భూమనకు ఈసారైనా లక్కుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గత ఎన్నికల్లో [more]

Update: 2019-04-10 06:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ కూడా ఇక్కడ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మేల్యే చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆసక్తికర పోటీ నెలకొంది. మూడు పార్టీల అభ్యర్థులూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం చాలామంది నేతలు ప్రయత్నించినా తిరిగి టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుగుణమ్మకే కేటాయించారు చంద్రబాబు. 2014లో విజయం సాధించి కొంతకాలానికే కన్నుమూసిన వెంకటరమణ భార్య ఆమె. 2015లో వచ్చిన ఉప ఎన్నికలో వైసీపీ పోటీ పెట్టకపోవడంతో ఆమె సుమారు 1.17 ఓట్ల రికార్డు మెజారిటీతో ఆమె విజయం సాధించారు. అయితే, అందరినీ కలుపుకొని పోరని స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇవ్వరని ధీమాతో చాలామంది ఈ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నా చివరకు టిక్కెట్ ఆమెకే దక్కింది. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసంతృప్తి పెద్ద ఎత్తున రేగింది. వీరిలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది టీడీపీకి మైనస్ గా మారింది. మరికొందరు పార్టీలోనే ఉన్న పూర్తిస్థాయిలో అభ్యర్థి విజయం కోసం పనిచేయడం లేదు. అయినా సుగుణమ్మ ప్రచారంలో బాగానే కష్టపడుతున్నారు. టీడీపీ నియోజకవర్గంలో మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉండటం, తిరుపతిలో ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ చేసిన అభివృద్ధి పనులు, పలు పరిశ్రమలు రావడం వంటివి తెలుగుదేశం పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది.

త్రిముఖ పోటీ ఉన్నా…

ఇక, గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిరంజీవి రాజీనామాతో 2012లో వచ్చిన ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన ఆయన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణను ఓడించారు. గత ఎన్నికల్లో మాత్రం అదే వెంకటరమణపై సుమారు 41 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. వైసీపీలో కీలకంగా ఉండే ఆయన ఈసారి కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు. చాలారోజులుగా ఆయన ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరడం, టీడీపీలో అసంతృప్తులు ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల కంటే ఆయన చాలా బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉన్న ఓ సామాజకవర్గం ఈసారి వైసీపీ వైపు ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే, టీడీపీ అభివృద్ధి మంత్రం ముందు ఆయన ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చెప్పలేని పరిస్థితి. ఇక, జనసేన నుంచి సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తి బరిలో ఉన్నారు. ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువే. 2009లో చిరంజీవి స్వంత నియోజకవర్గంలో ఓడిపోయినా తిరుపతిలో విజయం సాధించారు. దీంతో ఆయనకు కూడా పోటీలో ఉండనున్నారు. మొత్తానికి త్రిముఖ పోటీ నెలకొన్నా విజయం మాత్రం టీడీపీ లేదా వైసీపీ మధ్యే ఉండవచ్చు.

Tags:    

Similar News