Bjp : బండి ప్రయత్నాలు అన్నీ వృధాయేనా?

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం. పార్లమెంటు ఎన్నికలకు ముందే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికల్లో మరిన్ని స్థానాలు సాధించాలంటే ముందుగా అసెంబ్లీ [more]

Update: 2021-11-10 11:00 GMT

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం. పార్లమెంటు ఎన్నికలకు ముందే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికల్లో మరిన్ని స్థానాలు సాధించాలంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో కొంత సత్తా చాటాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెప్పుకుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో ఆ పార్టీ తామే అధికారంలోకి వస్తామని కూడా చెప్పుకుంటుంది.

ఎక్కడా బలంగా లేని….

కానీ దుబ్బాక ఉప ఎన్నిక పరిస్థితి వేరు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బీజీపీలోకి రావడంతో అక్కడ బలంగా కన్పించింది. కానీ 119 నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి ఏంటంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బలంగా లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో చేరికలు కూడా లేవు.

కాంగ్రెస్ బలపడితే….

దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ కొంత బలపడటమే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యాక బీజేపీలో చేరాలనుకున్న నేతలు సయితం పునరాలోచనలో పడ్డారు. పరిస్థితిని అంచనా వేసుకున్నాక నిర్ణయం తీసుకుందామని వారు చేరికకు సిద్ధం కావడం లేదు. అధికార టీఆర్ఎస్ మాత్రం తమకు బీజేపీతోనే పోరు అన్న కలర్ ను రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించే ప్రయత్నం చేస్త్ుంది. దీనికి కారణం బీజేపీ బలపడకూడదనే.

చేరికలు కూడా….

కానీ కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా బీజేపీకి వచ్చే ఎన్నికలలోనూ అవకాశాలు ఎంతమాత్రం లేవనే చెప్పాలి. రేవంత్ రెడ్డి కూడా బీజేపీని తొలుత వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి నేతలను తీసుకు వచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కొందరు ఇప్పటికే టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి భవిష్యత్ లో పార్టీ నేతలు వీడటం తప్ప చేరికలు ఉండబోవన్న అంచనాలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News