ఈ చింత ఇప్పట్లో తొలిగేట్లు లేదే?

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందినంత మాత్రాన అధికార పార్టీకి అంతా సాఫీగా ఉంటుందని చెప్పలేం. కేంద్రంలో రాజ్యసభ, రాష్టాల్లో శాసనమండళ్లు అధికార పార్టీకి వేగ నిరోధకాల్లా [more]

Update: 2021-06-15 16:30 GMT

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందినంత మాత్రాన అధికార పార్టీకి అంతా సాఫీగా ఉంటుందని చెప్పలేం. కేంద్రంలో రాజ్యసభ, రాష్టాల్లో శాసనమండళ్లు అధికార పార్టీకి వేగ నిరోధకాల్లా అడ్డు పడుతుంటాయి. ఎన్నికల్లో గెలిచామన్న అహంకారంతో ప్రభుత్వాలు ఏకపక్షంగా, మొండిగా వ్యవహరించకుండా రెండో చట్ట సభ పేరుతో రాజ్యసభ, శాసనమండళ్లను ఏర్పాటు చేశారు. కేంద్రంలోని రాజ్యసభ శాశ్వతం. దీనిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదు. ఇక శానసమండళ్ల ఏర్పాటు, రద్దు పూర్తిగా రాష్రాల విచక్షణకు సంబంధించినది. రెండో చట్టసభలో మెజార్టీ అన్నది ప్రత్యక్ష ఎన్నికలపై ఆధారపడి ఉండదు. వీటికి ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అందువల్ల అసెంబ్లీ, లోక్ సభల్లో మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలకు రాజ్యసభ, శాసనమండళ్లల్లో మెజార్టీ ఉండాలని ఏమీలేదు. ఉదాహరణకు ఏపీలో అధికార వైసీపీకి అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉన్నప్పటికీ శాసనమండలిలో తగిన బలం లేక ఇబ్బందులు పడుతుండటం తెలిసిందే. కీలక అంశాలకు సంబంధించిన బిల్లులు మండలి ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడ రాజ్యసభలో దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. అయితే ఎప్పటికప్పుడు రకరకాల వ్యూహాలతో బిల్లులను పెద్దలసభ (రాజ్యసభ)లో ఆమోదించుకుంటోంది.

బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి?

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 233 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. వివిధ రంగాల్లోని 12 మంది నిపుణులను కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. దేశంలోని రాష్టాల అసెంబ్లీ సభ్యులు ప్రతి రెండేళ్లకోసారి మూడోవంతు మంది సభ్యులను ఎన్నుకుంటారు. శాసనమండళ్లకూ ఇదే విధానంలో సభ్యులను ఎన్నుకుంటారు. అందువల్ల అటు శాసనమండలి, ఇటు రాజ్యసభల్లో బలాబలాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు రాజ్యసభలో నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్టీఏ) సర్కారు ఇలాంటి సంకట పరిస్థతినే ఎదుర్కొంటోంది. ఇప్పుడే కాదు. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దలసభలో కమలనాథులకు సంపూర్ణ మెజార్టీ లేదు.

మరో 30 మంది సభ్యుల….

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ కి 93 మంది సభ్యులున్నారు. బిల్లుల ఆమోదానికి 123 మంది సభ్యులు కావాలి. అంటే ఇంకా మరో 30 మంది మద్దతు కావాలి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి బిల్లుల ఆమోదంలో కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ సర్కారు బయటపడింది. వచ్చే ఏడాది జూన్ లో 20, జులైలో 33, ఆగస్టులో 18 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. దీనివల్ల ఆయా పార్టీలు, ముఖ్యంగా బీజేపీ బలంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, సురేశ్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ తో ముగుస్తుంది. వీరిలో సాయిరెడ్డి వైసీపీ కాగా, మిగిలిన ముగ్గరు బీజేపీకి చెందినవారు. బీజేపీకి చెందిన సురేష్ ప్రభు 2016లో టీడీపీ మద్దతుతో ఎన్నిక య్యారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ 2019లో బీజేపీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం వీరు మళ్లీ ఎన్నికయ్యేందుకు తగిన బలం లేదు. దీంతో ఈ మూడు సీట్లూ వైసీపీ ఖాతాలో పడనున్నాయి.

ఖాళీ అయ్యే స్థానాలన్నీ….?

నాలుగో సభ్యుడు వైసీపీ నాయకుడే కాబట్టి మళ్లీ ఆ పార్టీ నాయకుడే ఎన్నికవుతారు. వచ్చే ఏడాది యూపీ నుంచి ఖాళీఅయ్యే 11 సీట్లలో 5 బీజేపీవి. ఈ అయిదుగురు మళ్లీ ఎన్నికవ్వాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గెలిచితీరాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అది అంత తేలికైన విషయం కాదు. ఛత్తీస్ ఘడ్ లో ఒక సీటును కమలం కోల్పోనుంది. ఈ సీటు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనుంది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి నలుగురు బీజేపీ రాజ్యసభ సభ్యులున్నారు. అక్కడ అశోక్ గెహ్లత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందువల్ల ప్రస్తుత ఉన్న నాలుగు సీట్లను కమలం పార్టీ కాపాడుకోవడం కష్టమే. స్థూలంగా చూస్తే 2024 వరకూ పెద్దలసభలో అధికార పార్టీకి మెజార్టీ లభించే అవకాశాలు లేవన్నది సుస్పష్టం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News