టీడీపీకి బీ టీమ్ కాదా ?

బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ అని ఏడాది క్రితం వరకూ అంతా అనుకునే మాట. ఎందుకంటే టీడీపీలో ఉన్న ఒక బలమైన సామాజికవర్గం పెద్దలే [more]

Update: 2021-04-14 02:00 GMT

బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ అని ఏడాది క్రితం వరకూ అంతా అనుకునే మాట. ఎందుకంటే టీడీపీలో ఉన్న ఒక బలమైన సామాజికవర్గం పెద్దలే ఆ పార్టీని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారు. దాని వల్ల పేర్లు వేరు. పార్టీలు వేరు అయినా ఏపీలో మాత్రం రాజకీయ కధ మామూలుగానే సాగిపోయేది. ఇక బీజేపీ పెద్దగా సోము వీర్రాజు రాగానే కొంత తేడా వచ్చింది. ఇపుడు తాజాగా వీరావేశంతో ఆయన చేసిన ఒక ప్రకటన కమలం పార్టీలో కలకలం రేపుతోంది. పైగా అందులో ఉన్న ఒక వర్గం వారికి ఉక్కబోతగా మారుతోందిట.

వారిదే ఆధిపత్యమా ?

బీజేపీలో కమ్మ కులస్థుల ఆధిపత్యం ఈనాటిది కాదు. 1980లో పుట్టిన ఆ పార్టీకి ఉమ్మడి ఏపీలో తొలిసారి బీసీ నేతగా పీవీ చలపతిరావు వ్యవహరించారు. ఆ తరువాత బీజేపీ రాత గీతా కూడా పూర్తిగా మారిపోయాయి. పీవీ శిష్యుడిగా ఉన్న వెంకయ్యనాయుడు బీజేపీ మీద తనదైన ముద్ర బలంగా వేశారు. ఇక మరో వైపు చూస్తే తెలంగాణా విడిపోయాక ఏపీలో ఒక సామాజికవర్గం చేతుల్లో ఇంకా బాగా బీజేపీ ఇరుక్కుపోయింది అన్న చర్చ కూడా వచ్చింది. కానీ సోము వీర్రాజు రాకతో బీజేపీలో సామాజిక సమీకరణలు ఒక్కసారిగా రంగు మార్చాయి. బీజేపీలో ఇక కాపులదే పెత్తనం అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

పక్క చూపులేనా…?

బీజేపీలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇపుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. సోము వీర్రాజు వచ్చాకే ఆయన సైడ్ అయ్యారు. అలాగే మరో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా సైలెంట్ అయ్యారు. ఇక కేంద్రంలో మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చినా కూడా ఏపీలో మాత్రం ఆమె పేరు పెద్దగా పార్టీలో వినిపించని పరిస్థితి ఉంది. బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కంభంపాటి హరిబాబు అయితే మౌనమే నా భాష అంటున్నారు. ఇపుడు హఠాత్తుగా తిరుపతి ఎన్నికల వేళ ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా సోము వీర్రాజు చేసిన ప్రకటనతో బీజేపీని అట్టిపెట్టుకుని ఉన్న ఈ బలమైన సామాజికవర్గానికి దిక్కుతోచడంలేదన్న మాట అయితే వినిపిస్తోంది.

కుదిరే పని కాదా…?

బీజేపీకి ఏపీలో అసలే రాజకీయ ఉనికి సమస్య ఉంది. జనసేనతో కలసి ప్రయాణించా లనుకుంటోంది. దాంతో తప్పనిసరిగా పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల మాటనే వినాలి, ఆ బాటనే నడవాలి. బీజేపీ కేంద్ర పెద్దలు కూడా ఏపీ వరకూ రాజకీయ ప్రయోగం చేయాలనుకుంటున్నారు. సామాజిక వర్గాల పరంగా ఇప్పటిదాకా అధికార పీఠాన్ని అధిరోహించని కాపులను చేరదీయాలన్నదే వారి ఆలోచన. అందువల్ల బీజేపీలో నిన్నటి ఆధిపత్య కులాలకు ఇబ్బంది అయినా పట్టించుకునే సీన్ అయితే లేదు. అందువల్ల సోము వీర్రాజు చెప్పినట్లుగా కూటమికి పెద్దన్న పవనే అవుతారు. ఒకవేళ పవర్ లోకి వచ్చినా కాపు నేతనే పట్టం కడతారు. సో బీజేపీ ఇలా కళ్ళు తెరిపించిన వేళ ఆ పార్టీ మా సొంతమని అనుకుంటున్న వారు కానీ టీడీపీకి బీ టీమ్ గా మార్చిన వారు కానీ చింతించి ప్రయోజనం లేదంతే.

Tags:    

Similar News