కమలనాధులతో జగన్ పరాచికాలు… ?

ఏపీలో బీజేపీది అక్షరాలా అస్తిత్వ పోరాటమే. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని కంటే కూడా ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలి అన్న ఆరాటమే [more]

Update: 2021-09-07 06:30 GMT

ఏపీలో బీజేపీది అక్షరాలా అస్తిత్వ పోరాటమే. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని కంటే కూడా ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలి అన్న ఆరాటమే వారిది. ఇవాళ రేపట్లో ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆశలు అసలు లేవు. ఆంధ్రా రాజకీయాల విషయంలో వారికి స్పష్టమైన అవగాహన అయితే ఉంది. అలా తమ పని ఏదో చేసుకుపోతున్న కమలనాథులతో జగన్ పరాచికాలు ఆడుతున్నారు. వారిని గిల్లి గిచ్చి వీధులలోకి రప్పిస్తున్నాడు. పాపం జగన్నాటకంలో తాము పాత్రధారులమో సూత్రధారులమో తెలియక కాషాయదారులు కారాలూ మిరియాలూ తెగ నూరుతున్నారు. జగన్ మీద ఆవేశపడిపోతున్నారు. అసలు ఇంతకీ జగన్ కి ఏం కావాలి, కమలనాథులకు ఏం కావాలి అన్నదే ఎవరికి అర్ధం కాని విషయం.

చెల్లని కార్డు…

కమలనాథులు ఆ కార్డుని ఎపుడో వాడేసారు. దాని వల్ల పైసా కూడా లాభం లేదని కూడా తెలుసుకున్నారు. కానీ పదే పదే అదే కార్డు వాడాల్సివస్తోంది. ఏపీ సర్కార్ హిందువులకు అన్యాయం చేస్తోందని బీజేపీ నేతలు అంతగా అరచి గోల చేసినా వర్కౌట్ కాదు, జగన్ కి కూడా ఆ సంగతి తెలుసు. అందుకే ఆయన బీజీపీని కవ్విస్తున్నారులా ఉంది. లేకపోతే వినాయక చవితి ఉత్సవాలకు కూడా షరతులు పెట్టారన్న చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవడం అన్నదే రాజకీయం తెలిసిన వారి మాట. దీని వల్ల జగన్ కి తటస్థంగా ఉన్న వారిలో కొంత వ్యతిరేకత తప్ప మరేమీ ఓనకూడేది లేదు. ఇంకో వైపు ఇది బీజేపీకి కాకపోయినా టీడీపీకి రాజకీయంగా లాభం చేకూరుస్తుంది. మరి జగన్ కి ఈ సంగతి తెలియదు అనుకోగలరా. జగన్ వ్యక్తిగతంగా క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తారు. దాంతో బీజేపీ లాంటి పార్టీలు చేసే ప్రతి చిన్న ఆరోపణ అతి పెద్ద వివాదం అవుతోంది. అసలే పాలనాపరమైన ఇబ్బందులు ఉన్న వేళ ఈ కొత్త తగవులు ఎవరూ కోరుకోరు. కానీ జగన్ మాత్రం ఢీ కొడుతూనే ఉన్నారు. అది దేవతా విగ్రహాల కూలగొట్టడం నుంచి మొదలై టిప్పు సుల్తాన్ విగ్రహావిష్కరణ దాకా సాగి ఇపుడు చవితి ఉత్సవాల దాకా వచ్చేసింది.

జట్టు కూడితే…?

ఒకటి ఎపుడూ ఒంటరి అంకె. అయితే దాని పక్కన సున్నా చేరిస్తే చాలు పదింతలు విలువ పెరుగుతుంది. అలాగే బీజేపీ తో పెట్టుకుంటే ఏంటి అనుకోవచ్చు. కానీ రేపు ఇదే బీజేపీ టీడీపీతో జట్టు కడితే జగన్ పరాచికాలు కాస్తా రాజకీయ చికాకులుగా మారిపోతాయి. అందువల్ల బీజేపీతో ఎరిగి మరచి పెట్టుకోకూడదనే రాజకీయ నీతి. అలా పెట్టుకుని అపర చాణక్యుడు చంద్రబాబు ఏమయ్యారన్నది కూడా కళ్ళ ముందున్న చరిత్రే మరి.

థాంక్స్ చెప్పాల్సిందే…

తెలంగాణా బీజేపీకి బోలెడు పని ఉంది. అదే ఏపీలో మాత్రం ఫుల్ ఖాళీ. అలాంటిది జగన్ పుణ్యమాని బీజేపీకి కూడా మంచి పని దొరికింది. సోము వీర్రాజు కూడా వీరుడైపోతున్నారు. కాసుకో జగన్ అంటున్నారు. అరెస్టులు, నిరసనలు ఇలా బీజేపీ హడావుడి ఒక్కలా లేదు మరి. ఈ పుణ్యమంతా జగన్ దే మరి. ఫలితం మాత్రం అచ్చంగా చంద్రబాబుదైతే ఆశ్చర్యం లేదుగా.

Tags:    

Similar News