అయ్యో.. అని అనుకోలేకపోతున్నారే?

విశాఖ జిల్లా టీడీపీలో ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా మంట మండుతూనే ఉంది. వారు అధికారంలో ఉన్నపుడు పోనీలే అనుకున్నా ఇపుడు [more]

Update: 2020-07-02 13:30 GMT

విశాఖ జిల్లా టీడీపీలో ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా మంట మండుతూనే ఉంది. వారు అధికారంలో ఉన్నపుడు పోనీలే అనుకున్నా ఇపుడు విపక్షంలో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉంది. అన్నిటికీ మించి వారిద్దరూ కూడా చిక్కుల్లో ఉన్నారు, జగన్ సర్కార్ ఏకంగా అయ్యన్నపాత్రుడి మీద ఏడు కేసులు నమోదు చేసింది. అందులో నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టడం, మరో కేసు ఎస్టీ ఎస్టీ యాక్ట్ ప్రకారం పెట్టడంతో మాజీ మంత్రి పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా సరే అయ్యో అయ్యన్నా అని మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అనలేకపోతున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన చినబాబు వారిద్దరిని పరమర్శించాలి. వారిని ఓదార్చాలి తప్ప వారు మాత్రం ముఖాముఖాలు చూసుకోరుగా.

అయ్యన్న టార్గెట్ …

మాట్లాడితే వీరావేశం తప్ప ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచించని అయ్యన్నపాత్రుడి మీద కేసులు సులువుగా పెట్టేస్తున్నారు వైసీపీ నేతలు. జగ‌న్ ని విశాఖ మెంటల్ ఆసుపత్రిలో పిచ్చాడి కంటే తక్కువ చేసి నోటి దురుసుతో మాట్లాడుతున్న అయ్యన్న దూకుడుని కళ్ళెం వేయాలని జగన్ సర్కార్ చాలా గట్టిగా పనిచేస్తోంది. అయినా సరే అయ్యన్న తగ్గడమేలేదు. దాంతో ఆయన జైలుకు ఎపుడు వెళ్తారా అన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. ఈ సమయంలో సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నకు మాజీ మంత్రి గంటా కనీసం పరామర్శ కూడా చేయలేదు, నైతికంగా భరోసా కూడా ఇవ్వలేదు. మౌనమే వహించి అంతా చూస్తున్నారు.

దగ్గర దాకానా …?

ఇక గంటా శ్రీనివాస్ విషయంలోనూ వైసీపీ తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఆయనకు అన్ని విధాలుగా సన్నిహితుడిగా పేరున్న నలందా కిషోర్ అని సన్నిహితుడిని సీఐడీ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. గంటాపై గురి పెట్టాలంటే ముందు ఆయన అనుచరులను దెబ్బ తీయాలన్న వ్యూహాన్ని వైసీపీ ఇక్కడ ఉపయోగిస్తోంది. దాంతో గంటా సహజంగానే డీలా పడ్డారు. ఆయన సీఐడీ ఆఫీస్ కి వెల్ళినా కూడా వెనక్కి పంపించారు. గంటా దిగాలు పడుతూ నన్ను టార్గెట్ చేయండని జగన్ కి సవాల్ చేసుకోవాల్సివచ్చింది. ఈ విషయంలో అయ్యన్నపాత్రుడు పూర్తిగా కామప్ అయ్యారు. అయిన దానికి కాని దానికీ జగన్ మీద విరుచుకుపడే అయ్యన్నపాత్రుడు తన సాటి నేతకు రాజకీయ ఇబ్బందులు వస్తే మాట్లాడితే ఒట్టు అన్నట్లుగా వ్యవహరించారు.

కష్టమేనా…?

ఇలాంటి నాయకులను పెట్టుకుని చంద్రబాబు పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది అని తమ్ముళ్ళు అంటున్నారు. పార్టీ ఇపుడు ఇబ్బందుల్లో ఉంది. స్వయంగా మాజీ మంత్రులు వైసీపీ సర్కార్ కి టార్గెట్ అవుతున్నారు. అయినా కూడా ఇద్దరూ కలసి అడుగులు వేయకుండా తమ పంతాలు, పట్టింపులే ముఖ్యమనుకుని దూరంగా ఉంటే ఐక్యత లేక వేరు పడిన నాలుగు ఆవులు, పులి కధలా వైసీపీ పని మరింత సులువు అవుతుంది అని తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఇద్దరు దిగ్గజ నాయకులు ఒక్కటిగా నిలబడితేనే వైసీపీని దీటుగా ఎదుర్కోవడం విశాఖ టీడీపీలో జరుగుతుందని అంటున్నారు. మరి అది జరిగే పనేనా.

Tags:    

Similar News