ఇద్దరీకి బీజేపీ చెక్ పెడుతుందా…?

జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే పోలవరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరిన టీడీపీ, వైసీపీలకు బీజేపీ చెక్ పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి గరిష్ఠంగా [more]

Update: 2020-12-03 15:30 GMT

జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే పోలవరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరిన టీడీపీ, వైసీపీలకు బీజేపీ చెక్ పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి గరిష్ఠంగా ప్రయోజనం చేకూర్చేలా పథకం నిర్మాణంలో జోక్యం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకుగాను వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ‘మాకొద్దు బాబోయ్, ఈ ప్రాజెక్టు మీరే నిర్మించడంటూ ప్రధాన పార్టీలు రెండూ కేంద్రం వద్ద మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా పావులు కదుపుతోంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా రాష్ట్రం పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేనన్ని తీవ్ర విభేదాలు నవ్యాంధ్రలో పొడసూపుతున్నాయి. కులపరమైన సమీకరణలు గతం కంటే దారుణంగా పెరిగిపోయాయి. సంక్షేమ పద్దు పేరిట సర్వం పంచి పెట్టే వింత ధోరణి. కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చిల్లిగవ్వ చేతిలో లేదు. ఈ స్థితిలో ఏపీలో పార్టీలు క్లెయిం చేసుకోగలిగిన అతి పెద్ద అంశం పోలవరమే. అది ఆయా పార్టీలకు కూడా తెలుసు. అందుకనే దీని చుట్టూ రాజకీయాన్ని నడపాలని భావిస్తున్నాయి. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు పెద్ద వివాదంగా మారుతోంది. పిట్ట పోరు..పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా దీని ఫలితాలను కేంద్రం రూపేణా బీజేపీ చంకన పెట్టుకొని పోవాలని చూస్తోందనే విశ్లేషణలు వినవస్తున్నాయి.

టీడీపీ ఫెయిల్…

నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన టీడీపీ మొదటి రెండేళ్లు పోలవరంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదనే చెప్పవచ్చు. అయితే పోలవరం పూర్తి కావాలంటే ముంపు మండలాలు ఏపీలో కలవాలనే విషయంలో చంద్రబాబు గట్టిగా పట్టుబట్టి కేంద్రంతో ఆర్డినెన్స్ తెప్పించుకున్న మాట మాత్రం వాస్తవం. అయినప్పటికీ తెలంగాణను పూర్తిగా వదులుకోవడానికి ఇష్టపడని టీడీపీ ఇక్కడి నుంచే రాజకీయాలు నడిపింది. ఓటుకు నోటు కేసు తదనంతర పరిణామాలతో విజయవాడకు రాజధాని తరలిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు వేగాన్ని పుంజుకుంది. నిధులన్నీ కేంద్రానివే అయినప్పటికీ క్రెడిట్ తన ఖాతాలో పడాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వానికే దీనిని అప్పగించేలా చంద్రబాబు పావులు కదిపారు. కాంట్రాక్టులో కమీషన్ల కోసమే చంద్రబాబు ఈ పనిచేశారని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ తీవ్రంగానే ఆక్షేపించింది. వివిధ మార్గాల్లో ప్రాజెక్టు తీరుపైన, కాంట్రాక్టులపైనా ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. తాను సృష్టించగలిగినన్ని అవరోధాలను, ఆటంకాలను కల్పించింది. అవసరమైన నిధులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ జాప్యం చేయడం, కేంద్రంతో వైరం కొని తెచ్చుకోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయకుండానే గద్దె దిగాల్సి వచ్చింది.

వైసీపీ షేమ్…

పోలవరం నిర్మాణం విషయంలో టీడీపీ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన వైసీపీ తాను తీసుకున్న గోతిలోనే చిక్కుకుంది. నిర్మాణ వ్యయం అంచనాలను టీడీపీ తీవ్రంగా పెంచేసిందనే ఆరోపణలను నిరూపించడం కోసం బడ్జెట్ ను 58 వేల కోట్ల నుంచి 47 వేల కోట్ల రూపాయల కు కుదించాల్సి వచ్చింది. నిజానికి నిర్మాణ ప్రాజెక్టులు జాప్యం చేసే కొద్దీ వ్యయం పెరుగుతుంది. కాంట్రాక్టు సంస్థలు ఏదో రూపేణా అంచనాలను పెంచి తిరిగి వేర్వేరు మార్గాల్లో ఆమోదింపచేసుకుంటాయి. ఈ సాంకేతిక అంశాన్ని పెద్దగా పట్టించుకోని వైసీపీ తాను పట్టిన కుందేటి మూడేకాళ్లు అన్నట్లుగా వ్యవహరించడంతో సమస్య ముదిరింది. గతంలో వైసీపీ చేసిన ఫిర్యాదులు, రాజకీయంగా కేంద్రంపై పట్టు లేకపోవడంతో ప్రాజెక్టులో అతి ప్రధానమైన నిర్వాసితులకు సహాయ పునరావాసం, భూసేకరణ ఖర్చులను తాను ఇవ్వనంటూ కేంద్రం తాజాగా తేల్చి చెప్పేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణమే ముందుకు నడవని స్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభు్త్వం ఇది స్వయంగా కొని తెచ్చుకున్న ఉపద్రవం. ఫలితం రాష్ట్రం మొత్తంపై పడే అవకాశం కనిపిస్తోంది.

సెంటర్ సిగ్నల్…

కేంద్రాన్ని వేలెత్తి చూపకుండా అధికార, ప్రతిపక్షాలు రెండూ కాట్లాడుకోవడం బీజేపీకి, కేంద్రానికి ఆనందాన్నిస్తోంది. టీడీపీ, వైసీపీలు రెండూ కేంద్రాన్ని నిలదీయలేని రాజకీయ నిస్సహాయతలో చిక్కుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సైతం ఒకే మాట, ఒకే బాటగా నడిచేందుకు సిద్దపడటం లేదు. శాసనసభ వేదికను వినియోగించుకుని పోలవరం వంటి అత్యవసర ప్రాజెక్టులపై ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదిస్తే మేలు. అటువంటి ప్రయత్నాలు సాగడం లేదు. కనీసం కలిసి మాట్లాడుకునేందుకు కూడా ఈ రెండు పార్టీలు సుముఖంగా లేవు. ఇది కేంద్రానికి పెద్ద రిలీఫ్. తమ వద్ద నిధులు లేవు . ముందుగా పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని కేంద్రం ఎదురు చూస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఒక ప్రాతిపదికతో బీజేపీ బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును తమ చేతుల మీదుగానే పూర్తి చేసి తమ పార్టీకి రాజకీయ క్షేత్రాన్ని అందించాలనేది కమలనాథుల ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తి నిధులు రావాలంటే కేంద్ర పర్యవేక్షణ, అధీనంలోనే నిర్మాణం జరగాలి. ఒకవేళ రాష్ట్ర్రమే పూర్తి చేసుకునేందుకు సిద్దపడితే 25 వేల కోట్ల రూపాయలు పైచిలుకు సొంత సొమ్ములు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లాజిక్కుతోనే కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రప్రభుత్వానికి దిక్కుతోచని స్థితి కల్పిస్తోంది. ఒకవైపు రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం ఈ పథకాన్ని పూర్తి చేస్తుందంటూ ప్రకటనలు చేస్తూ సంకేతాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విషయానికొస్తే నవరత్నాల తర్వాతనే వేరే ఏ పథకమైనా. అందువల్ల నిధుల లేమితో పోలవరాన్ని కేంద్రానికి అప్పగించక తప్పని అనివార్యత ఏర్పడుతుందని బీజేపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News