యడ్డీ ఆశలకు గండి…!!!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న యడ్యూరప్ప ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. భారతీయ జనతా పార్టీ పెట్టే షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం [more]

Update: 2019-06-09 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న యడ్యూరప్ప ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. భారతీయ జనతా పార్టీ పెట్టే షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. పార్టీ మారితే ప్రయోజనం ఉండాలి. రాజకీయాల్లో ప్రయోజనం అంటే పదవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ పార్టీ మారి వచ్చిన వారికి, ప్రభుత్వాన్ని కూలదోసి మరీ మంత్రి పదవులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదు.

అతి పెద్ద పార్టీ అయినా…..

భారతీయ జనతా పార్టీకి 105 మంది శాసనసభ్యులు మద్దతు ఉన్నా కేవలం ఏడు మంది సభ్యుల కోసం ఏడాదిగా విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇందులో కొంత మేరకు సక్సెస్ కాగలిగింది. కాంగ్రెస్, జేడీఎస్ లపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ఆపరేషన్ కమల్ ను వెంటనే మొదలు పెట్టింది. రమేష్ జార్ఖిహోళి, మహేష్ కుమటహళ్లి వంటి నేతలు పార్టీ లో చేరేందుకు ముందుకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

కోరికలు తీర్చడమెందుకు….?

పార్టీ మారి వచ్చినందుకు వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాజీనామాలు చేసి రావాలని బీజేపీ అధిష్టానం గత ఏడాది వరకూ షరతులు విధించింది. దీనికి కాంగ్రెస్ శాసనసభ్యులు అంగీకరించలేదు. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామో? లేదో? అన్న భయం వారిని రాజీనామాకు వెనకడగు వేసేలా చేసింది. అయితే మళ్లీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీని అధికారంలోకి తేవాలనుకున్నారు. యడ్డీ అనుకున్నట్లుగానే కేంద్రంలో అధికారంలోకి రావడం, కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటడంతో యడ్డీ ముఖ్యమంత్రి ఆశలు నెరవేరుతాయనుకున్నారు.

ప్రజాభిప్రాయానికి భిన్నంగా…..

అయితే రెండోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత పార్టీ తీరు మారిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ రాజీనామా చేసి వస్తే చాలన్న కమలనాధులు ఇప్పుడు అంత అవసరమేముందన్న అభిప్రాయంలో ఉన్నారు. కర్ణాటకలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు పట్టం కడితే, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాన్ని కూలదోయడం ఎందుకని కేంద్ర నాయకత్వం ఆలోచనలో పడిందంటున్నారు. అందుకోసమే యడ్డీ దూకుడుకు బీజేపీ కళ్లెం వేసిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొత్తం మీద యడ్డీ ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు.

Tags:    

Similar News