ఇక అఖిల చాప్టర్ క్లోజ్ అయినట్లేనా?

ఎవరైనా తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. వ్యాపారాల్లో అయితే దానిని వారసులు అభివృద్ధి చేసి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటారు. అదే రాజకీయాల్లో అయితే తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని [more]

Update: 2021-01-07 08:00 GMT

ఎవరైనా తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. వ్యాపారాల్లో అయితే దానిని వారసులు అభివృద్ధి చేసి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటారు. అదే రాజకీయాల్లో అయితే తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం డిఫరెంట్. అఖిలప్రియ తనకు అదృష్టాన్ని చేజేతులా చేజార్చుకుంటుంది. అది ఆమె స్వయంకృతాపరాధమే.

అటు అదృష్టం.. మరో దురదృష్టం….

అఖిలప్రియది ఒక రకంగా దురదృష్టం. మరొకరకంగా అదృష్టం. తల్లిదండ్రులు ఇద్దరూ ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిప్రియకు వెంటనే మంత్రి పదవి దక్కింది. ఇది నిజంగా అదృష్టమే. తొలిసారి గెలిచి, చిన్న వయసులో మంత్రి పదవి దక్కించుకున్న అఖిలప్రియ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటుందని భావించారు. కానీ ఆమె స్టయిల్ వేరు. తనను చూసి ఓటు వేశారన్న భ్రమలో ఉన్నారు. అందుకే మంత్రిగా ఉన్న రెండున్నరేళ్లు ఆమె పెద్దగా పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకోలేదంటారు.

సన్నిహితులను దూరం చేసుకుని….

తన తల్లి, తండ్రి ఇన్ని సార్లు గెలవడానికి ఉపయోగపడిన సన్నిహితులు, క్యాడర్ ను కూడా అఖిలప్రియ తన వ్యవహార శైలితో దూరం చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో వైరం పెట్టుకున్నారు. ఏవీపై దాడి చేయించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసు కూడా నమోదయింది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పైనే ఎక్కువగా ఈ ఆరోపణలున్నాయి.

హత్యాయత్నం.. కిడ్నాప్ కేసులు….

ఇక తాజాగా హైదరాబాద్ లోని ఒక ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ వెనక అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఉన్నారు. ఇలా హత్యకు కుట్ర, కిడ్నాప్ వంటి కేసుల్లో అఖిలప్రియ సతమతమవుతున్నారు. ఇటు పార్టీకి కూడా చెడ్డపేరు తెస్తున్నారు. దీనిపై గతంలోనే చంద్రబాబు అఖిలప్రియ కు సీరియస్ గా చెప్పారని తెలిసింది. ఇలాగే వ్యవహరిస్తే అఖిలప్రియకు రాజకీయంగా నష్టం తప్పదన్న హెచ్చరికలు ఆమె సన్నిహితుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికైనా అఖిలప్రియ తన వ్యవహారశైలి మార్చుకుంటారో? లేక తన పంధాలోనే వెళతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News