అయ్యన్న లాజిక్ ప్రకారమేనా?

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయిపూ అజా లేకుండా పోయారన్నది తమ్ముళ్ల ఆరోపణ. ఆయన తాను గమ్మునుండడమే కాదు, పార్టీని [more]

Update: 2019-09-02 08:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయిపూ అజా లేకుండా పోయారన్నది తమ్ముళ్ల ఆరోపణ. ఆయన తాను గమ్మునుండడమే కాదు, పార్టీని గమ్మునుండమని చెప్పేసి చాలా రోజులైంది. ఈ సందేశాన్ని ఆయన నేరుగా చంద్రబాబుకే వినిపించేసారు. కొత్త సర్కార్ మీద మోజు ఉంది. మనం ఇపుడే రోడ్డున పడితే సుఖం లేదన్నది అయ్యన్నపాత్రుడు పొలిటికల్ లాజిక్. అయితే మొదట్లోనే వైసీపీని బదనాం చేస్తే ముందు ముందు పని సులువు అవుతుందన్నది టీడీపీ హై కమాండ్ ఆలోచన. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు జిల్లలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్దగా స్పందిచడంలేదు. ఆయన తన ధోరణిలో తాను ఉన్నారు. మరో వైపు జిల్లాలో ఉన్న పార్టీ ఇపుడు దారుణంగా తయారైంది. పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. మీటింగులు పెట్టుకుంటూ ఇతర పార్టీలతో రాయబేరాలు నడుపుతున్నారు. మరి సీనియర్ నేతగా అయ్యన్నపాత్రుడు వారిని కట్టడి చేయలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఆపమని కోరినా….

విశాఖ జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం టీడీపీకి గుడ్ బై చెబుతూంటే కనీసం అయ్యన్నపాత్రుడు ఆపలేకపోయారని హై కమాండ్ గుర్రుమీదుంది. అయితే అయ్యన్నపాత్రుడు తన వంతు ప్రయత్నం చేశారని, వారు పార్టీని వీడిపోవాలనుకున్నపుడు చంద్రబాబు అయినా ఏం చేయగలరని ఆయన అనుచరులు అంటున్నారు. మరో వైపు డెయిరీ చైర్మన్ తో అయ్యన్నపాత్రుడుకు చాలాకాలంగా పెద్దగా సంబంధాలు లేవు. డెయిరీ చైర్మన్ కూడా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సఖ్యతగా ఉంటారు. దాంతో అయ్యన్నపాత్రుడు సైతం ఇది తన పని కాదనుకుని పూర్తిగా ఈ పరిణామాల మీద దృష్టి పెట్టలేదని అంటున్నారు. విశాఖ జిల్లా రాజకీయల్లో గంటా జోక్యం పెరిగిన తరువాత అయ్యన్నపాత్రుడు అప్పట్లోనే చాలా వరకూ తగ్గిపోయారు. ఇపుడు కూడా తన వర్గం వైసీపీలోకి వెళ్తూంటే ఆపుకోవాల్సిన బాధ్యత మాజీ మంత్రి గంటాదేనని అయ్యన్న వర్గం అంటోంది.

నడిపించే నాధుడేడీ …?

అయ్యన్నపాత్రుడు పార్టీని పట్టించుకోరని తేలిపోయింది. గంటా శ్రీనివాసరావు కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఏక‌త్రాటిన టీడీపీని నడిపించే నాధుడు లేడని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మాజీ మంత్రుల ఆధిపత్య ధోరణి తగ్గలేదని, ఫలితంగా పార్టీ నష్టపోతోందని అంటున్నారు. ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ప్రోత్సహిద్దామన్నా కూడా ఎవరూ ముందుకు రాని స్థితి, వచ్చినా వారిని వెనక నుంచి కీ ఇచ్చి తిప్పేది కూడా మాజీ మంత్రులే కావడంతో విశాఖ రూరల్ జిల్లాలో సైకిల్ ముళ్ల బాటలోనే పయనిస్తోంది. దాంతో పక్చర్లు వరసగా పడిపోతున్నాయి. ఇక పూర్తి ప్రక్షాళనకు అధినాయకత్వం పూనుకునే సాహసం చేస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News