యడ్డీకి ఎర్త్ పెడుతున్నారా?

అప్ప ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది. యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఒకేసారి పదహారు స్థానాలను భర్తీ చేయాలనుకున్నారు. ఇందుకు ముహూర్తమే ఖరారు కాలేదు. [more]

Update: 2020-01-14 17:30 GMT

అప్ప ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది. యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఒకేసారి పదహారు స్థానాలను భర్తీ చేయాలనుకున్నారు. ఇందుకు ముహూర్తమే ఖరారు కాలేదు. కేంద్ర నాయకత్వం అపాయింట్ మెంట్ కూడా లభించలేదు. సంక్రాంతి పండగ తర్వాతనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం ఇప్పటికీ ఎందరని మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్న దానిపై యడ్యూరప్పకు స్పష్టత ఇవ్వలేదు.

అంతమందికి అవకాశం లేదంటూ…..

ముఖ్యంగా అనర్హత వేటు పడి తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్యేలందరికీ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేదని అధిష్టానం తేల్చి చెప్పినట్లు తెలిసింది. అది సరైన పద్ధతి కూడా కాదని చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా పార్టీ మారి వచ్చిన వెంటనే ఇంత పెద్ద సంఖ్యలో పదవులు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి యడ్యూరప్ప ప్రామిస్ చేసిన వారిలో పదకొండు మంది విజయం సాధించారు.

కేవలం ఆరుగురికే….

అయితే పదకొండు మందికి ఒకేసారి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేమని అధిష్టానం చేతులెత్తేసినట్లు తెలిసింది. కేవలం ఇందులో ఆరుగురికి మాత్రమే అవకాశముందని కేంద్ర నాయకత్వం ఇప్పటికే సంకేతం పంపిందని చెబుతున్నారు. దీంతో యడ్యూరప్ప పూర్తిగా దిగాలు పడ్డారు. వారివల్లనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిందని, వారిని కాదంటే కష్టమని ఆయన స్వయంగా అమిత్ షాతో చర్చించాలని నిర్ణయించుకున్నారు.

కొంతమందితోనే విస్తరణ….

అమిత్ షా ఈ నెల 18వ తేదీన కర్ణాటక రానున్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణపై చర్చ జరిపే అవకాశముంది. అధిష్టానం మాత్రం ప్రస్తుతం పది నుంచి పదకొండు మందితోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసమ్మతిని చల్లార్చడానికి కొన్ని మంత్రి వర్గ స్థానాలను ఉంచుకోవడం బెటరని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. అదే జరిగితే కేవలం బీజేపీలోనే కాదు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి తలెత్తక మానదు. మరి యడ్యూరప్ప అధిష్టానాన్ని ఒప్పించగలరా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News