బ్రదర్స్ కు ఇక కాలం కలసిరాదా?

నెల్లూరు జిల్లాలో బీద కుటుంబం రాజకీయంగా, వ్యాపారపరంగా పేరును సంపాదించుకుంది. బీద మస్తాన్ రావు, బీద రవించంద్ర యాదవ్ లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక [more]

Update: 2021-06-21 00:30 GMT

నెల్లూరు జిల్లాలో బీద కుటుంబం రాజకీయంగా, వ్యాపారపరంగా పేరును సంపాదించుకుంది. బీద మస్తాన్ రావు, బీద రవించంద్ర యాదవ్ లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగే వారు. బీసీ సామాజికవర్గం కావడంతో బీద కుటుంబానికి పార్టీలో ప్రాముఖ్యత లభించేది. అయితే వైసీీపీ ఆవిర్భావం తర్వాత క్రమేపీ బీద కుటుంబం రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది.

గతంలో ఎమ్మెల్యేగా?

బీద మస్తాన్ రావు గతంలో కావలి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి బీద మస్తాన్ రావు, రవిచంద్రయాదవ్ లు తెలుగుదేశం పార్టీలో ఎదిగారు. ప్రతి ఎన్నికల్లో వీరి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తుంది. 2014 ఎన్నికల్లోనూ కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిి బీద మస్తాన్ రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి చెందారు.

వైసీపీలో చేరి….?

దీంతో బీద మస్తాన్ రావు ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిపోయారు. ఆయన వైసీపీలో రాజ్యసభ పదవి కోసం చేరారన్న ప్రచారం జరిగింది. అయితే రెండుసార్లు రాజ్యసభ పదవులను జగన్ భర్తీ చేసినా బీద మస్తాన్ రావు పేరును జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. అయినా బీద మస్తాన్ రావు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. క్రియాశీలకంగా లేకపోయినా ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా ఆయనకు రాజ్యసభ పదవి దక్కడం అనుమానంగానే ఉంది.

టీడీపీలో ఉన్నా….?

మరోవైపు బీద మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్రయాదవ్ మొన్నటి వరకూ ఎమ్మెల్సీగా ఉండేవారు. 2015లో గవర్నర్ కోటాలో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పేరుబలంగా విన్పించింది. చివరి నిమిషంలో అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేశారు. ఇక టీడీపీలో ఎలాంటి కీలక పదవి లభించే అవకాశాలు లేవు. మొత్తం మీద బీద బ్రదర్స్ రెండు పార్టీల్లో ఉన్నా పదవులు దక్కడం కష్టమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News