కన్నాకు కన్నం పడినట్లే

పేరుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడే కానీ హవా మాత్రం జాతీయ నాయకులదే. ఏపీలో ఏ చోటా నాయకుడు పార్టీలో చేరాలన్నా డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ [more]

Update: 2019-07-20 14:30 GMT

పేరుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడే కానీ హవా మాత్రం జాతీయ నాయకులదే. ఏపీలో ఏ చోటా నాయకుడు పార్టీలో చేరాలన్నా డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. అక్కడ పెద్ద లీడర్ల సమక్షంలో కండువాలు కప్పేసుకుంటున్నారు. కనీసం ఆ సమాచారం కూడా కన్నా లక్ష్మీనారాయణకు తెలియదంటే పార్టీలో ఆయన పవర్ ఏంటో అర్ధమైపోతోందిగా, ఇక ఏపీలో నేనే చక్రం తిప్పుతాను అంటూ చంద్రబాబుకు నిన్నటి అనుంగు శిష్యుడు, కాషాయం పార్టీకి కొత్త పూజారి అయిన సుజనా చౌదరి ప్రకటించుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో పార్టీ గెలిస్తే నేనే సీఎం అనే రేంజిలో సుజనా హడావిడి చేస్తున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండడం, సామాజిక వర్గం దన్ను సుజనాకు టీడీపీలో ఉన్న పరిచయాలు ఇవన్నీ చూసుకుని హై కమాండ్ కూడా ఆయనకు ప్రయారిటీ ఇస్తోందని అంటున్నారు. ఇక ఏపీకే చెందిన మరో సీనియర్ నేత వారణాసి రాం మాధవ్ ఉన్నారు. ఆయన మోడీ, అమిత్ షా తరువాత అంతటి వారు. ఆయన నేరుగా ఏపీలో బీజేపీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి పార్టీలో ఏందన్న చర్చ జరుగుతోంది.

కన్నా శత్రువు బీజేపీలోకి…

అలా రాం మాధవ్ ఏకంగా కన్నా లక్ష్మీనారాయణకు దశాబ్దాల పాటు శత్రువుగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లి మరీ విందారగించారు. అంతటితో ఆగకుండా అయన్ని పార్టీలో చేరమని ఆహ్వానించారు. దానికి సరేనన్న పెద్దాయన తట్టా బుట్టా సర్దేశారు. కన్నా లక్ష్మీనారాయణకు ఓ విధంగా ఇది షాకింగ్ న్యూసే మరి. తన శత్రువే తనని కాదని తన పార్టీలో చేరి తననే సైడ్ చేయడం అంటే ఎవరైనా సహించగలరా. కానీ కన్నా లక్ష్మీనారాయణకు ఇపుడు కాని కాలం నడుస్తోంది. ఆయన్ని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేసిన నాటి ముద్దూ ముచ్చటా ఇపుడు బీజేపీలో లేదు. ఆయన వల్ల పార్టీ బలపడదని డిసైడ్ అయ్యాకే పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పక్కా కాంగ్రెస్ మనిషి, గుంటూరు జిల్లాలో బలమైన నేత, కాపు సామాజిక వర్గం అండ కూడా ఉంది. తన మానాన తాను వైసీపీలోకి పోయి మంత్రి అవుదామనుకుంటే పిలిచి మరీ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇపుడు చెప్పకుండానే పొమ్మంటున్నారు.

జగన్ తో చెడగొట్టుకున్నారా…..

సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అన్నీ తెలిసి కూడా జగన్ సర్కార్ మీద ఇటీవల హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆ విధంగానైనా తనని పదవిలో ఉంచుతారని ఆయన భ్రమ‌లో ఉన్నట్లున్నారు. అయితే బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ శకం ముగిసిందనడానికి సుజనా చౌదరి సహా నలుగురు టీడీపీ ఎంపీలు చేరడమే సంకేతమని అంటున్నారు. అయినా తన ప్రయత్నం తాను చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణ జగన్ ని బాగా విమర్శిస్తే తనకు పెద్ద పీట వేస్తారనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. రేపో మాపో ఫిరాయింపు నేతల్లో ఒకరిని తెచ్చి బీజేపీ ప్రెసిడెంట్ ని చేస్తారు, రాయపాటి సాంబశివరావుని పార్టీలోకి తెచ్చేస్తున్నారు. ఇక మిగిలింది కన్నా లక్ష్మీనారాయణకు ఏమీ లేదు. అనవసరంగా పెద్ద నోరు చేసుకుని జగన్ ని విమర్శించినందుకు వైసీపీలోకి పోదామన్నా రేపు అవకాశం ఉండదేమో. ఏది ఏమైనా కన్నా లక్ష్మీనారాయణ హవాకు కన్నం పడినట్లే మరి.

Tags:    

Similar News