రైల్వే జోన్ పై బీజేపీ కొత్త ఎత్తుగడ..!
ఓ వైపు కేంద్రంలో బీజేపీ పదవీకాలం పూర్తవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు పదవీ కాలం కూడా రోజులకు వచ్చేసింది. అయిదేళ్ల పాలనలో రైల్వే జోన్ గురించి [more]
ఓ వైపు కేంద్రంలో బీజేపీ పదవీకాలం పూర్తవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు పదవీ కాలం కూడా రోజులకు వచ్చేసింది. అయిదేళ్ల పాలనలో రైల్వే జోన్ గురించి [more]
ఓ వైపు కేంద్రంలో బీజేపీ పదవీకాలం పూర్తవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు పదవీ కాలం కూడా రోజులకు వచ్చేసింది. అయిదేళ్ల పాలనలో రైల్వే జోన్ గురించి పెద్దగా పోరాడింది లేదు సాధించింది లేదు. కానీ ఇపుడు మాత్రం ఇంకా కమలనాధులు ఊరిస్తూనే ఉన్నారు. ఓ వైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సైతం జోన్ ప్రస్తావన లేకుండా పోయిందని విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి పెద్ద నాయకులు ఇక్కడకు వచ్చినా కూడా జనం సభలకు పోవడం లేదు. దీంతో మరొకొత్త ఎత్తుగడ వేశారో ఏమో కానీ విశాఖ జోన్ తప్పక వస్తుందని బీజేపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు.
ప్రధాని ప్రకటిస్తారా
విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఈ నెల 16న నిర్వహిస్తున్నారు. తాజాగా విజయనగరంలో జరిగిన అమిత్ షా టూర్ కి జనం రాలేదు. దీంతో ఆయన బహిరంగ సభను కాస్తా రోడ్ షోగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి ఉలిక్కిపడిన బీజేపీ పెద్దలు రేపటి రోజున ప్రధాని సభకు కూడా జనం రాకపోతే పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో వారు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధాని మోడీ విశాఖ సభలో రైల్వే జోన్ ప్రకటన చేస్తారని ఆశలు కల్పిస్తున్నారు. అందువల్ల ఆ చరిత్రాత్మక సభకు నగర వాసులు అంతా హాజరు కావాలని కోరుతున్నారు.
అయ్యే పనేనా
నిజానికి బీజేపీ రైల్వే జోన్ ని అనేక రాజకీయ కారణాలు దృష్టిలో పెట్టుకుని ఇవ్వలేదు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తే ఒడిషాలోని తూర్పు కోస్తా నష్టాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో విశాఖ జోన్ కి ఒడిషా మోకాలడ్డుతోంది. జోన్ కావాలని ఏపీ నాయకులు ఎంతవరకూ ప్రయత్నం చేశారో తెలియదు కానీ వద్దంటూ అక్కడి అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా ఉంటూ గట్టిగానే పోరాడుతున్నారు. రేపటి రోజున కేంద్రంలో మోడీకి మెజారిటీ తగ్గితే నవీన్ పట్నాయక్ మద్దతు కావాలి. అలాగే అక్కడ బీజేపీ కూడా సొంతంగా ఎక్కువ సీట్లు సాధించుకోవాలనుకుంటోంది. అందువల్లనే జోన్ ప్రకటన ఉండదని ప్రచారం సాగుతోంది. రాజకీయం ఇలా ఉండగా ఎన్నడూ లేనిది విశాఖలో రైల్వే జోన్ మీద ప్రధాని ప్రకటన చేస్తారని కమలనాధులు చెప్పడాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. మోడీ సభను సక్సెస్ చేసుకోవడం కోసమే ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ప్రధాని ఏం చెస్తారో.