ఫస్ట్ టైమ్ గెలిచినా ట్రెండింగ్ లోకి వెళ్లారే?

వైసీపీలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కష్టకాలంలో ప్రజల వెంట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళుతున్నారు. అయితే ఇదే [more]

Update: 2020-04-24 03:30 GMT

వైసీపీలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కష్టకాలంలో ప్రజల వెంట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు వీరికి ఇబ్బందిగా మారింది. వీరివల్లనే వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది విపక్షాల ఆరోపణ. ఇందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.

తొలిసారి గెలిచి…..

ిబియ్యపు మధుసూదన్ రెడ్డి తొలిసారి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గెలిచారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సేవా కార్యక్రమాలను మధుసూదన్ రెడ్డి చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత వేగం పెంచారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించే వారు. గత ఎన్నికల్లో ఆయనకు అనారోగ్యం ఉండటంతో ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు. మరోవైపు జగన్ ప్రభంజనం కూడా ఉండటంతో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు.

ర్యాలీ తీయడంతో…..

తొలిసారి ఎమ్మెల్యే అయినా బియ్యపు మధుసూదన్ రెడ్డికి మంచి వక్తగా పేరుంది. ముఖ్యమంత్రి జగన్ నుంచి కూడా అనేక సార్లు ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు మధుసూదన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన కరోనా సందర్భంగా తీసిన ర్యాలీ వివాదాలకు దారితీసింది. కరోనా విపత్తు సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారి ఫొటోలను ట్రాక్టర్లకు తగిలించి నిత్యావసరాలను ర్యాలీగా తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. సోషల్ మీడియాలో లాక్ డౌన్ నిబంధనలు మధుసూదన్ రెడ్డి ఉల్లంఘించారన్న ప్రచారం ఊపందుకుంది.

కేసులు పెరగడంతో…….

ఈ సంఘటన తర్వాత శ్రీకాళహస్తిలో కరోనా కేసులు మరిన్ని పెరగడం కూడా ప్రచారానికి మరింత ఊతమిచ్చనట్లయింది. ఎనిమిది మంది అధికారులకు కూడా కరోనా సోకడం, వారంతా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారన్న విమర్శలు టీడీపీ చేస్తోంది. అయితే దానిని ఆయన ఖండిస్తున్నారు. తన ర్యాలీలో ఏ అధికారి అయినా పాల్గొన్నట్లు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, ప్రజలను ఆదుకోవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద మంచికిపోయి చెడు తెచ్చుకున్నట్లయింది ఈ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థిితి.

Tags:    

Similar News