లంక బ్రదర్స్ లైన్ లోకి వచ్చారా?

చుట్టూ సముద్ర జలాలతో అలరారే శ్రీలంకలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయింది. అయిదేళ్ల అనంతరం అన్నదమ్ముల పాలన ప్రారంభమయింది. రాజపక్స కుటుంబీకుల చేతుల్లోకి శ్రీలంక పాలన వెళ్లింది. నవంబరు [more]

Update: 2019-12-12 16:30 GMT

చుట్టూ సముద్ర జలాలతో అలరారే శ్రీలంకలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయింది. అయిదేళ్ల అనంతరం అన్నదమ్ముల పాలన ప్రారంభమయింది. రాజపక్స కుటుంబీకుల చేతుల్లోకి శ్రీలంక పాలన వెళ్లింది. నవంబరు 16న జరనిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స విజయం సాధించారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే తన సోదరుడు మహింద రాజపక్సను ప్రధానిగా నియమించారు. మహింద , గోటబాయ రాజపక్సలు లంక రాజకీయాల్లో ఒకే మాట పై నిలబడే నాయకులు. మహింద రాజపక్స్ 2009 నుంచి 2015 వరకూ రెండు దఫాలు దేశాధ్యక్ష్య పదవిని చేపట్టిన ధీటైన నాయకుడు. ఆయన పదవీకాలంలో తమ్ముడు గోటబాయ రాజపక్స రక్షణమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో అన్నకు కుడిభుజంగా నిలిచారు. పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే రాజపక్స తొలి విదేశీ పర్యటనకు భారత్ ను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. లంక రాజకీయాల్లో భారత్ కు వ్యతిరేకులుగా రాజపక్స సోదరులు ముద్రపడ్డారు. అయినప్పటికీ గత నెల 29వ తేదీన గోటబాయ భారత్ కు వచ్చి సందర్శించి వెళ్లారు.

ఆసక్తికరంగా రాజకీయ ప్రస్థానం….

ఏడుపదులు పూర్తి చేసుకున్న గోటబాయ రాజపక్స ప్రస్థానం ఆసక్తికరం. కరడుగట్టిన సింహళవాదిగా, భారత్ వ్యతిరేకిగా ఎల్టీటీఈ వ్యతిరేకిగా ఆయన సుపరిచితుడు. 1949 జూన్ 20న ఉన్నత కుటుంబంలో జన్మించిన గోటబాయ రాజపక్సే ఆ కుటుంబంలోని 9 మంది సంతానంలోని అయిదో వాడు. తండ్రి డీఏ రాజపక్స శ్రీలంక ఫ్రీడం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. కొలొంబోలోని ఆనంద్ కాలేజీలో ప్రైమరీ, సెకండరీ విద్యను అభ్యసించారు. 1992లో కొలొంబో యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. ఆర్మీలో క్యాడెట్ ఆఫీసర్ గా చేశారు. సర్ జాన్ కొటేల్ వాలా డిఫెన్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్ గా రిటైైరయ్యే వరకూ పనిచేశారు. ముగ్గురు అద్యక్షుల నుంచి సాహస అవార్డులు పొందారు. ఐటీ రంగంలో నిష్ణాతులైన రాజపక్స 1998లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఐటీ ఆచార్యుడిగా పనిచేశారు. శ్రీలంక అధ్యక్ష్య ఎన్నికల్లో 2005లో పోటీకి దిగిన తన అన్న మహింద రాజపక్సకు సాయపడేందుకు లంకకు తిరిగి వచ్చారు. అప్పట్లో ఆయన అటు అమెరికా, ఇటు లంక పౌరసత్వం కలిగి ఉన్నారు. ద్వంద పౌరసత్వంపై విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. తన అన్న మంత్రి వర్గంలో 200లో రక్షణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

తమిళ తీవ్రవాదులను….

2009లో తమిళ తీవ్రవాదులను తుదముట్టించడంలో గోటబాయ రాజపక్సే పాత్ర కీలకం. అప్పట్లో ఆయనను వార్ హీరోగా పిలిచేవారు. నిన్నటి ఎన్నికల్లో ఆయనకు సింహళీలయులు బ్రహ్మరధం పట్టారు. తమిళులు, ముస్లింలు మాత్రం వ్యతిరేకంగా నిలిచారు. అందువల్లే సంప్రదాయానికి విరుద్ధంగా రాజధాని కొలొంబోలో కాకుండా సింహళీయుల ప్రాబల్యం గల అనురాధపురలోని ప్రసిద్ధ పురాతన బౌద్ధ ఆలయంలో శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. సింహళీయులకు తొలి ప్రాధాన్యం ఇస్తానని, తనకు ఎన్నికల్లో మైనారిటీలు మద్దతు ఇవ్వకపోయినా అన్ని వర్గాలు తనకు సమానమేనన్న ఆయన వ్యాఖ్యలు ఆచరణలో ఎంత వరకూ వాస్తవం అవుతాయో చూడాలి.

భారత్ వ్యతిరేకులుగా…..

లంక రాజకీయాల్లో రాజపక్స కుటుంబీకులు ఆది నుంచి చైనా అనుకూలురుగా, భారత వ్యతిరేకులుగా పేరుంది. అయినప్పటికీ గోటబాయ తన తొలి విదేశీ పర్యటనకు భారత్ ను ఎంచుకోవడం వ్యూహాత్మకమనే చెప్పాలి. భారత్ మా బంధువు..చైనా మా మిత్ర దేశం అన్న ఆయన వ్యాఖ్యలు సమతుల్యంగానే కనపడుతున్నప్పటికీ అంతరంగంలో బీజింగ్ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. తమిళ టైగర్ల మూలంగా లంకతో భారత్ సంబంధాలు కొంతవరకూ దెబ్బతిన్న మాట వాస్తవమే. తమిళ టైగర్లను సమర్థించలేక, లంక పాలకులను ఒప్పించలేక భారత్ అనేక సార్లు ఇబ్బందులను ఎదుర్కొంది. టైగర్ల కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు ఎంత సాయం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే అదనుగా క్రమంగా లంక పాలకులు చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న చైనా శ్రీలంకకు చేరువైంది. ద్వీప దేశంలో భారీ పెట్టుబడులు పెట్టింది. దేశానికి ఆర్థికంగా అండగా నిలిచింది. మొత్తానికి లంకపై భారత్ ప్రభావాన్ని పూర్తిగా చెరిపేయ గలిగింది. 6,950 కోట్ల డాలర్లు గా లెక్క తేలుతున్న రుణాలు జీడీపీలో 78 శాతానికి చేరడం ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది. ఇందులో సగం విదేశీ అప్పులే కావడం గమనార్హం. చైనా అప్పులు తీర్చలేక 2017లో హంబన్ తోట ఓడరేవును ఆ దేశానికి అప్పగించింది. శ్రీలంక దీవుల్లో చైనా యుద్ధనౌకలు సంచరిస్తున్నాయి. కొలొంబో సిటీ ప్రాజెక్టు పేరుతో మరో భారీ ప్రాజెక్టు చైనా రుణంతో నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో చైనా తో స్నేహం తనకు చిక్కులు కలిగిస్తుందని లంక కొంత ఆలస్యంగానైనా గ్రహించింది. అందుకే సమీప పొరుగు దేశమైన భారత్ తో సత్సంబంధాలుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఎంత కాదనుకున్ాన పొరుగున ఉన్న పెద్ద దేశం భారత్ ను విస్మరించే పరిస్థితి లేదు. ఫలితమే రాజపక్స ఇటీవల భారత్ పర్యటన.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News