అతి చేస్తే.. అనుభవించక తప్పదు

ఎక్కడైనా అతి చేస్తే అంతే. తనకున్న బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రత్యర్థిని బలహీనపర్చాలనుకుంటే అది రివర్స్ తంతుంది. రాజకీయాల్లో ఇది ప్రాధమిక సూత్రం. పశ్చిమ బెంగాల్ లో [more]

Update: 2021-04-26 16:30 GMT

ఎక్కడైనా అతి చేస్తే అంతే. తనకున్న బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రత్యర్థిని బలహీనపర్చాలనుకుంటే అది రివర్స్ తంతుంది. రాజకీయాల్లో ఇది ప్రాధమిక సూత్రం. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. పదేళ్ల మమత బెనర్జీ పాలనలో సహజంగానే అసంతృప్తి తలెత్తుతుంది. దానిని సాఫ్ట్ గా తమవైపునకు మలచుకోవాల్సిన బీజేపీ హార్డ్ గా వ్యవహరించడం ఇప్పుడు అసలుకే ముప్పు ఏర్పడిందంటున్నారు.

మమతకు ప్లస్ గా…..

బీజేపీ నేతలు చేస్తున్న అతి మమత బెనర్జీకి ప్లస్ గా మారుతుంది. వరస పెట్టి టీఎంసీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం. నో డౌట్ అందులో కొందరు వ్యక్తిగతంగా బలమైన నేతలే కావచ్చు. కానీ టీఎంసీ సింబల్, మమత బెనర్జీ చరిష్మాయే గత ఎన్నికల్లో వారి గెలుపునకు కారణమని చెప్పకతప్పదు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన వారిపై వ్యక్తిగతంగా ఉన్న అసంతృప్తి తొలగిపోదు.

పాత నేతలకు….

ఇక బీజేపీలో దీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తూ, ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు కొత్త నేతల రాక ఇబ్బందికరంగా మారింది. టిక్కెట్ ఆశించిన నేతలకు కూడా దక్కక పోవడంతో వారు అభ్యర్థికి మనస్ఫూర్తిగా మద్దతిచ్చే పరిస్థితి లేదు. గెలిస్తే భవిష్యత్ తమకు ఉండదని భావించిన పాతనేతలు సహకరించడం మానేశారు. ఇది కూడా టీఎంసీకి వరంగా మారింది. దాదాపు ఇరవైనాలుగు మంది టీఎంసీ ఎమ్మెల్యేలను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది.

దీదీని టార్గెట్ చేయడం….

బీజేపీ అధినాయకత్వం ఎంత సర్దిచెబుతున్నా వారు వినడ లేదంటున్నారు. ఇక మమతపై వరసగా విరుచుకుపడటం, ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి దీదీని టార్గెట్ చేయడం కూడా బెంగాలీలకు నచ్చడం లేదంటున్నారు. ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇది అతి కావడంతో ప్రజలు కూడా మమత వైపు మొగ్గు చూపే అవకాశముందని చెబుతున్నారు. ఏదైనా అతి పనికిరాదు అన్న పెద్దల నానుడి ఊరికే కాదు.

Tags:    

Similar News