హసీనా…. ఓ హిస్టరీ…!!!
నాలుగోసారి ప్రదాని పదవి చేపట్టడం ద్వారా అవామీలీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా వాజెద్ చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నాలుగుసార్లు కీలకమైన ప్రధాని పదవిని అందుకున్న [more]
నాలుగోసారి ప్రదాని పదవి చేపట్టడం ద్వారా అవామీలీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా వాజెద్ చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నాలుగుసార్లు కీలకమైన ప్రధాని పదవిని అందుకున్న [more]
నాలుగోసారి ప్రదాని పదవి చేపట్టడం ద్వారా అవామీలీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా వాజెద్ చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నాలుగుసార్లు కీలకమైన ప్రధాని పదవిని అందుకున్న ఏకైక నేత హసీనానే కావడం విశేషం. 2008 నుంచి 2018 వరకూ వరసగా రెండుసార్లు ప్రధాని పదవిలో కొనసాగారు. 1996-2001 మధ్యకాలంలో ఈ అత్యున్నత పదవిని నిర్వహించారు. ప్రధాని పదవిని చేపట్టడం అదే తొలిసారి. తాజా ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా ఇప్పుడు నాలుగోసారి కీలకమైన ప్రధాని పదవిని చేపట్టారు. తద్వారా మరో అయిదేళ్ల పాటు దేశానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఏడు పదుల హసీనాకు దక్కింది.
కష్టార్జితమే…..
హసీనాకు ప్రధాని పదవి ఆషామాషీగా దక్కలేదు. అదృష్టవశాత్తూ అసలే లభించలేదు. తన కష్టార్జితం, పోరాటం ద్వారా సాధించుకోగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె జీవితం పోరాటాల మయం. ఎప్పుడూ ఏటికి ఎదురీదారు. పార్టీని కాపాడుకోవడానికి ఆమె పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. బాల్యం, యవ్వనంలో కొద్దికాలం తప్పించి ఆమె ప్రస్థానం అంతా ఆటుపోట్ల మయమే. ఎన్నో అడ్డంకులను, ఆటుపోట్లను అధిగమించిన హసీనా ఆదర్శప్రాయురాలు. మతమౌఢ్యం గల దేశంలో ఒక మహిళ అత్యున్నత స్థాయికి చేరుకోవడం, నిలదొక్కుకోవడం విశేషం. ఆమె జీవితం ఎంతోమంది రాజకీయనాయకులకు స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కుటుంబాన్ని కోల్పోయినా…..
1947 సెప్టెంబరు 28న జన్మించిన హసీనా అయిదుగురు సంతానంలో పెద్దవారు. తండ్రి “బగబంధు” షేక్ ముజిబర్ రహమాన్ దేశ తొలిప్రధాని. బంగ్లా నిర్మాత. ఢాకాలోని ఈడెన్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1966-67 మధ్య కాలంలో విద్యార్థి సంఘ ఉపాధ్యక్షురాలిగా హసీనా ఎన్నికయ్యారు. విద్యాభ్యాసం అనంతరం తండ్రి స్ఫూర్తితో 1981 మే 17న రాజకీయ అరంగేట్రం చేశారు. దీనికి ముందు 70వ దశకంలో ఆమె జీవితం కుదుపునకు గురైంది. 1975 ఆగస్టు 15 తెల్లవారుఝామున తండ్రి ముజబుర్ రహమాన్, తల్లి, నలుగురు సోదరులను కుట్ర చేసి సైనిక అధికారులు హతమార్చారు. అప్పట్లో హసీనా చెల్లెలుతో కలసి పశ్చిమ జర్మనీలో ఉండటంతో బతికి బయటపడ్డారు. లేనట్లయింతే హసీనా కూడా ఉండేవారు కారు. 1971లో స్వాతంత్ర్యం సాధించుకున్న దేశానికి ఆమె తండ్రి ముజిబుర్ రహమాన్ తొలి ప్రధాని. తండ్రి మరణంతో ఒంటరి అయిన హసీనాకు ఆరేళ్ల పాటు భారత్ ఆశ్రయమిచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తనను సొంత కూతురిలా చూసుకున్నారని ఇప్పటకీ హసీనా సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. భారత్ అన్న, ఇందిరాగాంధీ కుటుంబం అన్నా హసీనాకు వల్లమాలిన ప్రేమ. ఆమెకు, ఆమె పార్టీ అవామీ లీగ్ భారత్ పక్షపాతి అన్న పేరుంది.
