డిట్టో మునుగోడు స్టైల్..

ఉప ఎన్నికకు పోవాలి అనుకున్న రాజ్‌గోపాల్ రెడ్డి.. అంతకుముందు నుంచే తమ అనుచరగణంతో సంప్రదింపులు

Update: 2023-08-06 04:54 GMT

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికకు తెరలేపిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు దశాబ్దాల కాలంగా విస్మరించబడ్డ ఓ చిన్న నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా సంచలనాల కేంద్రబిందువైంది. మునుగోడు పేరు లేకుండా వార్తలు సాగలేదు. బిజేపి, బీఆర్ఎస్‌ల నడుమ జరిగిన పోటీలో ఎన్నో తంత్రాలూ, కుతంత్రాలూ వెలుగుచూశాయి. చిన్న నియోజకవర్గంలో స్ట్రేటజీలు ఏం పనిచేస్తాయి.. చివరికి ఓటుకు నోటే దిక్కు అని అన్ని పార్టీలూ భావించాయి. బిజేపి, బీఆర్ఎస్‌ల నడుమ ఇరుక్కున్న కాంగ్రెస్‌‌.. ఎంతో ఒత్తిడిని ఎదురుకుంది. ప్రతిరోజూ ట్రెండింగ్‌లో ఉండేందుకు శతవిధాలా పోరాడింది. ఉప ఎన్నిక ప్రకటించిన తొలినాళ్ళలో ముముగోడులో మూడుపార్టీల నడుమ త్రికోణ పోటీ నెలకొన్నట్టు కనిపించింది‌. అ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమేణా బలహీనపడింది. అప్పటివరకూ ఓపికగా ఎదురుచూసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర సీఎం అలాగే మునుగోడు ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ రంగంలోకి దిగారు. Vis

