రాజేంద్రుడు మునుప‌టిలా లేరే.. ఏం జ‌రుగుతోంది ?

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీల‌క‌మైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ, ఎక్కడా ఆయ‌న పేరు ఇటీవ‌ల కాలంలో వినిపించ‌డం లేదు. [more]

Update: 2021-05-17 13:30 GMT

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీల‌క‌మైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ, ఎక్కడా ఆయ‌న పేరు ఇటీవ‌ల కాలంలో వినిపించ‌డం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు.. ఇప్పటికి చాలా తేడా ఉందంటున్నారు ప‌రిశీల‌కులు. విపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీలోను, బయట టీడీపీపై ఒంటికాలితో లేచే బుగ్గన ఇప్పుడు ఆ స్థాయిలో విమర్శలు చేయడం లేదని చర్చ జరుగుతోంది. ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కల చిట్టాల‌తో స‌హా ప్రభుత్వాన్ని ప‌దే ప‌దే విరుచుకు ప‌డేవారు. చంద్రబాబు సైతం బుగ్గన మాట్లాడుతుంటే ఒక్కోసారి స‌మాధానం చెప్పలేని ప‌రిస్థితి ఉండేది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…

అసెంబ్లీలో పిట్ట కథలు చెబుతూ టీడీపీని ఇరుకున పెట్టడంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారట. తొలి యేడాది పాటు దూకుడుగానే ఉన్న ఆయ‌న ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేవారు. సీఎం జ‌గ‌న్ త‌ర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్‌మీట్ వ‌స్తుందంటే రాష్ట్ర ప్రజ‌ల్లో ఎక్కడాలేని క్యూరియాసిటీ ఉండేది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్‌మీట్లో లెక్కలు చెపుతూ మ‌రీ టీడీపీ, విప‌క్షాల‌ను ఫుట్‌బాల్ ఆడేసేవారు. అలాంటిది ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ఇంత‌లా ఉన్నా బుగ్గన వాయిస్ విన‌ప‌డ‌డం లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బుగ్గ‌న ఎక్కడున్నారో ? కూడా అర్థం కాని ప‌రిస్థితి.

ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రమే…

పోలవరం ప్రాజెక్టు లేదా కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలోనే ఢిల్లీ వెళ్లినపుడు మాత్రమే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, టీడీపీపై విమర్శల విషయాల్లో క్లారిటీ ఇచ్చేందుకు మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. సొంత జిల్లా కర్నూలు పర్యటనలోను అధికారులతో సమీక్షలు చేసినా ఇతర మంత్రులు బ్రీఫ్ చేసిన సందర్భాలే ఎక్కువ. జిల్లాలో పార్టీకి సంబంధించి కూడా అంతంత మాత్రమే జోక్యం చేసుకుంటున్నా రు. ఏదైనా అధికారులతో మాట్లాడటం.. వారి ద్వారానే పనులు చక్కబెడుతున్నారు.

అదే కారణమా?

ఇక జిల్లా రాజ‌కీయాల్లోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాధాన్యత త‌గ్గిందా ? వ్యూహాత్మకంగా త‌గ్గించారా ? అన్నది పార్టీ వ‌ర్గాల‌కే అంతు ప‌ట్టడం లేదు. ఇక‌, సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా ఆయ‌న దూరంగానే ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన‌ప్పటి ఊపు ఆయ‌న‌లో లేదు. ఎందుకో సైలెంటయ్యారు. మీడియాకు ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇతర మంత్రులతో పోలిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సెక్రటేరియట్‌కు వచ్చే సందర్భాలు కూడా తక్కువే. తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమీక్షలు ఎక్కువగా ఇంటి వద్దనే చేస్తున్నారని కూడా వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఆ కారణంగా అధికారులు కూడా ఎక్కువగా అమాత్యులవారి ఇంటికే వెళ్తున్నారట. సీఎంస్థాయిలో ఏదైనా సమావేశాలు ఉంటేనే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కనిపిస్తున్నారు బుగ్గన. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? విచ్చల‌విడిగా అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌నే ఆవేద‌నా? లేక‌.. మరేదైనానా? అనేది ఇప్పుడు వైసీపీలో ఆస‌క్తిగా మారింది. చూడాలి మ‌రి ఎప్పటికి పుంజుకుంటారో..!

Tags:    

Similar News