బొత్సకు ఈసారి ఎదురులేదా..?

రాజకీయ దిగ్గజం ఒకవైపు… యువ నాయకుడు మరోవైపు తలపడతుండటంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ [more]

Update: 2019-04-01 11:00 GMT

రాజకీయ దిగ్గజం ఒకవైపు… యువ నాయకుడు మరోవైపు తలపడతుండటంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ ఈసారి యువనేతతో ఎన్నికల్లో తలపడుతున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో మృణాళిని కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై 20,842 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.చంద్రశేఖర్ 42 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. త్రిముఖ పోటీ కావడంతో తెలుగుదేశం పార్టీ సులువుగా విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఏపీలో రెండో స్థానంలో నిలిచిన ఏకైక అభ్యర్థి బొత్స సత్యనారాయణ.

మరోసారి బరిలో బొత్స ….

ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా, రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు వైసీపీ జిల్లా వ్యవహారాల్లో హవా నడిపిస్తున్నారు. ఈసారి మళ్లీ చీపురుపల్లి నుంచి బరిలో ఉన్నారు. బొత్స సత్యనారాయణకు ఇక్కడ బాగా బలం ఉంది. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనే పేరుంది. ఇక, పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన గెలిచి, వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఎక్కువగా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసుకునే ఆయన ప్రజలకు అంతగా అందుబాటులో ఉండరనే పేరుంది. ఇది ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాగార్జున

తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న కిమిడి నాగార్జున ఎన్నికలకు కొత్త. అయితే, ఆయన గత కొంతకాలంగా పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నారు. ఆయన తల్లి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో వ్యవహారాలు చూసుకున్నారు. ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చిన్నాన్న కళావెంకటరావు మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో రాజకీయంగా పెద్ద కుటుంబం నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. విదేశాల్లో చదువుకొని వచ్చిన ఆయన ప్రజల్లోకి బాగానే వెళ్లగలుగుతున్నారు. యువత ఆయన వైపు మొగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. తన తల్లి మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే, నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడాన్ని పలువురు టీడీపీ స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ వారు అసంతృప్తితో ఉన్నారు. ఇది నాగార్జునకు నష్టం చేసే అవకాశం ఉంది. మొత్తానికి బొత్స సత్యానారాయణ స్వంత బలానికి ఈసారి వైసీపీ బలం తోడవడంతో ఇప్పటికైతే ఆయన వైపు మొగ్గు కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News