సెంటిమెంట్ మరోసారి ఛాన్స్ ఇస్తుందా?

అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దేశ వ్యాప్తంగా రామమందిరం సెంటిమెంట్ కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. రామమందిరం నిర్మాణాన్ని 2024 కు పూర్తి చేయాలన్న [more]

Update: 2020-08-10 17:30 GMT

అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దేశ వ్యాప్తంగా రామమందిరం సెంటిమెంట్ కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. రామమందిరం నిర్మాణాన్ని 2024 కు పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఉంది. అయితే సెంటిమెంట్ ఎలా ఉన్నప్పటికీ రామమందిరం రానున్న ఎన్నికల్లో బీజేపీ కి లబ్ది చేకూరుస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని కమలనాధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిన్నరలో ఎన్నికలు…

ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఏడాదిన్నరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 2022లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. సమయం కూడా తక్కువగా ఉందనే చెప్పాలి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలంటే దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అక్కడ పార్లమెంటులో ఎక్కువ స్థానాలు ఎవరు సాధిస్తే వారికే ఢిల్లీ పీఠం దక్కుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీయే అత్యధికంగా సీట్లను గెలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

కలసి వచ్చే అంశమని….

ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం బీజేపీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో రామమందిర నిర్మాణాన్నే బీజేపీ ప్రధాన అంశంగా తన ప్రచారంలో ఉంచనుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాలను సాధించి తిరుగులేని విజయం అందుకుంది. సమాజ్ వాదీ పార్టీకి 54, బహుజన్ సమాజ్ పార్టీకి 19 స్థానాలు మాత్రమే దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 202 మాత్రమే. ఈనేపథ్యంలో ఈసారి పోటీ తమకే అనుకూలంగా ఉంటుందని, రామమందిర నిర్మాణమే తమను విజయాల బాట పట్టిస్తుందని బీజేపీ గట్టిగా విశ్వసిస్తుంది.

విపక్షాల ప్రయత్నాలు……

సమాజ్ వాదీ పార్టీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. ములాయం కుటుంబంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకుని విజయం సాధించాలని ప్రయత్నాలను ప్రారంభించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి సయితం ఉత్తర్ ప్రదేశ్ లో జెండా పాతేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రామమందిర నిర్మాణం బీజేపీ ఘనత కాదని, అది సుప్రీంకోర్టు తీర్పుతోనే సాధ్యమయిందని మాయావతి వ్యాఖ్యానించారు. మరో వైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లక్నోలోనే మకాం వేసి ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ పటిష్టత కోసం చెమటోడుస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో రామమందిరం ప్రధాన అంశంగా మారనుంది.

Tags:    

Similar News