బెజ‌వాడ టీడీపీలో పంతాలు-ప‌ట్టింపులు.. కార‌ణ‌మేంటి ?

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్న నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సైలెంట్ అయిపోయారు. అదే స‌మ‌యంలో ఏకైక ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా మౌనం [more]

Update: 2021-04-29 11:00 GMT

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్న నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సైలెంట్ అయిపోయారు. అదే స‌మ‌యంలో ఏకైక ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా మౌనం పాటిస్తున్నారు. మ‌రి ఎందుకు ? ఇలా జ‌రుగుతోంది? ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో దూకుడుగా వ్యవ‌హ‌రించిన నాయ‌కులు.. ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో వైసీపీ గెలిస్తే.. తాను రాజ‌కీయ సన్యాసం తీసుకుంటాన‌ని బొండా ఉమా వ్యాఖ్యానించారు.

కేశినేని నానితో…..

అదే స‌మ‌యంలో ఎంపీ కేశినేని నానిపై విరుచుకుప‌డ్డారు. ఇక‌, కార్పొరేషన్ ఎన్నిక‌ల కీల‌క స‌మ‌యంలో ఎంపీ కేంద్రంగా సాగిన వివాదంలో బొండా ఉమా తీవ్రంగానే స్పందించారు. ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఈ వివాదంలో వేలు పెట్టక‌పోయినా.. ఎన్నిక‌ల్లో మాత్రం ఆశించిన విధంగా స్పందించ‌లేద‌నే టాక్ ఉంది. స‌రే! ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాయి. కానీ.. నేత‌లు మాత్రం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు కూడా తెర‌మ‌రుగు కావ‌డంతో పార్టీలో నిస్తేజ పూరిత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

అంత ప్రచారం జరుగుతున్నా…?

మ‌రోవైపు.. టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింద‌నే వ్యాఖ్యలు వైసీపీ వ‌ర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ సోష‌ల్ మీడియాలో టీడీపీపై పెద్ద ఎత్తున వ్యతిరేక కామెంట్లు ప్రచారం జ‌రుగుతున్నా యి. అయిన‌ప్పటికీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడుగా పేరుతెచ్చుకున్న బొండా ఉమా కానీ, గ‌ద్దె రామ్మోహ‌న్ కానీ.. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఏ ఒక్కరూ వీటిపై కామెంట్లు చేయ‌డం లేదు. దీంతో పార్టీలో కార్యక‌ర్తల మ‌ధ్య కూడా ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. అయితే.. దీనివెనుక పార్టీ అధినేత‌ చంద్రబాబు కార‌ణ‌మ‌ని బొండా ఉమ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బాబే కారణమా?

ఎంపీ కేశినేనినానితో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏర్పడిన వివాదం.. స‌వాళ్లు ప్రతిస‌వాళ్ల విష‌యాన్ని చంద్రబాబు ప‌ట్టించుకోలేద‌ని.. ఎంపీవైపే ఉన్నార‌ని.. బొండా ఉమ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పైగా.. ఎక్కడా బొండాను స‌ర్దుబాటు చేసే ప్రయ‌త్నం కూడా చేయ‌లేదని, కేవ‌లం ఎంపీ నాని వైపే చంద్రబాబు నిల‌బ‌డ్డార‌ని.. బొండా అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో బొండా ఉమా.. అస‌లు న‌గ‌రంలోనే లేర‌ని అంటున్నారు.

మరి గద్దె….?

ఇంత వ‌ర‌కు బాగానే మ‌రి గ‌ద్దె రామ్మోహ‌న్ మౌనం వెనుక ఏం జ‌రిగింది? ఆయ‌నెందుకు మౌనంగా ఉన్నారు? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు మేయ‌ర్ పీఠాన్ని ఆశించినా.. ద‌క్కలేదు. ఈ కార‌ణంగానే ఆయ‌న మౌనంగా ఉన్నారా? అలా అయితే.. అస‌లు పార్టీనే ఓడిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ఇంకా అవే పంతాలు ఎందుకు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఏదేమైనా.. పంతాలు.. ప‌ట్టింపుల‌తో పార్టీని నాశ‌నం చేస్తున్నార‌నే వాద‌న వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News