సమయం కాదు శిష్యా…?

చిత్తూరు వైసీపీ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే….సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత విధేయులు, బంధువులు, సన్నిహితులు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా [more]

Update: 2019-10-27 14:30 GMT

చిత్తూరు వైసీపీ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే….సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత విధేయులు, బంధువులు, సన్నిహితులు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి ఈ పేర్లు లేకుండా చిత్తూరు వైసీపీ రాజకీయాలను చూడలేం. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇక ఆర్కే రోజాది డిఫరెంట్ కాజ్. రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై చూపించిన దూకుడుకు జగన్ ఆమెకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు.

కింది స్థాయి నుంచి….

ఇక భూమన కరుణాకరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరిద్దరూ కిందస్థాయి నుంచి ఎదిగిన వారు. ఇద్దరూ గురు శిష్యులు. తిరుపతి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి రాడికల్ ఉద్యమాల నుంచి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత చేరువయ్యారు. టీటీడీ ఛైర్మన్ పదవి వైఎస్ ఇచ్చారు. అదే సమయంలో తిరుపతిలో విద్యార్థి సంఘం నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. చెవిరెడ్డి చురుగ్గా ఉండటం చూసిన భూమన కరుణాకరెడ్డి ఆయనను వైఎస్ రాజశేఖర్ రెడ్డిక పరిచయం చేశారు. అంతే చెవిరెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. తొలుత తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. తర్వాత తుడా ఛైర్మన్ అయ్యారు.

చెవిరెడ్డి చురుగ్గా….

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరింత చేరువయ్యారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గల్లా అరుణకుమారిని ఓడించారు. ఐదేళ్ల పాటు అధికార పక్షానికి దడ పుట్టించారు. 2019 ఎన్నికల్లోనూ తిరిగి రెండోసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకటికి మూడు పదవులు పొందారు. తుడా ఛైర్మన్ గా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా, ప్రభుత్వ విప్ గా పదవులు దక్కించుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే తన గురువు భూమన కరుణాకర్ రెడ్డి కంటే ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకంటే వేగంగా ఎదగగలిగారు.

భూమనలో నిర్వేదం….

భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకుంటే జగన్ కు బాగా చేరువ. బంధుత్వంకూడా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భూమనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ జగన్ భూమనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. టీటీడీ సభ్యుడిగా మాత్రం ఇచ్చారు. తనకు ప్రాధాన్యత లభించకపోవడంపై భూమన కరుణాకర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ఆయన ప్రకటించడం వెనక నిర్వేదంతోనేనని అంటున్నారు. అయితే శిష్యుడు పదవులతో చెలరేగిపోతుంటే, గురువు భూమన కరుణాకర్ రెడ్డి ఇది సమయం కాదని సర్ది చెప్పుకుంటున్నారట. భూమనకు పదవి రాకుండా ఎవరో అడ్డుతగులుతున్నారన్న అనుమానం మాత్రం ఆయన అనుచరుల్లో ఉంది.

Tags:    

Similar News