మాయావతి టార్గెట్ బీజేపీ కాదట

మాయావతి ఉన్నట్లుండి ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రియాంక గాంధీ తమకు ఇబ్బంది కలగిస్తారని భయపడుతున్నారా? తమ ఓటు బ్యాంకును ప్రియాంక చీల్చే అవకాశముందని మాయావతి [more]

Update: 2020-01-06 16:30 GMT

మాయావతి ఉన్నట్లుండి ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రియాంక గాంధీ తమకు ఇబ్బంది కలగిస్తారని భయపడుతున్నారా? తమ ఓటు బ్యాంకును ప్రియాంక చీల్చే అవకాశముందని మాయావతి ముందుగానే అంచనా వేసుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఈ మధ్య కాలంలో ఓటములకే పరిమితమయింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఎస్పీ ప్రతిభ కనపర్చ లేక పోయింది.

ఒంటరిగా పోటీ చేయాలని….

దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మాయావతి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించు కున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసి తప్పు చేశామని అర్థమయిన మాయావతి ఈసారి అందుకు సుముఖంగా లేరు. పొత్తులతో క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకును కూడా కోల్పోవాల్సి వస్తుందని మాయావతి అభిప్రాయపడ్డారు. అందుకే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు.

కాంగ్రెస్ తోనే ముప్పు….

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. కేవలం రెండు స్థానాలనే కాంగ్రెస్ కు కేటాయిస్తామని చెప్పడంతో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లోనే మకాం వేశారు. తరచూ యూపీలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో భరోసాను నింపుతున్నారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ప్రియాంక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ యూపీని వదిలేటట్లు కన్పించడం లేదు.

ప్రియాంకతో ప్రమాదం…..

అందుకే ప్రియాంకతో ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన మాయావతి ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. రాజస్థాన్ కోటాలో చిన్నారులు వంద మంది చనిపోతే అక్కడకు వెళ్లని ప్రియాంక గాంధీ యూపీలో మాత్రం సీఏఏ అల్లర్లలో బాధిత కుటుంబాలను పరామర్శించడంలో అర్థం లేదని మాయావతి ఆరోపించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే చిన్నారులు మరణించారని మాయావతి విమర్శించారు. మొత్తం మీద ఫ్యూచర్ లో ప్రియాంక వల్ల ప్రమాదం ఉందని గ్రహించిన మాయావతి ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News