బండారు బడాయి ఇంతేనా ?

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అచ్చం చంద్రబాబు శిష్యుడే. అయన మాదిరిగానే ఈయన కూడా తన రాజకీయ గురువు పైలా [more]

Update: 2021-03-27 12:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అచ్చం చంద్రబాబు శిష్యుడే. అయన మాదిరిగానే ఈయన కూడా తన రాజకీయ గురువు పైలా అప్పలనాయుడుని పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్ మూడున్నర దశాబ్దాల క్రితం సొంతం చేసుకుని దూసుకు వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొదట సర్పంచ్ గా తరువాత పరవాడ మండలాధ్యక్షునిగా పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి 1989 నాటికి ఎమ్మెల్యే అయిపోయారు. ఇక ఆయనకు అదృష్టం తొలిసారి తలుపు తట్టింది. అంతే 1998 ప్రాంతంలో మంత్రి కూడా అయిపోయారు.

అంతటితో సరి ….

అయితే ఆ లక్ అంతటితో సరి అన్నట్లుగానే ఆగిపోయింది. బండారు సత్యనారాయణమూర్తి 1999లో మళ్ళీ గెలిచినా కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇక హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణమూర్తి 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఓడిపోయారు. తిరిగి 2014లో గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. 2019 ఎన్నికల్లో యువ ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్ రాజు చేతిలో ఆయన భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే తనకు కంచు కోటగా, రాజకీయానికి రాచబాటగా పరిగణించే పరవాడలో పట్టు కోల్పోవడమే అసలైన రాజకీయ చిత్రం.

సొంతూళ్ళో పరాభవం ….

తాను, తన సతీమణి కూడా సర్పంచులుగా పనిచేసిన సొంతూరు వెన్నెలపాలెంలో తాజా పంచాయతీ ఎన్నికల్లో భారీ ఓటమి బండారు సత్యనారాయణమూర్తి కి గట్టి షాకే ఇచ్చిందని చెప్పాలి. తన సతీమణిని నిలబెట్టి కాళ్ళరిగేలా ప్రచారం చేసినా 650 ఓట్ల తేడాతో మాజీ మంత్రి భార్య మాధవీలత వైసీపీ మద్దతుదారు చేతిలో పరాజయం పాలు అయ్యారు. దీంతో పాటు పరవాడ మండలలోని మెజారిటీ పంచాయతీలు కూడా వైసీపీకి సమర్పించుకుని రాజకీయంగా బండారు సత్యనారాయణమూర్తి దెబ్బ తినేశారు అంటున్నారు.

వియ్యాల వారి ముందు …

ఎక్కడైనా పరువు పోయినా ఫరవాలేదు కానీ వియ్యాల వారి ముందు మాత్రం దర్జా తగ్గకూడదు. కానీ బండారు సత్యనారాయణమూర్తి కి మాత్రం వరస పరాజయాలు పలకరించడంతో వియ్యమందుకున్న కింజరాపు కుటుంబం ముందు తగ్గిపోతున్నారు అన్న ప్రచారం సాగుతోంది సొంతూరు నిమ్మాడలో అచ్చెన్నాయుడు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా టెక్కలిలో గెలిచి సత్తా చాటారు అలాగే అల్లుడు శ్రీకాకుళం ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు కూడా విజయాల బాటలో ఉన్నారు. కానీ బండారు సత్యనారాయణమూర్తి కుటుంబమే ఇలా అయింది అంటున్నారు. 2019 ఎన్నికల్లో మామ ఎమ్మెల్యేగా ఓడిపోతే తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్తమ్మ ఓటమి తో బండారు వారి అల్లుడైన రామ్మోహన్ కూడా కలత చెందుతున్నారుట. మొత్తానికి ఈ సీనియర్ నేత రాజకీయ జీవితం ముగిసిపోయిందా అని తమ్ముళ్ళే అనుకుంటున్నారు.

Tags:    

Similar News