చిరంజీవికి ఇంకా సత్తా ఉందా ?

చిరంజీవి అద్భుతమైన సినీ నటుడు. స్వశక్తితో సినీ రంగంలోకి వచ్చి నంబర్ వన్ హీరోగా సుదీర్ఘకాలం తన హవాను చాటుకుని మెగా స్టార్ అయ్యాడు. తన వారసులకే [more]

Update: 2019-06-27 04:30 GMT

చిరంజీవి అద్భుతమైన సినీ నటుడు. స్వశక్తితో సినీ రంగంలోకి వచ్చి నంబర్ వన్ హీరోగా సుదీర్ఘకాలం తన హవాను చాటుకుని మెగా స్టార్ అయ్యాడు. తన వారసులకే కాదు. ఎంతో మందికి స్పూర్తిగా ఉంటూ చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. రాంగ్ టైమింగ్ అంటూ ఆయన రాజకీయ పరాజయానికి సాకులు చెప్పినా కూడా గట్టిగా నిలబడి పోరాడే రాజకీయ కార్యక్షేత్రంలో చిరంజీవి లాంటి మెతక మనుషులకు అవకాశాలు తక్కువ అంటారు. చిరంజీవి బాగానే మాట్లాడగలరు కానీ ఎన్టీయార్ లా మాస్ ని కమ్యూనికేట్ చేయగలిగే గొప్ప వక్త కాదు. పైగా ఆయన ఎక్కువగా తిరిగి జనంతో మమేకం కాలేని బలహీనత, అతి మంచితనం వంటిని మైనస్ గా మారాయి. దాంతో ఆయన తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసి తిరిగి బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నారు.

కమలం కెలుకుడు :

చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం గత ఏడాది పూర్తి అయింది. ఆయనకు కాంగ్రెస్ తో ఉన్న బంధం కూడా ముగిసింది. గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో చిరంజీవిని ప్రచారం చేయమని కాంగ్రెస్ కోరినా ఆయన నో చెప్పేశారు. ఇక ఆయన సినిమాలు చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన్ని తమతో ఉండాలని టీడీపీ, వైసీపీ కూడా కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఏ వైపు వెళ్ళలేదు. ఆఖరికి తమ్ముడు పవన్ పెట్టిన పార్టీలోనూ చేరలేదు. తన సినిమాలు తాను అన్నట్లుగా దూరంగా ఉండిపోయారు. అటువంటి చిరంజీవిని ఇపుడు కమలం పార్టీ కెలుకుతోంది. ఆయన్ని రాజకీయాల్లోకి రప్పించి ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలని ఆ పార్టీ ప్లాన్ గా ఉంది.

వర్కౌట్ అవుతుందా :

నిజానికి చిరంజీవి మళ్ళీ రాజకీయాలు చేయడం అంటే ఇపుడు కుదిరేపనేనా అన్నది చూడాలి. ఆయన దాదాపుగా అయిదారేళ్ళ నుంచి రాజకీయాలకు దూరంగా ఉండిపొయారు. పైగా ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపేశారని కాపులు గుర్రుగా ఉన్నారు. మరో వైపు చిరంజీవి పార్టీలోని వారంతా అనేక పార్టీలలో సర్దుకున్నారు. ఇపుడు ఆయన రాజకీయం మొదలుపెడితే పన్నెండేళ్ళ క్రితం నాటి చురుకుతనం చూపగలరా, ఆయనని జనాలు నమ్ముతారా అన్నది ఆలోచించాలి. కాపులనే నమ్ముకుని రాజకీయం చేసిన చిరంజీవి, పవన్ ఎలా దెబ్బతిన్నారో కళ్ల ముందు ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా చిరంజీవిని కాపు చట్రం నుంచి వేరు చేయలేరు. ఆ పరిస్థితుల్లో ఆయన ఇతర వర్గాల మద్దతు కూడగట్టకపోతే మళ్ళీ ఫెయిల్యూర్ ఆర్టిస్ట్ గానే పాలిటిక్స్ లో నిలబడాలి. కానీ కమలం పార్టీ ఆశలు పెట్టుకుంటోంది. మెగాస్టార్ వస్తే ఏదో జరిగిపోతుందని, నిజానికి బీజేపీకి ఏపీలో బేస్ లేదు. హోదా ఇవ్వలేదన్న కోపం కూడా ప్రజలలో అలాగే ఉంది. ఇలా అటు పార్టీ మైనస్, ఇటు చిరంజీవి నెగిటివ్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ల మధ్య రెండూ కలిస్తే అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకమైతే ఇపుడున్న స్థితిలో ఎవరికీ లేదు. చూడాలి మరి.

Tags:    

Similar News