మిత్రుల విలువ తెలిసొచ్చినట్లుందే….!!!

సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రులతో సీట్ల సర్దుబాటు, వారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు [more]

Update: 2019-03-21 17:30 GMT

సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రులతో సీట్ల సర్దుబాటు, వారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లనీయకుండా చేయడంలో విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా మరే ఇతర పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలకపోవడం విశేష పరిణామం. 2014 నాటి మిత్రులకు అదనంగా బీహార్ లో జనతాదళ్ (యు),తమిళనాడులో అన్నాడీఎంకే తో కలసి ముందుకు సాగుతుండటం తాజా పరిణామం. మొత్తానికి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శరవేగంగా పార్టీ నేతలను కలిసి సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తేవడం గమనార్హం. నిన్న మొన్నటి దాకా ఎడమొహం, పెడమొహంగా ఉన్న మిత్రులను దారికి తీసుకురావడంలోనూ కమలం పార్టీ అధ్యక్షుడు ఫలప్రదమయ్యారు.

సీట్లను తగ్గించుకుని….

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బీహార్ లో ఒంటరిగా పోటీ చేసింది. రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ వంటి చిన్న చితకా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ మంచి ఫలితాలను సాధించింది. అనంతరం 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురవ్వడంతో పొత్తులకు తెరతీసింది. గత ఎన్నికల్లో 31 సీట్లలో పోటీ చేసి 22 సీట్లను గెలుచుకున్నప్పటికీ ఈసారి సీట్లను తగ్గించుకుంది. తాజాగా బీజేపీ 17, జనతాదళ్ యు 17, సీట్లకు పోటీ చేయనున్నాయి. ఎల్జీపీ 6 సీట్లలో పోటీ చేయనుంది. జనతాదళ్ యు అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యక్తిగత ఇమేజ్ ఈ ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని కమలం పార్టీ అంచనాగా ఉంది.

ఒక మెట్టు దిగి…

మరోవైపు నిన్న మొన్నటి దాకా మహారాష్ట్రలో ఎడమొహం, పెడమొహంగా ఉన్న శివసేన మళ్లీ కమలంతో దోస్తీకి రెడీ అయింది. పార్టీ ఆవిర్భావం నుంచి కమలంలో కలసి ప్రయాణిస్తున్న ఈ పార్టీ గత రెండు, మూడేళ్లుగా బీజేపీ తీరుపై గుర్రుగా ఉంది. తరచూ విమర్శలు సంధించేది. ఒక దశలో ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని సయితం హెచ్చరించింది. తాజాగా బీజేపీ 25, శివసేన 23 సీట్లలోపోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో పొత్తు సాకారమైంది. పంజాబ్ లో చిరకాల మిత్ర పక్షమైన అకాళీదళ్ తో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆంధ్రప్రదేశ్ లో 2014లో కలసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఏ నుంచి బయటకు వెళ్లింది. దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులోనూ పొత్తు కుదుర్చుకుంది. ఇక్కడ డీఎంకే కాంగ్రెస్ తో కలసి ప్రయాణిస్తోంది. దీంతో అధికార అన్నాడీఎంకేతో కమలం పార్టీ సీట్ల సర్దుబాటుకు తెరదీసింది. జయలలిత హయాంలోనూ, ఆమె మరణానంతరం కూడా రెండు పార్టీలు ఒక అవగాహనతో పనిచేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతిస్తోంది. ఆ పార్టీ ఎంపీ తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేదు. 2014 లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క కన్యాకుమారి పార్లమెంటు స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. అక్కడి నుంచి గెలిచిన పొన్ను రాధాకృష్ణన్ కేంద్రమంత్రిగా ఉన్నారు. విజయ్ కాంత్ నాయకత్వంలోని డీఎండీకే, ఇతర ద్రావిడ పార్టీలు ఈకూటమిలో భాగస్వామ్యులు. ఉత్తరప్రదేశ్ లోని మిత్రపక్షాలు అప్నాదళ్, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అవి కూటమిని వీడే పరిస్థితిలేదు. పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీతో విభేదించిన అసోం గణపరిషత్ ఇటీవల అసోం సంకీర్ణ సర్కార్ నుంచి వైదొలిగింది. మెజారిటీ ఉన్న దృష్ట్యా బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. తాజాగా అసోం గణపరిషత్ అధ్యక్షుడు ప్రపుల్లకుమార్ మహంతా బీజేపీ కూటమిలో ఉండేందుకు అంగీకరించడం విశేషం. అంతేకాక పొత్తు కూడా కుదుర్చుకున్నారు. అసోం గణపరిషత్ తో పాటు బోడో పీపుల్స్ ఫ్రంట్ ను కూడా దారికి తీసుకురావడంలో బీజేపీ విజయవంతమైంది. ఈశాన్య భారతంలో 25 లోక్ సభ స్థానాలున్నాయి. పొత్తులకు సంబంధించి వివిధ పార్టీలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మంత్రాంగం నెరపుతున్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఆయన పావులు కదుపుతున్నారు. ఈసారి సంపూర్ణ మెజారిటీ రాదన్న అంచనాల మేరకు మిత్రుల విలువ బీజేకి బాగా అర్థమయింది. అందుకే అవసరమైతే ఒక మెట్టుదిగి పొత్తులకు సిద్ధమయింది.

తమదే విజయం అన్న ధీమా…..

కాంగ్రెస్ కు ధీటైన ప్రత్యామ్నాయం కోసం నాడు పార్టీ నిర్మాతలు వాజ్ పేయి అందుకే వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి పొత్తులకు తెరదీశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్ రద్దు వంటి వివాదాస్పద అంశాలను అటకెక్కించారు. దీతో వాజ్ పేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో 24 పార్టీలు భాగస్వామ్యులయ్యాయి. 2014లో మోదీ అధికారం చేపట్టేనాటికి ఎన్డీఏ భాగస్వామ్యుల సంఖ్య 30కి చేరింది. ఇప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామ్యుల సంఖ్య మూడు డజన్ల పైమాటే. పొత్తులతో పాటు దేశవ్యాప్తంగా 11 కోట్ల కు పైగా గల కార్యకర్తల బలగం, ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా గల బీజేపీ మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. మోదీకి ధీటైన ప్రత్యామ్నాయ నాయకుడు లేకపోవడం, విపక్షాల అనైక్యత, పుల్వామా ఘటనల నేపథ్యంలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంచనా వేస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News