దేశ బహిష్కరణ…..
భారత్ లో ఉంటూనే 1981లో అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన హసీనా దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. లెఫ్ట్ నెంట్ జనరల్ ఎర్నాల్డ్ సైనిక పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదా జియాతో కలసి పోరాడారు. ఆ తర్వాత రోజుల్లో హసీనా, ఖలీదా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అవినీతి కేసుల్లో ఖలాదా జైల్లో ఉన్నారు.1986, 91 పార్లమెంటు ఎన్నికల్లో హసీనా పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. 1996 జూన్ లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ అప్రతహిత విజయం సాధించింది. దీంతో తొలిసారి ప్రధాని పదవి చేపట్టారు హసీనా. తన పదవీకాలంలో భారత్ తో సత్సంబంధాలు నెరిపారు. కీలకమైన గంగా జల పంపిణీపై ఒప్పందం కుదుర్చుకున్నారు. చక్మా శరణార్థుల సమస్యను చక్కబెట్టారు. భారత్ లో చిచ్చుపెడుతున్న స్వదేశంలోని ఉగ్రవాదుల ఆటకట్టించారు. 2001 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో హసీనాపై హత్యాయత్నం జరిగింది. ఖలీదా జియా నేతృత్వంలోని ప్రభుత్వం హసీనాకు దేశ బహిష్కరణ శిక్ష విధించింది. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన బంగ్లా ప్రభుత్వం హసీనా రాకకు అనుమతించింది. 2007 మే 7న ఢాకాలో అడుగుపెట్టిన ఆమె వెంటనే ఎన్నికల రణరంగంలోకి దిగారు. 2008 లో జరిగిన ఎన్నికల్లో హసీనా విజయం సాధించి రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. అనంతరం 2014 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ మూడోసారి విజయం సాధించి మళ్లీ ప్రధాని అయ్యారు. తద్వారా నాలుగోసారి ప్రధాని పదవి చేపట్టిన నేతగా రికార్డును సృష్టించారు. బంగ్లా చరిత్రలో ఇదో రికార్డు.
బంగ్లా అభివృద్ధి వెనక…..
ప్రపంచ మహిళా నాయకుల మండలిలో హసీనా సభ్యురాలు. ప్రపంచ వ్యాప్తంగా గల మహిళా ప్రధానులు, మాజీ ప్రధానులు ఇందులో సభ్యులు. 1968లో న్యూక్లియర్ సైంటిస్ట్ ఎం.ఎ. వాజెద్ తో వివాహమయింది. అప్పటి నుంచి షేక్ హసీనా వాజెద్ గా ఆమె పేరు స్థిరపడిపోయింది. 2009లో భర్త వాజెద్ మృతి చెందారు. వారికి ఇద్దరు పిల్లలు. సాజీ్ వాజెద్, సైమా వాజెద్ సంతానం. గత పదేళ్లుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన నేతగా హసీనా పేరు గడించారు. పేదరికం నుంచి అభివృద్ది చెందుతున్న దేశంగా బంగ్లాదేశ్ మారడం వెనక హసీనా కృషి ఉంది. అక్షరాస్యత, వృద్ది రేటు, బాలికా విద్యలో హసీనా సర్కార్ మంచి విజయాలే సాధించారని స్వయంగా ఐక్యరాజ్యసమితి పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల అణచివేత, మతోన్మాద దేశంగా బంగ్లా మారడం వెనక ఆమె ప్రమేయాన్ని తోసిపుచ్చలేం.
-ఎడిటోరియల్ డెస్క్