తిరుపతి లడ్డూ పవన్ కేనట…?

ఆలూ లేదూ చూలూ లేదు పిల్లవాడికి పెట్టే పేరు కోసం కొట్లాడుకున్నారని వెనకటికి ఒక సామెత. తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక వచ్చిపడింది లగాయితూ ఏపీలో [more]

Update: 2021-03-02 03:30 GMT

ఆలూ లేదూ చూలూ లేదు పిల్లవాడికి పెట్టే పేరు కోసం కొట్లాడుకున్నారని వెనకటికి ఒక సామెత. తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక వచ్చిపడింది లగాయితూ ఏపీలో బీజేపీ జనసేన చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు, నిజానికి ఈ ఉప ఎన్నిక రావడం వెనక ఒక విషాదం ఉంది. కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. కనీసం ఆయన పట్ల సానుభూతికైనా ఆ ఉప ఎన్నిక విషయంలో నోటిఫికేషన్ వచ్చేంతవరకూ మాట్లాడకూడదు అన్న ఆలోచన రెండు పార్టీల్లోనూ లేదని జరిగిన పరిణామాలే నిరూపించాయి. ఎవరి పోయినా సరే కానీ సీటు ఒకటి ఖాళీ అయింది. పోటీకి దిగిపోవాలన్న రాజకీయ ఆరాటమే కనిపించింది.

ఇద్దరూ ఇద్దరే ….

ఇక ఏపీలో బీజేపీ సీన్ చూస్తే నోటా కంటే ఓట్లు తక్కువతో అలరారుతోంది. పవన్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకున్నారు కానీ ఇపుడు ఆ బలం ఎంత అన్నది తెలియదు, ఒకవేళ పెరిగిందా తరిగిందా అన్న లెక్కలు అయితే ఆ పార్టీ వారి వద్ద కూడా లేవు. ఇక తిరుపతి లోక్ సభ సీటు నాడు కాంగ్రెస్ కి, నేడు వైసీపీకి కంచు కోట. పైగా వైసీపీ అధికారంలో ఉంది. పోయింది ఆ పార్టీ ఎంపీ. తిరుపతి లోక్ సభ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలూ వైసీపీకి చెందిన వారే. ఎలా చూసుకున్నా కూడా గెలుపే కాదు మంచి మెజారిటీ కూడా వైసీపీ సొంతం. అయినా సరే మిత్రులు ఇద్దరూ పోటీకి రెడీ, గెలిచేస్తామన్నంత హడావుడి చేశారు.

ఉక్కు దెబ్బతో …

బీజేపీ అయితే తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నికను, గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన కార్పోరేటర్ల సీట్లను చూసుకుని ఏపీలో పెద్దగా సౌండ్ చేస్తోంది. తిరుపతిలో గెలిచి సత్తా చాటుతామంటూ ఆ పార్టీ నాయకులు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు, సన్నాహక సమావేశాల పేరిట తిరుపతిలో హల్ చల్ చేశారు. తీరా తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేనాటికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ మధ్యలో వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంతంతమాత్రంగా ఉన్న కమలం పార్టీని ఏపీలో కమిలిపోయేలా చేసింది. ఏపీలో బీజేపీ ఈ వేడిలో పోటీ చేస్తే నోటావే గెలవడం ఖాయమని కూడా జడిసిపోతున్నారుట. దాంతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసుకున్నా జనసేన కంటే కూడా సీట్లూ,ఓట్లూ తెచ్చుకోవడంలో బీజేపీ బాగా వెనకబడింది. దాంతో మొత్తానికి చూస్తే తిరుపతిలో పరపతి గోవిందా అవుతుందన్న వివేచన కాషాయ నేతలకు వచ్చిందట.

జనసేనకే సీటు….

ఇపుడు జనసేన పోటీ చేసేందుకు బీజేపీ ఓకే అంటుంది అంటున్నారు. బీజేపీ పెద్దలు కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారు. వారికి ఏపీ సీటు పెద్ద లెక్క కాదు, పైగా అక్కడ గెలిచే ఆశలు ఎటూ లేవు. దాంతో ఆ బాధేదో జనసేననే పడమని సీటు వదిలేసుకుంటారని అంటున్నారు. అంటే జనసేన పోటీ చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుంది అన్న మాట. మరి జనసేనకు గెలిచే సీన్ ఉందా అంటే చూడాలి అంటున్నారు. జనసేన ఇక్కడ నుంచి పార్టీ గుర్తు మీద పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం. 2019 ఎన్నికల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీకి ఈ సీటు కేటాయిస్తే ఇరవై వేల దాకా ఓట్లు వచ్చాయట. అందులో జనసేన ఓట్లు ఎన్ని అన్నది తెలియదు. ఇపుడు సొంతంగా పోటీకి దిగుతోంది కాబట్టి ఏ మాత్రం పెరిగినా అది జనసేన ఖాతాలోనే వేసుకోవాలి. బీజేపీ బలం అంటే ఏదీ లేదు కాబట్టి మొత్తం శక్తియుక్తులు జనసేన మాత్రమే పెట్టి పోరాడాలి. మొత్తానికి తిరుపతి సీటు జనసేనకు స్వీటుగా ఉంటుందా, హాట్ గా ఉంటుందా, వేచి చూడాలి.

Tags:    

Similar News