మునుగోడు ఉప ఎన్నిక.. నియోజకవర్గంలో సమస్యల వల్లనో.. లేక ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్‌కి, పార్టీలోని ఇతర నేతలకి చెడిన సఖ్యతవల్ల వచ్చిన ఉప ఎన్నిక అనుకోవాలి. మునుగోడులో తను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినందుకు అధికార పార్టీ అక్కడ అభివృద్ధి పనులు చేయడం లేదు, తనను చేయనీయడం లేదని రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌తో విభేదాలు ఉన్న బిజేపి పార్టీ రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాని ప్రోత్సహించి అతనిని పార్టీలోకి ఆహ్వానించి కాషాయ బావుటాతో బరిలోకి దించింది.
ఉప ఎన్నికకు పోవాలి అనుకున్న రాజ్‌గోపాల్ రెడ్డి.. అంతకుముందు నుంచే తమ అనుచరగణంతో సంప్రదింపులు చేస్తూ.. మొత్తం కార్యకర్తలని ఒప్పించి సమాయత్తం చేశారు. దాంతో ఎన్నికల సైరన్ మ్రోగిననాటి నుంచే బిజేపి స్లోగన్లు హోరందుకున్నాయి. రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి పోటీ కాంగ్రెస్ బిజేపి నడుమ ఉంటుంది అనుకున్నారు అందరూ. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో కోమటిరెడ్డి సోదరుల నమ్మిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు అందరూ బిజేపి జెండా పట్టగానే‌‌‌.. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అతికొద్ది మంది కార్యకర్తలు మిగిలిపోయారు. ఆ తర్వాతి నుంచి పోటీ బీఆర్ఎస్ బిజేపిల మధ్యనే అనే పరిస్థితులు నెలకొన్నాయి.
మునుగోడు బీఆర్‌ఎస్ పార్టీ సీట్ కాదు‌.. ఓడినా పార్టీకి నష్టం లేదు. కానీ ఎప్పుడైతే కేంద్రప్రభుత్వం మునుగోడులో బిజేపిని గెలిపించి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను వెనకకు నెట్టాలనే ఆలోచన చేసిందో.. ఆ క్షణం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ తీస్కున్నారు. అప్పటివరకూ రాజ్‌గోపాల్ వెర్సస్ బీఆర్ఎస్ గా ఉన్న వేడి.. కేసీఅర్ వెర్సస్ బిజేపి గా మార్పు చెందింది. మునుగోడు ఇటు కేసీఆర్‌కి అటు బిజేపి పెద్దలకి రెప్యుటేషన్ గేమ్‌లా పరిణమించింది.
మునుగోడులో రాజ్‌గోపాల్ రెడ్డి మీద గెలవడం అంత ఈజీ పని కాదు‌. అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ఆదరణని చెరపడం కూడా జరగదు. మరి ఎన్నికలో గెలవడం ఎలా అని ఆలోచించి కొన్ని స్ట్రేటజీలను రూపొందించారు. అవి ఏంటంటే‌‌.. రాజ్‌గోపాల్ రెడ్డి మీద గెలవాలంటే కేవలం ప్యాసీవ్ ప్రోపగాండా చేయాలి. అలా చేయగలిగితే మెల్లిగా ఓట్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది అనుకున్నారు. పెద్ద మెజారిటీతో గెలిచే ఛాన్స్ కనిపించలేదు కాబట్టి చిన్న ఎడ్జ్‌తో అయినా బయటపడాలి అనుకున్నారు గులాబీ నేతలు. మునుగోడులో ప్రతిరోజు వెలువడిన ట్రెండ్స్‌లో బిఆర్ఎస్ బిజేపిల నడుమ కేవలం ఒకటి రెండు శాతం మార్పు కనిపించేది. అది కూడా బిజేపికే ప్లస్ గా ఉండేది. చిన్న నియోజకవర్గంలో గెలవడానికి పెద్ద పెద్ద వ్యూహాలు అవసరం లేదనుకున్న గులాబీ బాస్ చిన్నచిన్న వ్యూహాలను అమలు పరిచారు. ఒక్కో వ్యూహంతో రెండు మూడు వేల ఓట్లు కలిసి వచ్చినా చాలనుకున్నారు‌. అవే మునుగోడులో గులాబీ పార్టీని పదివేల ఓట్ల మెజారిటీతో గెలిపించాయి. అవేంటో చూడండి..
సరిగ్గా మునుగోడు ఉప ఎన్నికల ముందే టీయార్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామాంతరం చేశారు. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. దాంతో ఆ పార్టీకి మునుగోడులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి‌. దానికోసం ఎంతటి వ్యూహరచనకైనా వెనకాడలేదు ఆ పార్టీ ఛీఫ్‌.
ఎన్నికలు అనౌన్స్ అవగానే బీఆర్ఎస్ మొదట పేర్కొన్న వివాదం‌.. రాజ్‌గోపాల్ రెడ్డికి 12 వేల కోట్ల రూపాయిల కాంట్రాక్ట్ ఇచ్చింది అని‌. ఆ అంశాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాయి‌. ఎన్నికలకు వారం రోజులు ఉంది అన్నంతవరకూ ఇదే అంశాన్ని ఓటర్ల మెదళ్ళలో బలంగా చొప్పించారు. అయినా ట్రెండ్స్‌లో రెండుమూడు శాతం ఎడ్జ్ అలానే కొనసాగింది. ఇక వారమే మిగిలి ఉంది అనగా.. ఓరోజు రాజ్‌గోపాల్ రెడ్డి ఓడిపోతున్నాడు. అది అతనికి తెలిసిపోయింది‌‌.