ఆ రెండు ఎవరివనే…?

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ [more]

Update: 2019-08-12 16:30 GMT

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేయూఎం పార్టీలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అధికారాన్ని రెండు రాష్ట్రాల్లో కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, జేఎంఎ: శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికారాన్ని సాధించడం పక్కన పెడితే గౌరవ ప్రదమైన స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, జేఎంఎం పనిచేస్తున్నాయి.

లాల్ కుటుంబం కనుమరుగైనా…..

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే హర్యానాపై అందరి దృష్టి ఉంది. హర్యానా పేరు చెప్పగానే దేవీలాల్, భజన్ లాల్, బన్సీలాల్ గుర్తుకు వస్తారు. ఈ లాల్ త్రయం రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు శాసించింది. దేవీలాల్ జనతాదళ్ హయాంలో ఉప ప్రధానిగా, బన్సీలాల్ 70ల్లో కాంగ్రెస్ హయాంలో రక్షణమంత్రిగా చక్రం తిప్పారు. భజన్ లాల్ కేంద్రంలో పనిచేయనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్తా చాటారు. దేవీలాల్, బన్సీలాల్ కూడా సీఎంగా చక్రం తిప్పారు. ప్రస్తుతం భజన్ లాల్ , బన్సీలాల్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాల్లో లేరు. దేవీలాల్ వారసులు మాత్రం క్రియాశీలకంగా ఉన్నారు. దేవీలాల్ వారసులు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పేరుతో పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా 1999 నుంచి 2005 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. చౌతాలా తనయుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన మనోహర్ లాల్ ఖత్తర్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలకు గాను పది గెలిచి బీజేపీ మంచి ఊపుమీద ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు.
ఇటీవల పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

మిషన్ …..75

స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. పక్కనే ఉన్న హిమాచలప్రదేశ్ కు చెందిన నడ్డాకు హర్యానా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. పార్టీ ప్రధాన మద్దతుదారుల్లో జాట్ లు ఒకరు. 2014 ఎన్నికల వరకూ భూపేందర్ సింగ్ హుడా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి ఎన్నికల్లో హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది.

జార్ఖండ్ లోనూ…..

జార్ఖండ్ ఎన్నికలపైనా ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత ఐదేళ్లుగా రఘుబరన్ దాస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 81 స్థానాలు గల అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంతో కలసి 46 స్థానాలను సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా 19 స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ పార్టీ సారధి మేమంత్ సొరేన్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ 8 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమయింది. జేవీపీ, సీపీఐ(ఎంఎల్), బీఎస్పీ వంటి చిన్నా చితకా పార్టీలు ఒకటి, రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను బీజపీ 12 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్, జేఎంఎం చెరి ఒకటిని దక్కించుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భఆర్యత గీతా కోడా సింగ్ భూమ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. వీరు కేంద్ర మాజీ మంత్రి సభోర్ కాంత్ సహాయ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బల్మూబ్, ధన్ బాద్ మాజీ ఎంపీ చంద్రశేఖర్ ప్రముఖులు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులు కెసి వేణుగోపాల్ , అహ్మద్ పటేల్ అంతర్గత కలహాలను కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ వికాస్ మోర్చాతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తలపోస్తుంది. మొత్తానికి కమలదళం ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి ఉత్సాహంతో ఉండగా, విపక్షాలు ఇప్పుడిప్పుడే శక్తిని కూడ దీసుకుంటున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News