అయ్యన్న టార్గెట్ ? అటు వైపు నుంచి?

రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల వీరు పరమ నిష్టాగరిష్టులు అని కానీ వీరే అటూ ఇటూ మారుతారని కానీ చెప్పడానికి అసలు వీలులేదు. ఇక [more]

Update: 2020-07-18 06:30 GMT

రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల వీరు పరమ నిష్టాగరిష్టులు అని కానీ వీరే అటూ ఇటూ మారుతారని కానీ చెప్పడానికి అసలు వీలులేదు. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన చంద్రబాబు కంటే కూడా టీడీపీలో ముందు వచ్చిన వారు. సాక్షాత్తూ అన్న ఎన్టీయార్ అయ్యన్నపాత్రుడిని ఏరి కోరి ఎంపిక చేసి మరీ బీ ఫారం చేతిలో పెట్టిన చరిత్ర ఉంది. అటువంటి అయ్యన్నపాత్రుడు టీడీపీని వీడుతారా అంటే ఏమో చెప్పలేం అన్న మాట కూడా ఉంది. కరడు కట్టిన టీడీపీ ముఖ్యులు, ఆ పార్టీ సామాజికవర్గానికి చెందిన వారే సైకిల్ దిగిపోయిన నేపధ్యంలో అయ్యన్నపాత్రుడు లాంటి వారు పార్టీ మారితే వింతేముంది అన్న మాట కూడా ఉంది.

అలా అనుమానం…..

ఈ మధ్య విశాఖలో రెండు కోట్ల మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా సిటీలో ప్రారంభించారు. విశాఖనగరం అంతా ఈ మొక్కలను నాటి పచ్చదనం పరిమళింపచేయాలన్నది దీని వెనక ఉద్దేశ్యం. అయితే రెండు కోట్ల మొక్కలను ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి చెందిన రిసార్ట్స్ సంస్థ అంటున్నారు. మరి ఇదే ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. తెల్లారిలేస్తే అయ్యన్నపాత్రుడు విజయసాయిరెడ్డిని, జగన్ని ట్విట్టర్ ద్వారా తిడుతూంటారు. మరి ఈ మతలబు ఏంటి అని అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు.

అదే కధ…..

ఇక బోగాపురం విమానాశ్రయం పరిధిలో అయ్యన్నపాత్రుడుకు 400 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ ఆయన రిసార్ట్స్ కూడా ఉంది. ఎపుడైతే భోగాపురం విమానాశ్రయ విస్తరణ పనులు మొదలయ్యాయో అపుడే ఈ భూముల మీద కన్ను పడిందని అంటున్నారు. గతంలోనే టీడీపీలో అయ్యన్న పాత్రుడు బద్ధ విరోధి గంటా శ్రీనివాసరావు ఈ భూములను కూడా విమానాశ్రయ విస్తరణకు వాడేయాలనుకుంటే చంద్రబాబు ద్వారా అయ్యన్నపాత్రుడు చెప్పించుకుని వాటిని కాపాడుతున్నారు. ఇపుడు వైసీపీ సర్కార్ ఉంది. అయ్యన్నపాత్రుడు కచ్చితంగా టార్గెట్ అవుతారు. ఎందుకంటే ఆయన జగన్ని కూడా వదలకుండా నిందిస్తున్నారు. దాంతో ఇపుడు అయ్యన్న రిసార్ట్స్, ఆయన భూములూ, వ్యాపారాలూ అన్నీ కూడా ఇబ్బందుల్లో పడినట్లేనని అంటున్నారు.

ఈ వైపుకేనా …?

సరే రాజకీయాలు ఎలా ఉన్నా ఈ భూములు కాపాడుకోవడం ఇపుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి అత్యవసరం అంటున్నారు. దాంతో కీలక‌ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం తెర వెనక మొదలు అయిందని అంటున్నారు. దీనిలో భాగంగానే అయ్యన్నపాత్రుడు రిసార్ట్స్ కి చెందిన వారే విజయసాయిరెడ్డితో క్లోజ్ రిలేషన్స్ కి తెరలేపారని చెబుతున్నారు. మరి విజయసాయిరెడ్డి తలచుకుంటే అయ్యన్నపాత్రుడు భూములకు అభయం వస్తుంది. దాంతోనే ఇలా మొక్కలను స్పాన్సర్ చేసే పేరిట కధ నడిచిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అయ్యన్నపాత్రుడు ఇప్పటికిపుడు వైసీపీలోకి రాకున్నా తన సౌండ్ తగ్గిస్తారని అంటున్నారు. మరో వైపు టీడీపీకి భవిష్యత్తు పెద్దగా లేదని తేలుతున్న వేళ కుమారుడి కోసమైనా ఆయన ఈ వైపు వస్తారన్న ప్రచారమూ ఉంది. మరి అదే కనుక జరిగితే చంద్రబాబుకు భారీ రాజకీయ నష్టం జరిగినట్లే. అలాగే గంటా శ్రీనివాసరావుకు కూడా అయ్యన్నపాత్రుడు రాజకీయంతో చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News