైపు చూస్తే సబ్బం హరి చనిపోయేవరకూ భీమిలీకి ఇంచార్జిగా ఉండేవారు. ఆయన ఒక పెద్ద దిక్కుగా పార్టీకి ఉన్నారు. ఆయన పోయాక మాత్రం పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడిపోతున్నాయి. ప్రతీ వారూ ఎమ్మెల్యే అభ్యర్ధులుగానే ఫీల్ అవుతున్నారు. తమకే వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలని పేచీ పెడుతున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం ఆనందపురం మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుని తెచ్చి భీమిలీ ఇంచార్జిని చేసింది. ఆయనకు పదవి ఇవ్వడమేంటి అని అటు సింహాచలం నుంచి ఇటు భీమిలీ దాకా తమ్ముళ్ళ అసంతృప్తి దావాలనంలా వ్యాపించింది. దాన్ని సరిచేసే పనిలో హై కమాండ్ సతమతమవుతోంది. సరిగ్గా దీన్నే అవంతి శ్రీనివాసరావు చాన్స్ గా తీసుకుంటున్నారు. తెలుగుదేశంలో వచ్చిన విభేదాలనే వాడుకుంటూ వైసీపీని బలోపేతం చేయడానికి రెడీ అవుతున్నారు.

గేలం వేస్తున్నారుగా..?

అవంతి శ్రీనివాసరావు ఇపుడు అర్జంటుగా చేస్తున్న పని ఏంటి అంటే టీడీపీ అసమ్మతి వాదులను గుర్తించి ఫ్యాన్ నీడకు చేర్చడం. ఆ విధంగా టీడీపీ ఇంచార్జి సొంత ఇలాకా ఆనందపురంలోనే పెద్ద ఎత్తున కీలకనేతలను తెచ్చి చేర్చుకున్నారు. భీమిలీలోనూ ఇదే ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. అవంతి శ్రీనివాసరావు అయిదేళ్ల పాటు టీడీపీలో ఉన్నారు కాబట్టి పాత పరిచయాలను ఉపయోగించుకుని మరీ ఇలా తమ్ముళ్ళను ఆకర్షిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే 2024లో మరో మారు అవంతి గెలుస్తారు. కానీ వారి రాకతో వైసీపీలో ఉన్న వారు కూడా అభద్రతకు గురి అవుతున్నారు. దాంతో అందరినీ బ్యాలన్స్ చేసుకుంటూ మంత్రి రాజకీయం చేయాల్సి ఉంది. మరో వైపు చూస్తే మంత్రి పదవి ఉంది కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతోంది. రేపటి రోజున ఆయన మాజీ మంత్రి అయితే టీడీపీకి రివర్స్ లో నేతల వలస ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు. చూడాలి మరి అవంతి శ్రీనివాసరావు మూడవసారి ఎమ్మెల్యే ముచ్చట తీరుతుందో లేదో.

Tags:    

Similar News