“ఆకు” బ్యాచ్ తో అందలం అందుతుందా…??

సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా సిద్ధమవుతోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, బలహీనంగా ఉన్న చోట మిత్రులతో కలసి ముందుకు [more]

Update: 2019-02-20 16:30 GMT

సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా సిద్ధమవుతోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, బలహీనంగా ఉన్న చోట మిత్రులతో కలసి ముందుకు సాగడం వంటి చర్యలతో ముందుకు సాగుతుంది. ఈ విషయంలో పార్టీ ఇటీవల కాలంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇంతకు ముందు బీహార్, మహారాష్ట్ర తాజాగా తమిళనాడు పొత్తులను కుదుర్చుకుని కమలం పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. బీహార్ లోని నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యు, మహారాష్ట్ర లో పాత మిత్ర పక్షం శివసేనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. నిన్న మొన్నటి దాకా ఉప్పు, నిప్పు గా ఉన్న శివసేన పొత్తు పెట్టుకోవడం విశేష పరిణామం. వాస్తవానికి రెండూ మొదటి నుంచీ మిత్రపక్షాలే.

సీట్ల సర్దుబాటు వరకూ….

తాజాగా తమిళనాడులో అధికార అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేయడం గమనార్హం. దక్షిణాదిన తమిళనాడు పెద్దరాష్ట్రం. 39 స్థానాలు గల రాష్ట్రం అత్యంత కీలకం. పక్కనున్న పుదుచ్చేరి లో కలిపి మొత్తం 40 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. తాజా ఒప్పందంలో భాగంగా తాత్కాలికంగా పుదుచ్చేరి విషయాన్ని పక్కనపెట్టారు. మొత్తం 39 స్థానాల్లో అధికార అన్నాడీఎంకే 22, అన్జుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే 7 స్థానాలు, బీజేపీ అయిదు స్థానాలు, డీఎండీకే మిగిలిన స్థానాల్లో పోటీ చేయనున్నాయి. పీఎంకే కు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పీఎంకే అధినేత రాందాస్, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు పియూష్ గోయల్ మధ్య ఒప్పందం కుదిరింది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితులైన ఎస్.పి. వేలు మణి, పి. తంగవేలు చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. పొత్తుల విషయమై చర్చించేందుకు పార్టీ ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల బృందంలో వీరిద్దరూ సభ్యులే. ముఖ్యమంత్రి పళనిస్వామికి వీరు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు తమిళ సై సౌందరరాజన్, కేంద్ర మంత్రి , కన్యాకుమారి ఎంపీ అయిన పోన్ రాధాకృష్ణన్ చర్చల్లో పాల్గొన్నారు.

గత ఎన్నికల్లో……

2014 ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గాను అధికార అన్నాడీఎంకే 37 స్థానాలను సాధించి తిరుగులేని విజయాన్ని సాధించింది. విపక్ష డీఎంకే కు ఒక్క స్థానామూ దక్కకపోవడం గమనార్హం. అన్నాడీఎంకే తరుపున ఎన్నికైన ఎంపీల్లో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఒకరు. కన్యాకుమారి బీజేపీ అభ్యర్థి పోన్ రాధాకృష్ణన్ 1,28 లక్షల ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి వసంత కుమార్ ను ఓడించారు. ధర్మపురి స్థానం నుంచి పీఎంకే అధినేత అన్జుమణి రాందాస్ 1.77 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే ఒకింత బలహీన పడినట్లేనని అంచనా. జయకు ధీటైన నాయకుడు పార్టీలో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ప్రజాదరణ, పార్టీని సమన్వయపరిచే విషయాల్లో జయలలిత చాకచక్యం వేరు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం లు ప్రజాకర్షక నాయకులు కారు.

బలహీన పడిన పార్టీతో……

జయ కుడి భుజం శశికళ జైలులో ఉండటం మరో లోపం. దీంతో పార్టీ బలహీనపడినట్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. 12 స్థానాలను మిత్ర పక్షాలకు వదిలేసి మిగిలిన 27 స్థానాలతోనే సరిపెట్టుకోవడం ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో 39కి 37 స్థానాలను గెలుచుకున్న పార్టీ ఈసారి 27 స్థానాలకు పోటీ చేయడం తరగిపోతున్న పట్టుకు ఉదాహరణ. 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన అన్నాడీఎంకే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో మళ్లీ గెలవడం విశేషం. మొత్తం 232 స్థానాలకు గాను 136 స్థానాలను సాధించి జయ ఆధిక్యాన్ని చాటారు. విపక్ష డీఎంకే స్టాలిన్ సారధ్యంలో పోరాడి 89 స్థానాలను కైవసం చేసుకుంది. తద్వరా బలమైన విపక్షంగా ఆవిర్భవించింది. కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ ఒకే ఒక స్థానానికి పరిమితమయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాల్లో కనీసం మూడింటిని కైవసం చేసుకోవాలన్నది కమలనాధుల లక్ష్యం. తద్వారా అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండంకెల సీట్లను గెలుచుకోవడం ద్వారా ఉనికిని చాటుకోవాలననది బీజేపీ వ్యూహంగా కన్పిస్తుంది.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News