‌. అందుకే అతను ఫలితాలు వెలువడే రోజే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాడు అని ఓ ఫ్లయిట్ టికెట్ చక్కర్లు కొట్టింది. ఆ మర్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మండలాధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ నేతలు చేరే ముందు రోజు ఆస్ట్రేలియా టికెట్ ని విడుదల చేసి రాజ్‌గోపాల్ రెడ్డి వర్గాన్ని మోరల్ గా దెబ్బతీశారు. అప్పటివరకూ కేవలం తన అనుచర గణం పై ఆధార పడ్డ రాజ్‌గోపాల్ రెడ్డి మండలాధ్యక్షులు మారిన క్షణమే ఉలిక్కిపడి క్షణకాలంలో ప్రెస్మీట్ పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత వర్గం నేతలను మండలాల్లో రీప్లేస్ చేసి నిట్టూర్చారు. ఎన్నికలకు మూడు రోజులు ఉంది అనగా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మునుగోడు మహిళలకు బంగారం కానుకలు ఇస్తున్నారని విడియోలు వైరల్ అయ్యాయి. ఒకరిద్దరు ఆడవాళ్ళ చేతిలో బంగారం చూపి.. మరికొందరు ఆడవాళ్ళు తమకు బంగారం ఇవ్వకపోతే ఊరుకోమంటూ రాజ్‌గోపాల్ రెడ్డిని వారించేలా విడియోలు వదిలారు. ఆ పరిణామం చాలా మంది ఆడవాళ్ళ ఓట్లను మలిచిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ నెలకొంది. బిజేపి పార్టీకి అమ్ముడుపోతున్నారంటూ నలుగురు బిఆర్ఎస్ నేతలను ఓ ఫామ్‌హౌస్‌లో చూపుతూ బ్రేకింగ్ న్యూస్‌లు వెలువడ్డాయి‌. అప్పటికే మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి మధ్యంతర ప్రభుత్వాలను నెలకొల్పిన చరిత్ర ఉన్న బిజేపి తీరు పై మునుగోడు ప్రజలు విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఫామ్‌హౌస్ ఎపిసోడ్ సంచలనంగా మారింది‌‌. ఆ ఇష్యూ పై ఇప్పటికీ రాష్ట్రప్రభుత్వం, SIT ల పై ఒత్తిడి కొనసాగుతోంది‌. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌తో చేయించిన సర్వేలో.. వాళ్ళలో ఒక నేత ఓడిపోతాడని తేలింది. అతనికి టికెట్ ఇవ్వాలా వద్ద అని జరిగిన డిస్కషన్ టైమ్‌లో అతను.‌‌. ఫామ్ హౌస్ విషయంలో అప్రూవర్‌గా మారతానని బెదిరించాడని కొందరు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది‌. ప్రస్తుతానికి ఫామ్‌హౌస్ బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న పీడ కలే అనుకోవాలి.
ఫామ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత ఇక మిగిలింది ఓట్ల ఎరే. ఆ విషయంలో అధికార మిగతా రెండు పార్టీలూ సాహసించలేనంతగా కుప్పలుతెప్పలుగా డబ్బు, మద్యం ఝుళిపించింది. రాజ్‌గోపాల్ రెడ్డి అతిగా నమ్మిన యువతను బీఆర్ఎస్ చివరి నిమిషంలో హైజాక్ చేయగలిగింది. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఒక్కసారిగా బయటికి వచ్చిన యువత.. పూర్తి ట్రెండ్స్‌నే మార్చేశారు. చౌటుప్పల్ ప్రాంతీయ ఓటర్లను బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకోవడంలో సక్సస్ అయింది. అందుకుగానూ ఓటుకు ఫుల్‌బాటిల్ లిక్కర్, పదివేల నగదు ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.. కానీ ఆ పార్టీలకు కూడా తలరాతను పరీక్షించుకోక తప్పలేదు.. ఓటుకు కాసులు దులిపించుకోవడం తప్పలేదు.
ఇంత జరిగాకా అంతిమంగా పరిశీలించి చూస్తే చిన్న చిన్న ఎత్తుగడలతో మునుగోడును సొంతం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ! 
రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే.. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం అదే తరహా స్ట్రేటజీ అమలులో ఉంది అనిపిస్తోంది‌. నెలరోజుల నుంచి సీఎం కేసీఆర్.. అడగకపోయినా.. వరాల జల్లులు కురిపిస్తున్నారు. తమ ఇంటెలిజెన్స్ నివేదించిన రిపోర్ట్‌లో బిఆర్ఎస్ 50 స్థానాలకే పరిమితమైందని తెలుసుకున్నారని, ఎలాగైనా ఓట్ల శాతం, సీట్ల సంఖ్య పెంచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది‌. అందులో భాగంగా ముందు ఐసొలేటెడ్ వర్గాలు, రిజర్వ్‌డ్ కమ్యునటీలను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయేలా ప్రకటనలు ఉండబోతున్నాయని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు‌. కాంగ్రెస్, బిజేపిల వేవ్‌ని తట్టుకోవాలంటే పెద్ద హామీలు, పాత హామీల ముచ్చట్లు కాకుండా చిన్న చిన్న యుక్తులతో ఓట్లను రాబట్టే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే వికలాంగుల పెన్షన్ పెంపు, బీసీ లకు లక్ష రూపాయిల బీసీ బందు, ప్రభుత్వంలోకి టీఎస్ఆర్టీసి విలీనం, 19 వేల కోట్ల రైతు రుణమాఫీ, 2160 వైన్‌షాప్‌కు టెండర్ పిలుపు.‌. వగైరా వగైరాలతో.. చిన్నచిన్న కమ్యునిటీలను తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓడిపోయే ప్రాంతాలలో ఆబ్లిగేషన్ గా ఉన్న ఎమ్మెల్యేలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు‌. ఒప్పుకోని పక్షంలో, పార్టీలు మారుతున్నారన్న అనుమానం కలిగిన నేతల పై ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ కోర్ట్‌లో వివాదాలు రేపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది జస్ట్ బిగినింగ్.. ముందు ముందు ఇంకా చాలానే కనిపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు‌.


Tags:    

Similar News