అప్పకు అంతా అప్పగించేశారా?

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇక సాహసం చేయదలచుకోలేదు. ప్రయోగాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే కర్ణాటక ఉప ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం [more]

Update: 2019-11-03 18:29 GMT

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇక సాహసం చేయదలచుకోలేదు. ప్రయోగాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే కర్ణాటక ఉప ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు పార్టీ కేంద్ర నాయకత్వం కళ్లెం వేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కటిల్ తో పాటు మరికొందరిని యడ్యూరప్ప నిర్ణయాలపై నిఘా పెట్టేందుకు రంగంలోకి దించారు.

కట్టడి చేస్తూ వచ్చి…..

యడ్యూరప్ప తొలిసారి మంత్రి వర్గ విస్తరణ చేసినప్పుడు కూడా జాబితా హస్తినలోనే తయారయింది. దీంతో తాను నమ్ముకున్న వారికి యడ్యూరప్ప మంత్రి వర్గంలో స్థానం కల్పించలేకపోయారు. దీంతో బీజేపీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోయింది. మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలనుకున్నా అధిష్టానం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అలాగే వరద సాయం కూడా కేంద్రం సక్రమంగా చేయకపోవడంతో యడ్యూరప్ప ఉత్సవ ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారు.

దిగివచ్చిందా?

కాని మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం కొంత దిగివచ్చిందంటున్నారు. ఉప ఎన్నికల బాధ్యతను మొత్తం యడ్యూరప్పకు అప్పగించాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారాన్ని కూడా తానే చూసుకోవాల్సి ఉంటుంది. గెలుపు బాధ్యత యడ్యూరప్పదే. బలమైన సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను ఇబ్బంది పెడుతున్నామన్న సంకేతాలు వెళితే ఉప ఎన్నికల్లో దెబ్బతినే అవకాశముందని అధిష్టానం గుర్తించినట్లుంది.

గెలుపు బాధ్యత…..

వచ్చే నెలలో జరగనున్న ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప సర్కార్ నిలబడాలంటే పదిహేను స్థానాల్లో ఎనిమిది స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ చేరుకునే బాధ్యతను యడ్యూరప్పపైనే ఉంచాలని అమిత్ షా నిర్ణయించారని తెలుస్తోంది. ఇక గెలిస్తే యడ్యూరప్ప పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగే వీలుంది. ఓటమి పాలయినా ఆయనపైనే నిందమోపే అవకాశముంది. ఇలా బీజేపీ అధిష్టానం యడ్యూరప్పపైనే భారం మోయడంతో ఆయన ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.

Tags:    

Similar News