బుగ్గన స్టేటస్ రిపోర్ట్ ఇదే….!!
ఈ ఐదేళ్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. [more]
ఈ ఐదేళ్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. [more]
ఈ ఐదేళ్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆయన అసెంబ్లీలో తమ పార్టీ వాయిస్ ను బలంగా వినింపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను లెక్కలతో సహా అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో బుగ్గన సామర్దత గుర్తించిన జగన్ సైతం ఆయనకు పీఏసీ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టి బుగ్గనకు జగన్ అవకాశం ఇచ్చారు. దీంతో ఈ ఐదేళ్లు రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. కచ్చితంగా ఆయనకు ఓడించి ఆయన దూకుడుకు కల్లెం వేయాలని భావించింది. ఇదే సమయంలో బుగ్గన కూడా మరో గెలవాలనే పట్టుదలతో ప్రచారంలో దూసుకుపోయారు. దీంతో డోన్ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
కేఈ కుటుంబానికి కంచుకోట అయినా…
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన బుగ్గన గత ఎన్నికల్లో డోన్ లో 11,152 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే.ఈ.ప్రతాప్ పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలో వైసీపీ హవా వీచింది. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింట వైసీపీ గెలిచింది. దీంతో బుగ్గన వ్యక్తిగత బలం కంటే కూడా పార్టీ బలం బాగా కలిసి రావడంతో ఆయన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం కేఈ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఇక్కడి నుంచి 1967 నుంచి రెండు ఎన్నికలు మినహా ప్రతీ ఎన్నికలోనూ కేఈ కుటుంబం పోటీ చేసింది. కేఈ కృష్ణమూర్తి ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుసార్లు విజయం సాధించారు. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ రెండుసార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో కేఈ కుటుంబానికి గట్టి పట్టున్నా గత ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే బరిలో ఉన్న కేఈ ప్రతాప్ మాత్రం ఓడిపోయారు. దీంతో ఈసారి ఈ నియోజకవర్గాన్ని కేఈ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
మళ్లీ బుగ్గనదే విజయమా..?
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచినా ప్రతిపక్ష పార్టీకే పరిమితం కావడంతో ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారు. అయితే, ఆయనకు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఎటువంటి ఆరోపణలు లేవు. గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఆయనకు కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటం కూడా ప్లస్ అయ్యింది. బుగ్గన కూడా గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నియోజకవర్గంలో బలం పుంజుకున్నారు. అయితే, నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. తెలుగుదేశం అభ్యర్థి కేఈ ప్రతాప్ పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన దురుసుగా వ్యవహరిస్తారనే పేరుండటం మైనస్ గా మారింది. ఆర్థికంగా ఇద్దరూ బలమైన వారే కావడంతో డబ్బు ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీలోకి కోట్ల కుటుంబం చేరిక ఆ పార్టీకి కలిసి వస్తుందని భావించినా ఆ పరిస్థితి పెద్దగా కనిపించలేదు. కోట్ల కుటుంబానికి ఈ నియోజకవర్గంలో అనుచరవర్గం ఉంది. అయితే, ఇన్నేళ్లుగా కేఈ వర్గంతో వారికి సఖ్యత లేదు. ఇప్పుడు ఇద్దరు నేతలు కలిసినా కిందిస్థాయిలో క్యాడర్ మాత్రం కలిసిపోలేదు. ఇది వైసీపీకి ప్లస్ అయ్యింది. మొత్తంగా గత ఎన్నికల మాదిరిగానే ఇక్కడ హోరాహోరీ పోరు జరిగినా వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని, స్వల్ప మెజారిటీతోనైనా బుగ్గన బయటపడతారనే అంచనాలు ఉన్నాయి.